ఎస్‌బీఐ లాభం 20% డౌన్
♦ స్టాండెలోన్ ప్రాతిపదికన రూ.2,006 కోట్లు
♦ మొండిబాకీలకు అధిక కేటాయింపులు
న్యూఢిల్లీ: మొండిబాకీలకు అధిక కేటాయింపులతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నికర లాభం (స్టాండెలోన్) 20 శాతం క్షీణించింది. రూ. 2,006 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ1లో లాభం రూ.2,521 కోట్లు. ఆదాయం రూ.48,929 కోట్ల నుంచి రూ. 62,911 కోట్లకు ఎగిసింది. మరోవైపు కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం రూ.867 కోట్ల నుంచి రూ.3,105 కోట్లకు చేరింది. ఆదాయం రూ.69,414 కోట్ల నుంచి స్వల్ప వృద్ధితో రూ. 70,777 కోట్లకు పెరిగింది. ప్రొవిజనింగ్ విషయానికొస్తే.. స్టాండెలోన్ ప్రాతిపదికన మొండి బాకీలకు కేటాయిం పులు రూ.6,339 కోట్ల నుంచి 91 శాతం పెరిగి రూ.12,125 కోట్లకు చేరాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.11,354 కోట్ల నుంచి రూ.12,228 కోట్లకు చేరాయి. అయిదు అనుబంధ బ్యాం కులు, భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేసుకున్న తర్వాత ఎస్‌బీఐ తొలిసారిగా ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలివి.
సెప్టెంబర్ కల్లా అన్ని శాఖల విలీనం..
సమీక్షాకాలంలో ఆగస్టు 6 దాకా మొత్తం 594 శాఖల విలీనం జరిగినట్లు, మొత్తం బ్రాంచీల విలీనం సెప్టెంబర్ నాటికల్లా పూర్తి కాగలదని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. విలీనమైన వాటితో కూడా కలిపి ప్రస్తుతం ఎస్‌బీఐ శాఖల సంఖ్య 23,423గా ఉంది. సిబ్బంది క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా 8,616 మంది ఉద్యోగులను సేల్స్ విభాగంలోకి బదలాయించనున్నట్లు భట్టాచార్య వివరించారు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కింద మొత్తం 3,569 మంది ఉద్యోగులకు రూ. 473 కోట్లు చెల్లించినట్లు, ఈ స్కీమ్‌తో బ్యాంకుపై భారం ఏటా రూ. 400 కోట్లు తగ్గనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇక, కాలక్రమేణా శాఖల క్రమబద్ధీకరణతో వార్షికంగా రూ. 1,160 కోట్లు ఆదా కాగలదన్నారు.
9.97 శాతానికి స్థూల ఎన్‌పీఏలు..
అనుబంధ బ్యాంకుల ఖాతాల్లోని మొండి బాకీలు కూడా తోడవడంతో అసెట్ క్వాలిటీ గణనీయంగా క్షీణించినట్లు బ్యాంకు పేర్కొంది. స్థూల ఎన్‌పీఏలు మొత్తం రుణాల్లో 7.40 శాతం నుంచి 9.97 శాతానికి పెరిగాయని వివరించింది. నికర ఎన్‌పీఏలు 4.36 శాతం నుంచి 5.97 శాతానికి పెరిగాయి. మరోవైపు, లాభదాయకత పరంగా చూస్తే నికర వడ్డీ ఆదాయం సుమారు 4 శాతం తగ్గి రూ. 17,606 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 9 శాతం తగ్గుదలతో రూ. 8,006 కోట్లకు పెరిగింది.
రూ. 26 లక్షల కోట్లకు డిపాజిట్లు..
ఎస్‌బీఐ డిపాజిట్లు 13 శాతం వృద్ధి చెంది రూ. 22.97 లక్షల కోట్ల నుంచి రూ. 26.02 లక్షల కోట్లకు పెరిగాయి. రుణాలు రూ. 18.59 లక్షల కోట్ల నుంచి రూ. 18.86 లక్షల కోట్లకు పెరిగాయి. కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్) నిష్పత్తి 3 శాతం పెరిగి 44.38 శాతానికి చేరింది.
షేరు 5 శాతం డౌన్..
తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేర్లు 5 శాతం మేర పతనమయ్యాయి. దీంతో మార్కెట్ వేల్యుయేషన్ రూ. 13,725 కోట్ల మేర కరిగిపోయి రూ. 2,42,258 కోట్లకు క్షీణించింది. బీఎస్‌ఈలో షేరు 5.36 శాతం తగ్గి రూ. 280.65 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో 5.57 శాతం క్షీణించి రూ. 280.15 వద్ద క్లోజయ్యింది.