న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 5,511 కోట్ల నికర లాభం ఆర్జించింది. త్రైమాసికాలవారీగా చూస్తే ఇది రికార్డు గరిష్ట స్థాయి లాభం. వివిధ విభాగాల్లో రుణ వృద్ధి మెరుగుపడటం, మొండి బాకీలు తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో బ్యాంక్ రూ. 4,251 కోట్ల లాభం నమోదు చేసింది. తాజా క్యూ2లో ఆదాయం రూ. 23,651 కోట్ల నుంచి రూ. 26,031 కోట్లకు పెరిగింది.
ఇవి స్టాండెలోన్ ప్రాతిపదికన ఫలితాలు కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే జూలై–సెప్టెంబర్ క్వార్టర్‌లో బ్యాంకు అత్యధికంగా రూ. 6,092 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇది రూ. 4,882 కోట్లు. ఇక మొత్తం ఆదాయం స్వల్పంగా వృద్ధి చెంది రూ. 39,290 కోట్ల నుంచి రూ. 39,484 కోట్లకు చేరింది. కనిష్టానికి ఎన్‌పీఏలు: బ్యాంక్ ఎన్‌పీఏలు 5.17 శాతం నుంచి 4.82 శాతానికి దిగి వచ్చాయి. ఇక నికర ఎన్‌పీఏలు 1 శాతం నుంచి 0.99 శాతానికి తగ్గాయి. 2014 డిసెంబర్ 31 తర్వాత నికర ఎన్‌పీఏలు ఇంత కనిష్టానికి తగ్గడం ఇదే ప్రథమం.
Comments
Please login to add a commentAdd a comment