జీఎస్‌టీ ఎఫెక్ట్.. వీటి రేట్లు తగ్గాయ్
తగ్గించిన హెచ్‌యూఎల్, హీరోమోటో
న్యూఢిల్లీ
జీఎస్‌టీ అమల్లోకి రావడంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గుతుండటం, కొన్ని పెరుగుతుండటం తెలిసిందే. తాజాగా ఈ తగ్గింపు జాబితాలోకి హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్), హీరో మోటోకార్ప్ చేరాయి. జీఎస్‌టీ వల్ల తమకు లభించే పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయిస్తున్నట్లు పేర్కొన్నాయి.
హెచ్‌యూఎల్ ఇలా...
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్... 250 గ్రాముల బరువుండే రిన్ సబ్బు ధరను రూ.3 తగ్గించింది. రూ.18 నుంచి రూ.15కు చేర్చింది. అదేవిధంగా రూ.10 విలువైన సర్ఫ్ ఎక్సెల్ సబ్బు పరిమాణాన్ని 95 గ్రాముల నుంచి 105 గ్రాములకు పెంచింది. ఇంకా స్నానం సబ్బు డోవ్ బరువును కూడా 33 శాతం పెంచుతున్నట్లు హెచ్‌యూఎల్ వెల్లడించింది. ‘జూలై 1 నుంచి డీలర్లకు పంపే కొన్ని ఉత్పత్తులపై మేం ప్రకటించిన ధరలు, పరిమాణాలకు సంబంధించిన మార్పులు అమల్లోకి వస్తాయి’ అని హెచ్‌యూఎల్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇతర ఉత్పత్తులపై ఏవైనా మార్పులుంటే త్వరలో తెలియజేస్తామని ఆయన చెప్పారు. కాగా, సబ్సులు, డిజర్జెంట్ పౌడర్, టిష్యూ పేపర్, న్యాప్కిన్స్ ఇతరత్రా ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులను 18 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.
హీరోమోటో రూ.400–1,800 కట్
దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ భారీగా అమ్ముడయ్యే తమ వాహనాల రేట్లను రూ.400–1,800 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, రాష్ట్రాలను బట్టి(జీఎస్‌టీ ముందు, తర్వాత పన్ను రేట్లకు అనుగుణంగా) ఈ ధరల తగ్గింపులో వ్యత్యాసాలు ఉంటాయని కంపెనీ పేర్కొంది. కొన్ని మార్కెట్లలో(రాష్ట్రాలు) ప్రీమియం వాహన మోడళ్లపై ధర రూ.4,000 వరకు కూడా తగ్గుతుందని కంపెనీ వివరించింది. కాగా, కార్ల కంపెనీలు మారుతీ సుజుకీ, టయోటా కిర్లోస్కర్, టాటామోటార్స్ జేఎల్‌ఆర్, బీఎండబ్ల్యూ... జీఎస్‌టీ అమలు నేపథ్యంలో రేట్లను రూ.2,300–రూ.2 లక్షల మేర తగ్గిస్తున్నట్లు శనివారం ప్రకటించిన విషయం విదితమే. మారుతీ చాలావరకూ తమ మోడళ్లపై 3 శాతం వరకూ ధర తగ్గించింది. అయితే, పాక్షిక హైబ్రిడ్ టెక్నాలజీ ఉన్న సియాజ్, ఎర్టిగా డీజిల్ వెర్షన్ల రేట్లను మాత్రం రూ.లక్ష పైగానే పెంచుతున్నట్లు ప్రకటించింది.