gst effect
-
గుజరాత్ బీజేపీదే...కానీ!!!
ఏకపక్షమనుకున్న గుజరాత్ ఎన్నికలు హోరాహోరీగా మారుతున్నట్లు ప్రీపోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరోసారి బీజేపీకే అధికారం దక్కుతుందని చెబుతున్నా.. కమలం పార్టీ ఆశించినన్ని స్థానాలు రాకపోవచ్చని చెబుతున్నాయి. ఏబీపీ–సీఎస్డీఎస్ సర్వే బీజేపీకి 91–99 స్థానాలు, కాంగ్రెస్‌కు 76–88 స్థానాలు వస్తాయని అంచనా వేయగా.. టైమ్స్‌నౌ–వీఎంఆర్ బీజేపీ 111 సీట్లు, కాంగ్రెస్ 68 సీట్లు గెలవొచ్చని తెలిపింది. అటు కాంగ్రెస్ పుంజుకుంటోంది. నాలుగు నెలల్లో 14% ఓటుబ్యాంకును పెంచుకుంది. న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. కుల, మత సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. దీంతో బీజేపీకి ఏకపక్ష ఫలితాలను తెలిపిన తొలి రెండు ఒపీనియన్ సర్వేలకు భిన్నంగా తాజా సర్వేలో కాంగ్రెస్ పుంజుకుంటున్నట్లు స్పష్టమైంది. బీజేపీకే అధికారం దక్కుతుందని చెబుతున్నా.. సీట్ల సంఖ్య తగ్గొచ్చని ఏబీపీ–సీఎస్డీఎస్, టైమ్స్‌నౌ తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఏబీపీ సర్వే ప్రకారం బీజేపీ 91–99 స్థానాల్లో, కాంగ్రెస్ 76–88 చోట్ల గెలిచే అవకాశాలున్నాయి. అయితే టైమ్స్ నౌ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా 5 శాతం ఉంటుందని.. బీజేపీ 111 స్థానాలను, కాంగ్రెస్ 68 స్థానాలను కైవసం చేసుకుంటాయని పేర్కొంది. అయితే బీజేపీ అనుకుంటున్నట్లుగా 150+ మార్కును చేరుకోవటం అసంభవమని రెండు సర్వేలు స్పష్టం చేశాయి. మొత్తం సీట్లు 182 కాగా, మేజిక్ ఫిగర్ 92. టైమ్స్‌నౌ సర్వే ప్రకారం.. ప్రాంతాల వారీగా బీజేపీ గెలిచే స్థానాల్లో పెద్దగా మార్పులేకపోయినా ఓట్ల శాతంలో స్వల్ప తగ్గుదల ఉందని టైమ్స్‌నౌ–వీఎంఆర్ సర్వే పేర్కొంది. మధ్య గుజరాత్లో బీజేపీకి 46 శాతం, కాంగ్రెస్‌కు 41 శాతం మంది అనుకూలంగా స్పందించగా.. కచ్, సౌరాష్ట్రల్లో బీజేపీ–44, కాంగ్రెస్–41, ఉత్తర గుజరాత్లో బీజేపీ–45, కాంగ్రెస్–42, దక్షిణ గుజరాత్లో బీజేపీ–46, కాంగ్రెస్–37 శాతం మద్దతు వ్యక్తమైంది. 2012తో పోలిస్తే అధికార పార్టీకి 3 శాతం ఓట్లు తగ్గగా.. కాంగ్రెస్ 1శాతం ఓటు బ్యాంకును పెంచుకున్నట్లు తెలిసింది. అయితే, ఈ ఏడాది ఆరంభంలో వరదలతో అతలాకుతలమైన ఉత్తర గుజరాత్లో బీజేపీ 5 శాతం ఓట్లను కోల్పోనుందని టైమ్స్‌నౌ సర్వే వెల్లడించింది. అయితే మొత్తం ఓటర్లలో కేవలం 7 శాతం మందే.. ఈ ఎన్నికల్లో కుల ప్రభావం ఉంటుందని అభిప్రాయపడగా.. 31 శాతం మంది పార్టీ ప్రభావం ఉంటుందని, 23 శాతం మంది ‘గుజరాత్ గౌరవాన్ని కాపాడటం’ కీలకాంశమని తెలిపారు. టైమ్స్‌నౌ–వీఎంఆర్ సర్వేలో వెల్లడైనవి: ► హార్దిక్, జిగ్నేశ్‌లతో దోస్తీ వల్ల కాంగ్రెస్‌కే లాభమని 47 శాతం మంది అభిప్రాయపడ్డారు. బీజేపీ ఇప్పటికీ రాష్ట్రంలో అత్యంత బలమైన పార్టీ అని 34 శాతం మంది పేర్కొన్నారు. ► ప్రపంచబ్యాంకు, మూడీస్ రేటింగ్ వల్ల బీజేపీకి మేలు జరిగిందని 52 శాతం మంది, కాదని 37 శాతం తెలిపారు. ► జీఎస్టీ పన్నురేట్లలో మార్పు బీజేపీకి కలిసొస్తుందా? అంటే.. 45 శాతం అవునని, 46 శాతం కాదన్నారు. ► రాహుల్ దేవాలయాల సందర్శన కాంగ్రెస్‌కు ఓట్లు తెస్తుందా? అంటే 45 శాతం అవునని, 55 శాతం కాదని చెప్పారు. ► రాహుల్ ఒక్కరే కాంగ్రెస్‌ను రాష్ట్రంలో అధికారంలోకి తేగలరా? అన్న ప్రశ్నకు 37 శాతం అవునని, 39 శాతం కాదన్నారు. 24 శాతం మంది మాత్రం ఇతరుల సాయం అవసరమన్నారు. ► సర్దార్ సరోవర్ డ్యామ్ వంటి భారీ ప్రాజెక్టులు మోదీకి, బీజేపీకి మేలు చేస్తాయా? అంటే 71 శాతం మంది అవునని, 29 శాతం కాదన్నారు. ఏబీపీ–సీఎస్డీఎస్ సర్వే ప్రకారం.. గుజరాత్లో 22 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నెమ్మదిగా పుంజుకుంటోంది. ఆగస్టులో తొలి విడత సర్వే ఫలితాలతోపోలిస్తే.. నవంబర్ చివరి వారంలో నిర్వహించిన తాజా సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 14 శాతం వరకు ఓట్లను అదనంగా సంపాదించుకోనున్నట్లు తేలింది. అటు బీజేపీ ఓట్ల శాతం కూడా నెమ్మదిగా (ఆగస్టులో 59 శాతం ఓట్లతో 144–152 సీట్లు)తగ్గుతోంది. తాజా అంచనాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో 43 శాతం ఓట్లు పొందుతాయని వెల్లడైంది. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ ఆధిక్యం కనబరుస్తుండగా.. ఉత్తర, దక్షిణ, మధ్య గుజరాత్‌లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. దక్షిణ గుజరాత్లో బీజేపీకి 40 శాతం మంది, కాంగ్రెస్‌కు 42 శాతం ఆమోదం తెలిపినట్లు సర్వే చెబుతోంది. ఉత్తర గుజరాత్‌లోని గ్రామాల్లో 41 శాతం మంది బీజేపీ వెంట ఉండగా.. 56 శాతం మంది కాంగ్రెస్‌కే పట్టంగడతామని చెబుతున్నారు. మధ్య గుజరాత్లో బీజేపీకి 41 శాతం మంది, కాంగ్రెస్‌కు 40 శాతం మంది మద్దతు తెలిపారు. వ్యాపారులపైనా జీఎస్టీ ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. ఇన్నాళ్లూ బీజేపీకి అండగా ఉన్న వ్యాపారుల్లో ఈసారి 43 శాతం మంది కాంగ్రెస్‌కు, 40 శాతం మంది కమలం పార్టీకి మద్దతు తెలిపారు. కులాల వారీగా.. ఎప్పటిలాగే అగ్రవర్ణ ఓటర్లు బీజేపీకే పట్టం గట్టగా.. కోలీలు, ఓబీసీలూ అధికార పార్టీకే జై కొడుతున్నారు. అటు పటేళ్లకు కాంగ్రెస్‌కు మద్దతిస్తారని భావిస్తున్నా.. ఈ వర్గంలోనూ బీజేపీయే మెజారిటీ ఓట్లు గెలుచుకోవచ్చని తెలుస్తోంది. అయితే, హార్దిక్ పటేల్‌కు అండగా నిలుస్తున్న పటేళ్లతోపాటు ముస్లింలు, దళితులు కాంగ్రెస్‌తోనే నడవాలనుకుంటున్నట్లు సర్వేలో తేలింది. మొదటినుంచీ బీజేపీకి అండగా ఉంటున్న ఆదివాసీలూ ఈసారి కాంగ్రెస్‌కు ఓటేయాలనుకుంటున్నట్లు వెల్లడైంది. క్షత్రియుల ఓట్లూ చీలుతున్నా మెజారిటీ వర్గం హస్తానికే మద్దతివ్వాలనుకుంటున్నారు. అయితే గుజరాతీ ప్రధానిగా ఉన్న మోదీ ప్రభావం కాస్త తగ్గుతోందని ఏబీపీ సర్వే పేర్కొంది. ఆగస్టు సర్వేలో 82 శాతం మంది మోదీనే ఉత్తమ నేతగా పేర్కొనగా.. తాజా సర్వేలో మోదీపై గుజరాతీల అభిమానం 64 శాతానికి తగ్గిపోయింది. బీజేపీకి మరోసారి అవకాశం ఇవ్వటంపైనా గతంలో 50 శాతం మద్దతు తెలిపిన గుజరాతీల సంఖ్య ఈసారి 35 శాతానికి చేరింది. 39 శాతం మంది ప్రభుత్వం మారటమే సరైందని అభిప్రాయపడ్డారు. -
క్రికెట్ అభిమానులకు షాక్..
♦ భారీగా పెరగిన వన్డే మ్యాచ్ టికెట్ ధరలు ♦ టికెట్ ధరలపై జీఎస్టీ ఎఫెక్ట్.. కొల్కతా: భారత క్రికెట్ అభిమానులకు జీఎస్టీతో గట్టి దెబ్బ తగిలింది. వినోదపు కార్యక్రమాలపై కేంద్రం 28 శాతం జీఎస్టీ పన్ను విధించడంతో వన్డేమ్యాచ్ టికెట్ ధరలు భారీగా పెరిగాయి. వచ్చే నెల భారత్‌లో ఆస్ట్రేలియాతో జరిగే 5 వన్డేల సీరిస్‌పై ఈ ప్రభావం పడనుంది. ఇక రూ.1300 టికెట్ ధర జీఎస్టీ ప్రభావంతో ఒక్కసారిగా రూ.1900 పెరిగింది. వెయ్యి టికెట్ రూ.1500 అవ్వగా మాములు రూ.500 టికెట్ ధర రూ.650 అయింది. కాగా మ్యాచ్ టికెట్ ధరలు ఏమి పెరగలేదని, కేవలం జీఎస్టీ మాత్రమే కలిపామని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఒక మ్యాచ్ సెప్టెంబర్ 21న ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుందని గంగూలీ పేర్కొన్నాడు. నవంబర్‌లో శ్రీలంకతో జరిగే టెస్టు మ్యాచ్ టికెట్లపై జీఎస్టీ ప్రభావం ఉండదని స్పష్టం చేశాడు. ఒక రోజుకు రూ.100గా ఉండే ఈ టికెట్ ధరపై జీఎస్టీ ప్రభావం లేదని తెలిపాడు. స్వదేశంలో భారత్‌ను ఢీకొట్టడం అతిథ్య జట్టైన ఆసీస్‌కు పెద్ద సవాలేనని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఆ జట్టు ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ గాయం నుంచి కోలుకోకపోవడం ఆసీస్‌కు ఇబ్బందికరమైన విషయమని ఈ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. -
సూక్ష్మ సాగుపైనా జీఎస్టీ పిడుగు
- డ్రిప్ యూనిట్లపై 18శాతం భారం పడే అవకాశం - జీఎస్టీ ఎవరు భరిస్తారన్న దానిపై అస్పష్టత - రైతులపై వేస్తే ఏటా రూ.5 కోట్లకు పైగా అదనపు భారం - ప్రస్తుతానికి డ్రిప్ మంజూరు ప్రక్రియ ఆపేసిన ఏపీఎంఐపీ అనంతపురం అగ్రికల్చర్: బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్ల) పరికరాల మంజూరు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. జూలై ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన వస్తు సేవా పన్ను (జీఎస్టీ) కారణంగా గందరగోళం నెలకొంది. జీఎస్టీ భారం నుంచి రైతులకు ఉపశమనం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా సూక్ష్మసాగు సేద్యం పరికరాల విషయాన్ని పొందుపర్చకపోవడంతో ఆయోమయం నెలకొంది. 18 శాతం జీఎస్టీ అమలులోకి రావడంతో ఈ భారాన్ని ఎవరు భరిస్తారనే దానిపై స్పష్టత లేదు. దీంతో ప్రస్తుతానికి పరికరాల మంజూరు, ఇన్స్టాలేషన్ (బిగింపు) నిలిపేశారు. డ్రిప్ కంపెనీల నుంచి మెటీరియల్ సరఫరా ఆగిపోవడంతో బ్రేకులు పడ్డాయి. రూ.లక్ష విలువ చేసే పరికరాలపై రూ.18 వేలు జీఎస్టీ రైతులు భరించాలా లేదా కంపెనీలా... లేదంటే ప్రభుత్వమే భారం మోస్తుందా అనేది ఇప్పటివరకు స్పష్టతలేదు. రూ.లక్ష విలువైన పరికరాలపై వ్యాట్ రూపంలో 5 శాతం పన్ను విధిస్తున్నా, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ రావడంతో రైతులు కేవలం తమ వాటా కింద రాయితీ సొమ్ము మాత్రమే చెల్లిస్తున్నారు. ఇపుడు 5 శాతం , వాట్‌ను రద్దు చేసి 18 శాతం జీఎస్టీ వర్తింపజేయడం, దాన్ని ఎవరు చెల్లిస్తారనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వక సూక్ష్మసాగు సేద్యం పరికరాల పంపిణీ ఆపేశారు. రూ.కోట్లలో భారం : ఏపీపీఎంఐపీ ద్వారా ప్రస్తుతం ఒక్కో రైతుకు రూ.2 లక్షల విలువైన డ్రిప్ పరికరాలు అందజేస్తున్నారు. దీని ప్రకారం రూ.లక్షకు రూ.18 వేలు చొప్పున రెండు లక్షలకు రూ.36 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వం భరిస్తున్న 5 శాతం మినహాయించినా ఇంకా లక్షకు రూ.13 వేలు చొప్పున రెండు లక్షల విలువైన పరికరాలకు రూ.26 వేలు చెల్లించాల్సి ఉంటుంది. తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదంటూ డ్రిప్ కంపెనీలు, ఏపీఎంఐపీ అధికారులు చెప్తున్నారు.దీంతో రైతులకు అర్థంకాకుండా పోతోంది. 13 శాతం లేదా 18 శాతం పన్ను రైతులు భరించాల్సి వస్తే జిల్లా రైతులపై రూ.5 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. ఈ ఏడాది కనీసం 20 వేల మంది రైతులకు 31,750 హెక్టార్లకు సరిపడా డ్రిప్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో జీఎస్టీ భారం ఇబ్బంది పెడుతోంది. రైతులపై భారం వేయకుండా త్వరిగతిన ఉత్తర్వులు ఇచ్చి డ్రిప్ యూనిట్లు సకాలంలో అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. వారోత్సవాల్లో ఏపీఎంఐపీ అధికారులు : జీఎస్టీతో తాత్కాలికంగా డ్రిప్ యూనిట్లు మంజూరు, బిగింపు ప్రక్రియ ఆపేసిన ఏపీఎంఐపీ అధికారులు వారోత్సవాల పేరుతో వేరే పనులు చేస్తున్నారు. రైతుల గడప వద్దకే డ్రిప్ రిజిష్ట్రేషన్లు అంటూ 10 నుంచి 15వ తేదీ వరకు రిజిష్ట్రేషన్ల వారోత్సవం చేపట్టారు. ఇందులో 12 వేల సంఖ్యలో రిజిష్ట్రేషన్లు రావడంతో వాటిని క్షేత్రస్థాయిలో ప్రాథమిక పరిశీలన (ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ రిపోర్టు–పీఐఆర్) చేయాలని ఈనెల 24 నుంచి 29వ తేదీ వరకు పీఆర్ఆర్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 5న స్పష్టత వస్తుంది జీఎస్టీ భారం ఎవరు భరిస్తారనేదానిపై స్పష్టత లేదనేది వాస్తవమే. దీని కారణంగా డ్రిప్ మంజూరు ప్రక్రియ ఆపేయలేదు. డీడీలు వస్తున్నాయి, మంజూరు చేస్తున్నాం. రైతులు, కంపెనీలు, డిపార్ట్మెంట్కు కూడా క్లారిటీ లేకపోవడం మంజూరు ప్రక్రియ బాగా తగ్గిపోయింది. అయితే ఐదారు కంపెనీలు జీఎస్టీతో సంబంధం లేకుండా మెటీరియల్ సరఫరాకు ముందుకు రావడంతో అత్యవసరమైన రైతులకు ఆ కంపెనీల ద్వారా డ్రిప్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఆగస్టు 5న ఢిల్లీలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ మీట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. – ఎం.వెంకటేశ్వర్లు, ఏపీఎంఐపీ పీడీ -
చేనేత వ్యాపారాలు బంద్
- నేటి నుంచి నేతన్నల పోరుబాట –జీఎస్టీ ఎత్తివేసేవరకూ కొనసాగనున్న ఆందోళనలు –రూ. కోట్లలో నిలిచిపోనున్న వ్యాపార లావాదేవీలు –శుభమూహార్తాల సీజన్లో వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ధర్మవరం: శ్రావణ మాసం.. శుభముహూర్తాల సీజన్..ఈ సీజన్ వెళ్లిపోతే మరో మూడు నెలలు ఖాళీగా ఉండాల్సిందే.. ఇటువంటి పరిస్థితుల్లో చేనేతలు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు..చేనేత రంగంపై జీఎస్టీ భారం ఎత్తివేసేవరకూ చేనేతకు సంబంధించిన ఏ లావాదేవీ నిర్వహించమని, అప్పటి దాకా ఏ ఒక్క శిల్క్హౌస్ను తెరవబోమని తేల్చిచెబుతున్నారు. దీంతో దాదాపు రోజూ కోట్లలో టర్నోవర్ జరిగే వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుంది. ధర్మవరం పట్టణంలో దాదాపు 2,000 శిల్క్‌హౌస్‌లు ఉన్నాయి..వీటిలో సాధారణ పరిస్థితుల్లో అయితే రూ. 5 కోట్ల నుంచి సీజన్లో అయితే ప్రతి రోజూ దాదాపు రూ.25 కోట్ల మేర టర్నోవర్ జరుగుతుంది. సరాసరిగా ఇక్కడ ప్రతి రోజూ పట్టుచీరల విక్రయం/ కొనుగోళ్ల ద్వారా దాదాపు రూ. 10 కోట్ల మేర లావాదేవీలు జరుగుతాయి. అయితే కేంద్ర ప్రభుత్వం చేనేత ముడిసరుకులైన పట్టు దారంపై 5 శాతం, జరీపై 12 శాతం, పట్టుచీరల విక్రయంపై 5 శాతం జీఎస్టీని విధించింది. దీంతో ఇటు చేనేత కార్మికులపైనా, అటు వస్త్ర వ్యాపారులపైనా భారం పడుతోంది. ఇప్పటి దాకా చేనేతకు సంబంధించిన లావాదేవీలపై ఎటువంటి పన్నులు విధించిన దాఖలాలు లేవు. అయితే జీఎస్టీ అమలులో భాగంగా చేనేత రంగాన్ని కూడా ఇందులో చేర్చడం పట్ల చేనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేనేత రంగంపై జీఎస్టీని ఎత్తివేసే వరకూ తాము వ్యాపారలావాదేవీలు నిర్వహించబోమంటున్నారు. రోజుకో రీతిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. కోట్లలో నష్టం చేనేతల నిరవధిక బంద్ నిర్ణయంతో చేనేత పరిశ్రమకు రూ. కోట్లలో నష్టం వాటిల్లే ప్రమాదముంది. ముఖ్యంగా శ్రావణమాసం శుభమూహూర్తాల సీజన్.. ఈ సీజన్లోనే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు తదితర శుభకార్యాలకు పట్టు వస్త్రాల కొనుగోలు అధికంగా ఉంటాయి. ఇటుపరిస్థితుల్లో నిరవధిక బంద్ చేస్తే చేనేత పరిశ్రమకు రూ. కోట్లలో నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. మరోవైపు వినియోగదారులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక సీజన్ వెళ్లిపోతే మూడు నెలల పాటు చీరలను నిల్వ ఉంచుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఈ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని వారికి న్యాయం చేయకపోతే చేనేత రంగానికే ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలి చేనేత రంగంపై ఇప్పటి వరకు పన్నులు విధించ లేదు. ఇప్పటికే చేనేత రంగం సంక్షోభంతో కనుమరుగైపోతోంది. జీఎస్టీ అమలైతే చేనేతలు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జీఎస్టీ నుంచి చేనేత రంగానికి మినహాయింపు ఇవ్వాలి. అంతవరకూ పోరాడుతాం. - మామిళ్ల ప్రసాద్, శిల్క్‌హౌస్ యజమాని, ధర్మవరం చేనేతరంగానికి పెద్ద దెబ్బ జీఎస్టీ అమలైతే చేనేత రంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటికే «ముడిసరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జీఎస్టీ అమలు మరింత భారం కానుంది. చేనేత రంగాన్ని జీఎస్టీ నుంచి ఉపసంహరించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. జీఎస్టీని ఎత్తివేయాలన్న డిమాండ్‌తో ఉద్యమాలకు రూపకల్పన చేస్తున్నాం. ఎత్తివేసే వరకూ పోరాడుతాం. -చందా రాఘవ, మాస్టర్ వీవర్, ధర్మవరం -
బతుకు చిక్కు!
జీఎస్టీ వలలో నేతన్న - మూడు దశల్లో విక్రయాలపై పన్ను - కొనుగోలుదారునిపై రూ.1200పైనే భారం - ఇప్పటికే సంక్షోభంలో చేనేత - తాజా పన్నుతో ఉక్కిరిబిక్కిరి - పోరాటానికి సిద్ధమవుతున్న కార్మికులు చేనేత కార్మికునికి సచ్చేదాకా సగం గుంత.. సచ్చినాక నిండు గుంత అన్న ఓ కవి మాటలను పాలక ప్రభుత్వాలు నిజం చేస్తున్నాయి. మగ్గం గుంతల్లో ఎదుగూబొదుగూ లేని జీవితం గడుపుతున్న చేనేతలపై జీఎస్టీ పిడుగు పడింది. అసలే అవసాన దశలో ఉన్న చేనేత రంగం ఉనికిని నూతన పన్ను విధానం ప్రశ్నార్థకం చేస్తోంది. జీఎస్టీ అమలు ఇలా.. ముడిపట్టు : 5శాతం జరీ : 12శాతం అద్దకం రంగులు : 18శాతం పట్టు వస్త్రం : 5శాతం ధర్మవరం: చేనేత రంగాన్ని జీఎస్టీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా పన్ను భారం మోపడంతో కార్మికులు వీధిన పడే పరిస్థితి నెలకొంది. యంత్రాలతో తయారయ్యే వస్త్రంపై 5 శాతం జీఎస్టీ అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇదే కోవలోకి చేతివృత్తుల ద్వారా తయారయ్యే పట్టు వస్త్రాన్ని కూడా చేర్చడం చేనేతలపై పెను ప్రభావం చూపుతోంది. పట్టు వస్త్రం తయారీ నుంచి విక్రయం వరకు నూతన పన్ను విధానం ముప్పుతిప్పలు పెడుతోంది. ఒక పట్టు చీరను తయారు చేసేందుకు రూ.500 నుంచి రూ.1500 భారం అవుతుండగా.. వినియోగదారునిపై ఈ భారం మరింత పెరిగి రూ.1200 పైగా చేరుకుంటోంది. జిల్లాలో ప్రతి రోజూ 50 నుంచి 60వేల పట్టు చీరలు తయారవుతున్నాయి. ఈ లెక్కన చేనేత రంగం కోట్లలో జీఎస్టీ భారం మోయాల్సి వస్తోంది. యంత్రాలకు.. చేతి వృత్తులకు ముడి తగదు బ్రిటీష్ హయాంలో కూడా చేనేత వస్త్రంపై పన్ను వేసిన దాఖలాలు లేవు. ఎన్డీఏ ప్రభుత్వం యంత్రాల తయారీకి, చేతివృత్తుల తయారీకి తేడా లేకుండా పట్టు వస్త్రాలపై పన్ను విధించడాన్ని చేనేత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా చేనేత వస్త్రంపై పన్ను వేశారని, అయితే పోరాటల ద్వారా పన్ను ఎత్తివేయించుకున్నారు. తిరిగి అదే రీతిలో చేనేత కార్మికులందరూ కలిసి కట్టుగా జీఎస్టీపై పోరాటానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ధర్మవరం పట్టణంలోని శిల్క్హౌస్లను మూడు రోజుల పాటు మూసివేసి నిరసన తెలిపారు. ఇది కోలుకోలేని దెబ్బ ఇప్పటికే చేనేతలకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేసి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీఎస్టీ అమలు కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు చేనేతపై జీఎస్టీ ఎత్తివేతకు చొరవ తీసుకోవాలి. –రంగన అశ్వర్థనారాయణ, కాంగ్రెస్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి నేతన్నపై పెనుభారం ముడిపట్టు కొనుగోలు నుంచి పట్టు చీర విక్రయం వరకు పన్ను విధిస్తే ఎలా? ఈ రంగంపై ఆధారపడి జిల్లాలో లక్షలాది మంది జీవిస్తున్నారు. వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేనేత రంగంపై విధించిన జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలి. –బీరే ఎర్రిస్వామి, వైఎస్సార్సీసీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు వ్యవస్థ మనుగడకే అడ్డంకి: అసలే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగంపై జీఎస్టీ అమలు పెద్ద దెబ్బ. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చాలామంది చేనేత కార్మికులు మగ్గాలు వదిలి ఇతర రంగాల్లోకి వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పన్నుల భారం తగదు. –గడ్డం పార్థసారథి, చేనేత తయారీదారుల సంఘం నాయకుడు -
జీఎస్టీ ఎఫెక్ట్.. వీటి రేట్లు తగ్గాయ్
తగ్గించిన హెచ్‌యూఎల్, హీరోమోటో న్యూఢిల్లీ జీఎస్టీ అమల్లోకి రావడంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గుతుండటం, కొన్ని పెరుగుతుండటం తెలిసిందే. తాజాగా ఈ తగ్గింపు జాబితాలోకి హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్), హీరో మోటోకార్ప్ చేరాయి. జీఎస్టీ వల్ల తమకు లభించే పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయిస్తున్నట్లు పేర్కొన్నాయి. హెచ్‌యూఎల్ ఇలా... ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్... 250 గ్రాముల బరువుండే రిన్ సబ్బు ధరను రూ.3 తగ్గించింది. రూ.18 నుంచి రూ.15కు చేర్చింది. అదేవిధంగా రూ.10 విలువైన సర్ఫ్ ఎక్సెల్ సబ్బు పరిమాణాన్ని 95 గ్రాముల నుంచి 105 గ్రాములకు పెంచింది. ఇంకా స్నానం సబ్బు డోవ్ బరువును కూడా 33 శాతం పెంచుతున్నట్లు హెచ్‌యూఎల్ వెల్లడించింది. ‘జూలై 1 నుంచి డీలర్లకు పంపే కొన్ని ఉత్పత్తులపై మేం ప్రకటించిన ధరలు, పరిమాణాలకు సంబంధించిన మార్పులు అమల్లోకి వస్తాయి’ అని హెచ్‌యూఎల్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇతర ఉత్పత్తులపై ఏవైనా మార్పులుంటే త్వరలో తెలియజేస్తామని ఆయన చెప్పారు. కాగా, సబ్సులు, డిజర్జెంట్ పౌడర్, టిష్యూ పేపర్, న్యాప్కిన్స్ ఇతరత్రా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. హీరోమోటో రూ.400–1,800 కట్ దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ భారీగా అమ్ముడయ్యే తమ వాహనాల రేట్లను రూ.400–1,800 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, రాష్ట్రాలను బట్టి(జీఎస్టీ ముందు, తర్వాత పన్ను రేట్లకు అనుగుణంగా) ఈ ధరల తగ్గింపులో వ్యత్యాసాలు ఉంటాయని కంపెనీ పేర్కొంది. కొన్ని మార్కెట్లలో(రాష్ట్రాలు) ప్రీమియం వాహన మోడళ్లపై ధర రూ.4,000 వరకు కూడా తగ్గుతుందని కంపెనీ వివరించింది. కాగా, కార్ల కంపెనీలు మారుతీ సుజుకీ, టయోటా కిర్లోస్కర్, టాటామోటార్స్ జేఎల్ఆర్, బీఎండబ్ల్యూ... జీఎస్టీ అమలు నేపథ్యంలో రేట్లను రూ.2,300–రూ.2 లక్షల మేర తగ్గిస్తున్నట్లు శనివారం ప్రకటించిన విషయం విదితమే. మారుతీ చాలావరకూ తమ మోడళ్లపై 3 శాతం వరకూ ధర తగ్గించింది. అయితే, పాక్షిక హైబ్రిడ్ టెక్నాలజీ ఉన్న సియాజ్, ఎర్టిగా డీజిల్ వెర్షన్ల రేట్లను మాత్రం రూ.లక్ష పైగానే పెంచుతున్నట్లు ప్రకటించింది. -
జీఎస్టీ ఎఫెక్ట్: ఐ ఫోన్, ఐ ప్యాడ్ ధరల్లో కోత
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నేటి(జూలై 1) నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో యాపిల్ సంస్థ తన ఉత్పత్తుల ధరలను ఇండియాలో గణనీయంగా తగ్గించింది. ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్ లపై గరిష్ట రిటైల్ ధరల్లో తగ్గింపును ప్రకటించింది. దాదాపు7.5 శాతం ధరలను తగ్గించి భారతీయులకు జీఎస్టీ గిఫ్ట్ అందించింది. కొన్ని మినహాయింపులతో మాక్ లైన్ కంప్యూటర్లను తగ్గింపు ధరల్లో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. భారతదేశంలో ఐఫోన్ ధరలు ఎలా మారాయో ఇక్కడ చూడండి ఐఫోన్ ఎస్ ఈ 32 జీబీ అసలు ధరరూ. 27,200 ప్రస్తుత ధర రూ. 26,000 128 జీబీ అసలు ధర రూ. 37,200 ప్రస్తుత ధర రూ. 35,000 ఐఫోన్ 6ఎస్ 32 జీబీ అసలు ధర రూ. 50 వేలు, ప్రస్తుత ధర రూ. 46, 900 128 జీబీ అసలు ధర రూ. 60 వేలు ప్రస్తుత ధర రూ. 55,900 ఐఫోన్ 6 ఎస్ ప్లస్ 32 జీబీ అసలు ధర రూ. 60 వేలు, ప్రస్తుత ధర రూ. 56, 100 128 జీబీ అసలు ధర రూ. 70 వేలు ప్రస్తుత ధర రూ. 65వేలు ఐఫోన్ 7 32 జీబీ అసలు ధర రూ. 60 వేలు, ప్రస్తుత ధర రూ. 56, 200 128 జీబీ అసలు ధర రూ. 70 వేలు ప్రస్తుత ధర రూ. 65,200 256 జీబీ అసలు ధర రూ. 80 వేలు ప్రస్తుత ధర రూ.74,400 ఐఫోన్ 7 ప్లస్ 32 జీబీ అసలు ధర రూ. 72వేలు, ప్రస్తుత ధర రూ. 67, 300 128 జీబీ అసలు ధర రూ. 82 వేలు ప్రస్తుత ధర రూ. 76,200 256 జీబీ అసలు ధర రూ. 92 వేలు ప్రస్తుత ధర రూ.85,400 -
చేనేతపై జీఎస్టీ పిడుగు
– చేనేత రంగంపై పన్నులు విధించడం ఇదే ప్రథమం – పెరగనున్న ఉత్పత్తి వ్యయం – ఎత్తివేయాలంటున్న నాయకులు ధర్మవరం : దేశ ఆర్థిక వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి చేనేత రంగానికి పన్ను మినహాయింపు ఉంది. అలాంటిది జీఎస్టీలో చేనేత రంగాన్ని కూడా మిళితం చేయడంతో చేనేత పరిశ్రమపై కూడా పన్నుల భారం పడనుంది. అసలే ముడిసరుకుల ధరలు పెరిగి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగాన్ని జీఎస్టీ మరిన్ని కష్టాల్లోకి నెట్టనుంది. పన్నుల మోత ధర్మవరం, హిందూపురం, ముదిరెడ్డిపల్లి, సిండికేట్‌నగర్, ఉరవకొండ, యాడికి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు దాదాపు లక్ష నుంచి 1.25 లక్షల వరకు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 40 వేల దాకా చేనేత మగ్గాలు ఉండగా, మరో 15 వేల దాకా మరమగ్గాలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా డైయింగ్, రీలింగ్, మగ్గం సామాన్ల విక్రయం, శిల్క్‌హౌస్‌లు, పాలిస్, డిజైన్ మేకింగ్, అట్టులు తయారీ తదితర వ్యాపారాలు ఉన్నాయి. జీఎస్టీ అమలైతే వస్త్రాలపై వివిధ దశల్లో 5, 12,18 శాతం వరకు పన్నులు పడనున్నాయి. అయితే రేషం గూడు నుంచి తీసిన దారానికి (ముడిపట్టు) మాత్రమే జీఎస్టీలో పన్ను మినహాయింపు ఉంది. ముడిపట్టుకు రంగులు అద్దితే జీఎస్టీ పరిధిలోకి వచ్చేస్తుంది. అప్పటి నుంచి జరీ, రేషంలపై జీఎస్టీ భారం పడుతుంది. దీంతో పట్టు చీర తయారయ్యేందుకు అయ్యే ఖర్చు దాదాపు 15 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఆకాశంలో ధరలు ప్రస్తుతం మార్కెట్లో ముడిపట్టు ధరలు కిలో రూ.4,000 నుంచి రూ.4,500 వరకు ఉన్నాయి. కిలో రేషానికి రంగులు అద్దిచ్చేందుకు మరో రూ.300 దాకా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం సాధారణ జరీ మార్కు (నాలుగు బిల్లలు) రూ.400 నుంచి గరిష్టంగా రూ.1500 వరకు పలుకుతోంది. అదే జీఎస్టీ అమలైతే వాటిపైన 5 నుంచి 15 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. దాదాపు ఒక పట్టుచీర గతంలో రూ.4,000 లకు తయారయితే జీఎస్టీ తరువాత ఆ ఖర్చు రూ.4,500 నుంచి 4,800 వరకు పెరిగే అవకాశాలున్నాయి. జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలి చేనేత రంగంపై ఇప్పటి వరకు పన్నులు విధించిన దాఖలాలు లేవు. కొత్తగా పన్నులు విధించడం ఏంటని చేనేత సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే చేనేత రంగం సంక్షోభంతో కనుమరుగైపోతోందని, జీఎస్టీ అమలైతే చేనేతలు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. జీఎస్టీ నుంచి చేనేత రంగానికి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అందరూ పోరాడాల్సిందే చేనేత రంగాన్ని జీఎస్టీ నుంచి మినహాయించాలని వైఎస్సార్సీపీ తరపున కేంద్రాకిని విన్నవించాము. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిసి ఇక్కడి పరిస్థితులను వివరించాము. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై అందరూ ఏకతాటిపై నిలబడి పోరాడాల్సిందే. –గిర్రాజు నగేష్, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యులు చేనేత రంగానికి పెద్ద దెబ్బ జీఎస్టీ అమలు జరిగితే చేనేత రంగానికి తీవ్రనష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే చేనేతలకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేసి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. జీఎస్టీని ఎత్తివేయాలన్న డిమాండ్‌తో ఉద్యమాలకు రూపకల్పన చేస్తున్నాము. - పోలా రామాంజినేయుడు, ఏపి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు -
జీఎస్టీ ఎఫెక్ట్: కార్లపై భారీ డిస్కౌంట్స్
న్యూఢిల్లీ: జులై 1 నుంచి గూడ్స్ సర్వీసు టాక్స్ (జీఎస్టీ) అమల్లోకి రానున్న నేపథ్యంలో వివిధ వాహన తయారీదారులు, కంపెనీల డీలర్లు కార్ల ధరలను భారీగా తగ్గించేశారు. వివిధ మోడళ్లపై గత డిస్కౌంట్లను మరింత పెంచి మొత్తంగా దాదాపు రూ.10 వేల నుంచి రూ.30వేలకు తగ్గింపు ధరల్లో కార్లను అందుబాటులోకి తెచ్చాయి. జూన్ నెలలో అమ్మకాలపై కన్నేసిన డీలర్లు ఈ ప్రత్యేక తగ్గింపును అందిస్తున్నాయి. గతంలో ప్రకటించిన నగదును తగ్గింపును మరింత పెంచాయి. ముఖ్యంగా మారుతి వాగాన్ ఆర్ పై డిస్కౌంట్‌ను రూ.30వేలకు (గతంలో రూ.20వేలు) పెంచగా, స్విఫ్ట్ పై రూ. 10వేలనుంచి రూ.20వేలకు పెంచింది. సెలెరోపై రూ. 20వేల వరకు స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది. ఆల్టో పై ప్రస్తుతం ఉన్న నగదు తగ్గింపును రూ. 30వేలనుంచి మరో అయిదువేలకు పెంచింది. ఈ డిస్కౌంట్‌తోపాటు ఉచిత భీమా, లాభదాయక బోనస్ , కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా అందిస్తున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన అనంతరం ఎలక్ట్రిక్ వాహనాలు, పెద్దఎస్యూవీలపై అధిక పన్ను రేటు నేపథ్యంలో డీలర్లు ఉన్నస్టాక్‌ను క్లియర్ చేసుకునే పనిలోఉన్నాయి. ఉదాహరణకు ఢిల్లీ, కోలకతా వంటి నగరాల్లో మారుతి డీలర్లు ఆల్టో, వాగాన్ ఆర్, సెలెరియో, స్విఫ్ట్ వంటి వాహనాలపై జూన్ 31 లోపు కొనుగోలు చేసిన కస్టమర్లకు నగదు రాయితీలను అందజేస్తున్నట్టు పేర్కొంది. ఇదే బాటలో పయనించిన హుందాయ్ డీలర్లు కూడా తమ కార్లపై డిస్కౌంట్లను రెట్టింపు చేశాయి. ఇయాన్, గ్రాండ్ ఐ10 పై తగ్గింపు రేటును ప్రకటించింది. మహీంద్ర అండ్ మహీంద్ర ఎక్స్‌యూవీ 500పై లక్షలవరకు డిస్కౌంట్ అందిస్తోంది. జపనీస్ కార్ మేకర్ టొయోటాకు చెందిన ఇన్నోవా, ఫార్చూనర్ ధరలు కూడా దిగిరానున్నాయి. అయితే భారీ డిమాండ్ కారణంగా టొయాటో డీలర్లు మాత్రం ఇంకా ఎలాంటి డిస్కౌంట్లు ప్రకటించలేదు. మరోవైపు సబ్-4 మీటర్ కార్లపై జీఎస్టీ ప్రభావం ఉందడని మారుతి డీలర్లు చెబుతున్నారు జీఎస్టీ అమలు కోసం వినియోగదారులు వేచి చూస్తున్నారనీ, ఇది జూన్ నెల వాహన విక్రయాలపై ప్రభావం చూపే అవకాశంఉందన్నారు. అందుకే స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తున్నట్టు చెప్పారు. తమ కంపెనీ నెలవారీ డిస్కౌంట్లకు ఇంకా ప్రకటించపోయినప్పటికీ డీలర్లు నెలవారీ రిటైల్ అమ్మకాలను కొనసాగించడానికి అదనపు డిస్కౌంట్లను అందిస్తున్నామని హ్యుందాయ్ డీలర్ చెప్పారు. ప్రస్తుతం స్కార్పియో హైబ్రిడ్‌పై రూ. 30,000 డిస్కౌంట్ ఉందనీ, తదుపరి రెండు నెలల్లో దీని ధర పెరుగుతుందని భావిస్తున్నామని ముంబై ఎం అండ్ ఎం డీలర్ తెలిపారు. కాబట్టి ఈ వెహికల్ అమ్మకాలను మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే జూలై నుంచి ధరల ప్రభావం జిఎస్టిపై ఉంటుందనేది తాము ఇంకా అంచనావేయలేకపోతున్నామని చెప్పారు. కాగా జీఎస్టీ కొత్త పన్ను రేటు ప్రకారం, కార్లు మరియు ఎస్‌యూవీల 4 మీటర్లు, పరిమాణంలో 1.5 లీటర్ కంటే ఎక్కువ డీజిల్ ఇంజిన్ ఉన్న వాటికి ప్రస్తుత పన్ను రేటు 51.5, 55 శాతంతో పోలిస్తే జీఎస్టీలో పన్నురేటు 28శాతం + సెస్ కలుపుకుంటే మొత్తం 48 శాతం పన్ను అమలుకానుంది. -
‘గ్రానైట్’పై జీఎస్టీ పిడుగు
– జీఎస్టీతో 28 శాతం పన్ను విధింపు – మూతపడే ప్రమాదంలో పరిశ్రమలు – ఆందోళనకు సిద్ధమవుతున్న యజమానులు హిందూపురం రూరల్ : గ్రానైట్ పరిశ్రమలపై వస్తు సేవా పన్ను (జీఎస్టీ) పిడుగు పడింది. ఈ పరిశ్రమలో ఉత్పత్తి చేసే సరుకుపై 28 శాతం పన్ను విధించనున్నారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీతో భారీ స్థాయిలో పన్ను పడుతుండటంతో పలు గ్రానైట్ పరిశ్రమలు మూతపడే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పరిశ్రమ యజమానులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జీఎస్టీ నుంచి గ్రానైట్ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడులను గ్రానైట్ పరిశ్రమ అసోసియేషన్ సభ్యులు కోరారు. చైనా ఉత్పత్తులతో దేశీయ గ్రానైట్ పరిశ్రమల ఉత్పత్తులు అమ్ముడుపోక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. వస్తు సేవా పన్నులో 28 శాతం గ్రానైట్ ఉత్పత్తులపై విధించడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు తయారైంది. పరిశ్రమలు నెలకొల్పడానికి బ్యాంకుల్లో తీసుకున్న రుణాల నెలవారి కంతులు చెల్లించలేని దుస్థితిలో ఉన్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వానికి ముడి సరుకు (రాయి)పై రూ.2,600 రాయల్టీని చెల్లిస్తున్నాం. గ్రానైట్ పరిశ్రమల్లో విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. దీనికి తోడు జీఎస్టీ పన్ను తోడైతే పరిశ్రమలు మూతపడే అవకాశం లేకపోలేదు. జిల్లాలోని తాడిపత్రిలో కటింగ్, పాలిషింగ్ పరిశ్రమలు సుమారు 450 ఉన్నాయి. చిలమత్తూరు మండలంలో 14 పరిశ్రమలు ఉన్నాయి. ఒక్కో పరిశ్రమలో 14 నుంచి 15 మంది ప్రత్యక్షంగా, 8 నుంచి 10 మంది కార్మికులు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గ్రానైట్ పరిశ్రమ నుంచి జీఎస్టీ నామమాత్రంగా వసూలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాల్సి ఉంది. శ్లాబ్ పద్ధతిలో రాయితీలు ఇవ్వాలి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రానైట్ పరిశ్రమలకు శ్లాబ్ పద్ధతిలో రాయల్టీ పన్నులు విధించి ఆదుకున్నారు. ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగిస్తే పరిశ్రమలు మనుగడ సాగిస్తాయి. లేనిపక్షంలో కార్మికులు వీధినపడే అవకాశం ఉంది. తదుపరి జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపుపై బలంగా వాదనలు వినిపించి పన్ను శాతం 28 నుంచి 5 శాతానికి తగ్గించి పరిశ్రమలను ఆదుకోవాలి. - మల్లేశ్వరరెడ్డి, గ్రానైట్ పరిశ్రమ యజమాని, తాడిపత్రి -
కొబ్బరి చెట్టుపై జీఎస్టి పిడుగు