బతుకు చిక్కు!
జీఎస్టీ వలలో నేతన్న
- మూడు దశల్లో విక్రయాలపై పన్ను
- కొనుగోలుదారునిపై రూ.1200పైనే భారం
- ఇప్పటికే సంక్షోభంలో చేనేత
- తాజా పన్నుతో ఉక్కిరిబిక్కిరి
- పోరాటానికి సిద్ధమవుతున్న కార్మికులు
చేనేత కార్మికునికి సచ్చేదాకా సగం గుంత.. సచ్చినాక నిండు గుంత అన్న ఓ కవి మాటలను పాలక ప్రభుత్వాలు నిజం చేస్తున్నాయి. మగ్గం గుంతల్లో ఎదుగూబొదుగూ లేని జీవితం గడుపుతున్న చేనేతలపై జీఎస్టీ పిడుగు పడింది. అసలే అవసాన దశలో ఉన్న చేనేత రంగం ఉనికిని నూతన పన్ను విధానం ప్రశ్నార్థకం చేస్తోంది.
జీఎస్టీ అమలు ఇలా..
ముడిపట్టు : 5శాతం
జరీ : 12శాతం
అద్దకం రంగులు : 18శాతం
పట్టు వస్త్రం : 5శాతం
ధర్మవరం: చేనేత రంగాన్ని జీఎస్టీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా పన్ను భారం మోపడంతో కార్మికులు వీధిన పడే పరిస్థితి నెలకొంది. యంత్రాలతో తయారయ్యే వస్త్రంపై 5 శాతం జీఎస్టీ అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇదే కోవలోకి చేతివృత్తుల ద్వారా తయారయ్యే పట్టు వస్త్రాన్ని కూడా చేర్చడం చేనేతలపై పెను ప్రభావం చూపుతోంది. పట్టు వస్త్రం తయారీ నుంచి విక్రయం వరకు నూతన పన్ను విధానం ముప్పుతిప్పలు పెడుతోంది. ఒక పట్టు చీరను తయారు చేసేందుకు రూ.500 నుంచి రూ.1500 భారం అవుతుండగా.. వినియోగదారునిపై ఈ భారం మరింత పెరిగి రూ.1200 పైగా చేరుకుంటోంది. జిల్లాలో ప్రతి రోజూ 50 నుంచి 60వేల పట్టు చీరలు తయారవుతున్నాయి. ఈ లెక్కన చేనేత రంగం కోట్లలో జీఎస్టీ భారం మోయాల్సి వస్తోంది.
యంత్రాలకు.. చేతి వృత్తులకు ముడి తగదు
బ్రిటీష్ హయాంలో కూడా చేనేత వస్త్రంపై పన్ను వేసిన దాఖలాలు లేవు. ఎన్‌డీఏ ప్రభుత్వం యంత్రాల తయారీకి, చేతివృత్తుల తయారీకి తేడా లేకుండా పట్టు వస్త్రాలపై పన్ను విధించడాన్ని చేనేత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా చేనేత వస్త్రంపై పన్ను వేశారని, అయితే పోరాటల ద్వారా పన్ను ఎత్తివేయించుకున్నారు. తిరిగి అదే రీతిలో చేనేత కార్మికులందరూ కలిసి కట్టుగా జీఎస్టీపై పోరాటానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ధర్మవరం పట్టణంలోని శిల్క్‌హౌస్‌లను మూడు రోజుల పాటు మూసివేసి నిరసన తెలిపారు.
ఇది కోలుకోలేని దెబ్బ
ఇప్పటికే చేనేతలకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేసి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీఎస్టీ అమలు కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు చేనేతపై జీఎస్టీ ఎత్తివేతకు చొరవ తీసుకోవాలి.
–రంగన అశ్వర్థనారాయణ, కాంగ్రెస్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జి
నేతన్నపై పెనుభారం
ముడిపట్టు కొనుగోలు నుంచి పట్టు చీర విక్రయం వరకు పన్ను విధిస్తే ఎలా? ఈ రంగంపై ఆధారపడి జిల్లాలో లక్షలాది మంది జీవిస్తున్నారు. వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేనేత రంగంపై విధించిన జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలి.
–బీరే ఎర్రిస్వామి, వైఎస్సార్‌సీసీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు
వ్యవస్థ మనుగడకే అడ్డంకి:
అసలే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగంపై జీఎస్టీ అమలు పెద్ద దెబ్బ. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చాలామంది చేనేత కార్మికులు మగ్గాలు వదిలి ఇతర రంగాల్లోకి వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పన్నుల భారం తగదు.
–గడ్డం పార్థసారథి, చేనేత తయారీదారుల సంఘం నాయకుడు