సూక్ష్మ సాగుపైనా జీఎస్టీ పిడుగు
- డ్రిప్ యూనిట్లపై 18శాతం భారం పడే అవకాశం
- జీఎస్టీ ఎవరు భరిస్తారన్న దానిపై అస్పష్టత
- రైతులపై వేస్తే ఏటా రూ.5 కోట్లకు పైగా అదనపు భారం
- ప్రస్తుతానికి డ్రిప్ మంజూరు ప్రక్రియ ఆపేసిన ఏపీఎంఐపీ
అనంతపురం అగ్రికల్చర్: బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్ల) పరికరాల మంజూరు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. జూలై ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన వస్తు సేవా పన్ను (జీఎస్టీ) కారణంగా గందరగోళం నెలకొంది. జీఎస్టీ భారం నుంచి రైతులకు ఉపశమనం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా సూక్ష్మసాగు సేద్యం పరికరాల విషయాన్ని పొందుపర్చకపోవడంతో ఆయోమయం నెలకొంది. 18 శాతం జీఎస్టీ అమలులోకి రావడంతో ఈ భారాన్ని ఎవరు భరిస్తారనే దానిపై స్పష్టత లేదు. దీంతో ప్రస్తుతానికి పరికరాల మంజూరు, ఇన్‌స్టాలేషన్ (బిగింపు) నిలిపేశారు. డ్రిప్ కంపెనీల నుంచి మెటీరియల్ సరఫరా ఆగిపోవడంతో బ్రేకులు పడ్డాయి. రూ.లక్ష విలువ చేసే పరికరాలపై రూ.18 వేలు జీఎస్టీ రైతులు భరించాలా లేదా కంపెనీలా... లేదంటే ప్రభుత్వమే భారం మోస్తుందా అనేది ఇప్పటివరకు స్పష్టతలేదు. రూ.లక్ష విలువైన పరికరాలపై వ్యాట్ రూపంలో 5 శాతం పన్ను విధిస్తున్నా, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ రావడంతో రైతులు కేవలం తమ వాటా కింద రాయితీ సొమ్ము మాత్రమే చెల్లిస్తున్నారు. ఇపుడు 5 శాతం , వాట్‌ను రద్దు చేసి 18 శాతం జీఎస్టీ వర్తింపజేయడం, దాన్ని ఎవరు చెల్లిస్తారనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వక సూక్ష్మసాగు సేద్యం పరికరాల పంపిణీ ఆపేశారు.
రూ.కోట్లలో భారం :
ఏపీపీఎంఐపీ ద్వారా ప్రస్తుతం ఒక్కో రైతుకు రూ.2 లక్షల విలువైన డ్రిప్ పరికరాలు అందజేస్తున్నారు. దీని ప్రకారం రూ.లక్షకు రూ.18 వేలు చొప్పున రెండు లక్షలకు రూ.36 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వం భరిస్తున్న 5 శాతం మినహాయించినా ఇంకా లక్షకు రూ.13 వేలు చొప్పున రెండు లక్షల విలువైన పరికరాలకు రూ.26 వేలు చెల్లించాల్సి ఉంటుంది. తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదంటూ డ్రిప్ కంపెనీలు, ఏపీఎంఐపీ అధికారులు చెప్తున్నారు.దీంతో రైతులకు అర్థంకాకుండా పోతోంది. 13 శాతం లేదా 18 శాతం పన్ను రైతులు భరించాల్సి వస్తే జిల్లా రైతులపై రూ.5 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. ఈ ఏడాది కనీసం 20 వేల మంది రైతులకు 31,750 హెక్టార్లకు సరిపడా డ్రిప్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో జీఎస్టీ భారం ఇబ్బంది పెడుతోంది. రైతులపై భారం వేయకుండా త్వరిగతిన ఉత్తర్వులు ఇచ్చి డ్రిప్ యూనిట్లు సకాలంలో అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.
వారోత్సవాల్లో ఏపీఎంఐపీ అధికారులు :
జీఎస్టీతో తాత్కాలికంగా డ్రిప్ యూనిట్లు మంజూరు, బిగింపు ప్రక్రియ ఆపేసిన ఏపీఎంఐపీ అధికారులు వారోత్సవాల పేరుతో వేరే పనులు చేస్తున్నారు. రైతుల గడప వద్దకే డ్రిప్ రిజిష్ట్రేషన్లు అంటూ 10 నుంచి 15వ తేదీ వరకు రిజిష్ట్రేషన్ల వారోత్సవం చేపట్టారు. ఇందులో 12 వేల సంఖ్యలో రిజిష్ట్రేషన్లు రావడంతో వాటిని క్షేత్రస్థాయిలో ప్రాథమిక పరిశీలన (ప్రిలిమినరీ ఇన్స్‌పెక్షన్ రిపోర్టు–పీఐఆర్) చేయాలని ఈనెల 24 నుంచి 29వ తేదీ వరకు పీఆర్‌ఆర్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
ఆగస్టు 5న స్పష్టత వస్తుంది
జీఎస్టీ భారం ఎవరు భరిస్తారనేదానిపై స్పష్టత లేదనేది వాస్తవమే. దీని కారణంగా డ్రిప్ మంజూరు ప్రక్రియ ఆపేయలేదు. డీడీలు వస్తున్నాయి, మంజూరు చేస్తున్నాం. రైతులు, కంపెనీలు, డిపార్ట్‌మెంట్‌కు కూడా క్లారిటీ లేకపోవడం మంజూరు ప్రక్రియ బాగా తగ్గిపోయింది. అయితే ఐదారు కంపెనీలు జీఎస్టీతో సంబంధం లేకుండా మెటీరియల్ సరఫరాకు ముందుకు రావడంతో అత్యవసరమైన రైతులకు ఆ కంపెనీల ద్వారా డ్రిప్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఆగస్టు 5న ఢిల్లీలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ మీట్‌లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
– ఎం.వెంకటేశ్వర్లు, ఏపీఎంఐపీ పీడీ