హెచ్యూఎల్ లాభం రూ.1,090 కోట్లు | HUL Q4 net profit up 7%, volume growth disappoints at 4% | Sakshi
Sakshi News home page

హెచ్యూఎల్ లాభం రూ.1,090 కోట్లు

Published Tue, May 10 2016 1:14 AM | Last Updated on Tue, Oct 2 2018 8:16 PM

హెచ్యూఎల్ లాభం రూ.1,090 కోట్లు - Sakshi

హెచ్యూఎల్ లాభం రూ.1,090 కోట్లు

స్వల్పంగా పెరిగిన నికర అమ్మకాలు
ఒక్కో షేర్‌కు రూ.9.5 తుది డివిడెండ్

 న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం, హిందుస్తాన్ యునిలివర్(హెచ్‌యూఎల్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,090 కోట్ల నికర లాభం (స్టాండోలోన్)ఆర్జించింది.  అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) నాలుగో క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.1,018 కోట్లు)తో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని హిందుస్తాన్ యునిలివర్ పేర్కొంది. ఇక నికర అమ్మకాలు రూ.7,555 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.7,809 కోట్లకు పెరిగాయని  హెచ్‌యూఎల్ చైర్మన్ హరిశ్ మన్వాణి చెప్పారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌పై గత ఆర్థిక సంవత్సరానికి రూ.9.5 తుది డివిడెండ్‌ను చెల్లించనున్నామని పేర్కొన్నారు. కాగా గత ఏడాది నవంబర్‌లో ఒక్కో షేర్‌కు రూ.6.5 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించామని వివరించారు.

 పలు విభాగాల్లో రెండంకెల వృద్ధి:  పలు సమస్యలు, ప్రతి ద్రవ్యోల్బణ వ్యయ వాతావరణంలోనూ మంచి పనితీరు కనబరిచామని హరిశ్ చెప్పారు. దేశీయ కన్సూమర్ బిజినెస్ 4 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఎక్సైజ్ సుంకం ప్రోత్సాహకాలను ప్రభుత్వం తొలగించడం, ధరలను స్వల్పంగా తగ్గించడం వంటి అంశాల వల్ల వృద్ధి కొంత దెబ్బతిన్నదని వివరించారు. వ్యయాలు రూ.6,428 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.6,566 కోట్లకు పెరిగాయని, తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ2, క్యూ3లలో నికర లాభం క్షీణించినా, క్యూ4లో మాత్రం స్వల్పవృద్ధితో నికర లాభం పెరిగిందని హరిశ్ పేర్కొన్నారు.

క్యూ4లో సబ్బులు, డిటర్జెంట్‌ల సెగ్మెంట్ ఆదాయం రూ.3,674 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.3,753 కోట్లకు పెరిగిందని తెలిపారు. కమోడిటీ ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందించడంలో భాగంగా ఈ సెగ్మెంట్ ఉత్పత్తుల ధరలను తగ్గించామని వివరించారు. ఇక వ్యక్తిగత ఉత్పత్తుల విభాగం ఆదాయం రూ.2,250 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.2,312 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. పానీయాల విభాగంలో ఆదాయం రూ.976 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.1,036 కోట్లకు పెరిగిందని తెలిపారు. లిప్టన్ గ్రీన్ టీ పటి ష్టమైన వృద్ధిని సాధించగా, బ్రూ కాఫీ రెండంకెల వృద్ధిని సాధించిందని తెలిపారు.

ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ విభాగం ఆదాయం రూ.477 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.533 కోట్లకు పెరిగిందని వివరించారు. కెచప్‌లు, జామ్‌లకు సంబంధించిన  కిసాన్ బ్రాండ్, ఇన్‌స్టంట్ సూప్... నోర్ ఉత్పత్తుల విక్రయాలు మంచి వృద్ధిని సాధించాయని పేర్కొన్నారు. రివర్స్ ఆస్మోసిస్ సెగ్మెంట్లో ప్యూర్ ఇట్ బ్రాండ్ రెండంకెల వృద్ధి సాధించిందన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌యూఎల్ షేర్ రూ.840-869 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 0.8 శాతం నష్టంతో రూ.846 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement