హెచ్‌యూఎల్ లాభం 6% అప్
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్) నికరలాభం మార్చితో ముగిసిన త్రైమాసికంలో 6.19 శాతం పెరిగి రూ. 1,183 కోట్లకు చేరింది. కంపెనీ 2016 మార్చితో ముగిసిన క్వార్టర్లో రూ. 1,114 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఆదాయం కూడా 6.39 శాతం పెరిగి రూ. 8,430 కోట్ల నుంచి రూ. 8,969 కోట్లకు పెరిగింది. బుధవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 10 చొప్పున తుది డివిడెండును సిఫార్సుచేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరు 0.82 శాతం పెరిగి రూ. 1,006 వద్ద ముగిసింది. ఇది జీవితకాల గరిష్టస్థాయి.
నోట్ల రద్దు దెబ్బ నుంచి రికవరీ...
డీమోనిటైజేషన్ తర్వాత ప్రస్తుతం ఎఫ్‌ఎంసీజీ మార్కెట్ కుదుటపడిందని, క్రమేపీ కోటుకుంటున్నదని హెచ్‌యూఎల్ సీఎఫ్‌ఓ పీబీ బాలాజీ చెప్పారు. డీమోనిటైజేషన్ కారణంగా బాగా దెబ్బతిన్న గ్రామీణ మార్కెట్ కూడా రికవరీ అవుతున్నదని, అయితే నోట్ల రద్దుకు మునుపు వున్నంతస్థాయికి ఇంకా ఇది చేరలేదని ఆయన కాన్ఫెరెన్స్ కాల్‌లో వివరించారు. ఈ ఏడాది రుతుపవనాలు బావుంటాయన్న అంచనాలు వెలువడుతున్నందున, పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాంతాలు ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల కొనుగోలులో వెనుకబడి వుంటాయని భావించడం లేదన్నారు.
నాల్గవ త్రైమాసికంలో వివిధ విభాగాల్లో హెచ్‌యూఎల్ అమ్మకాల తీరును ఆయన వివరిస్తూ సర్ఫ్, విమ్ లిక్విడ్ వంటి బ్రాండ్లు పటిష్టమైన పనితీరును కనబర్చాయని, దాంతో హాంకేర్ విభాగంలో మంచి వృద్ధి సాధించామన్నారు. పర్సనల్ వాష్, పర్సనల్ ప్రొడక్టుల విభాగం కూడా ముగిసిన త్రైమాసికంలో పుంజుకున్నదని అన్నారు. అయితే ఫుడ్ ఉత్పత్తుల వ్యాపారం వృద్ధి, గతేడాదితో పోలిస్తే తక్కువగానే వుందని, కానీ కిసాన్‌బ్రాండ్ మాత్రం మంచి వృద్ధి సాధించిందన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బుధవారం బీఎస్‌ఈలో హెచ్‌యూఎల్ షేరు 1% లాభంతో రూ.1,006 వద్ద ముగసింది.