న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) 2022–23 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం (క్యూ1)లో మెరుగైన పనితీరును ప్రదర్శించింది. ముడిపదార్థాల ధరలు పెరిగినప్పటికీ, వ్యయాలను సమర్థవంతంగా అధిగమించింది.
నికర లాభం 14 శాతం వృద్ధితో రూ.2,391 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 20 శాతం వృద్ధితో రూ.14,757 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో నికర లాభం రూ.2,100 కోట్లు, ఆదాయం రూ.12,260 కోట్ల చొప్పున ఉన్నాయి. మొత్తం వ్యయాలు 21% పెరిగి రూ.11,531 కోట్లకు చేరాయి. హోమ్‌కేర్ విభాగం 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఫ్యాబ్రిక్ వాష్, గృహ సంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగాయి. రెండంకెల విక్రయాలు జరిగాయి.
బలమైన పనితీరు..
‘‘సవాళ్లతో కూడిన వాతావరణం, అసాధారణ స్థాయిలో ద్రవ్యోల్బణం ప్రభావం వినియోగంపై ఉన్నప్పటికీ.. ఆదాయం, నికర లాభంలో బలమైన వృద్ధిని నమోదు చేశాం. వ్యాపారాన్ని కాపాడుకుంటూనే, మార్జిన్లను ఆరోగ్యకర స్థాయిలో కొనసాగించాం. ద్రవ్యోల్బణానికి సంబంధించి సమీప కాలంలో ఆందోళన ఉంది. అయితే, కమోడిటీల ధరలు కొంత దిగిరావడం, ప్రభుత్వం తీసుకున్న ద్రవ్య, పరపతి చర్యలు, మంచి వర్షాలు పరిశ్రమకు సానుకూలిస్తాయి. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి భారత ఎఫ్‌ఎంసీజీ రంగం వృద్ధి అవకాశాల పట్ల నమ్మకంగా ఉన్నాం. స్థిరమైన, పోటీతో కూడిన, లాభదాయక, బాధ్యతాయుత వృద్ధిని నమోదు చేయడంపై దృష్టి కొనసాగుతుంది’’అని హెచ్‌యూఎల్ సీఈవో, ఎండీ సంజీవ్ మెహతా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment