హెచ్యూఎల్ లాభం 1,095 కోట్లు
రెండో త్రైమాసికంలో 11.5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ లీడర్ హిందుస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.1,095 కోట్ల స్టాండలోన్ లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.982 కోట్లతో పోలిస్తే 11.54 శాతం వృద్ధి చెందింది. ఆదాయం 1.57 శాతం పెరిగి రూ.8,480 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ.8,348 కోట్లుగా ఉంది. ఇతర ఆదాయం సైతం రూ.107 కోట్ల నుంచి రూ.252 కోట్లకు పెరిగింది.
సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితుల నడుమ లాభాలతో కూడిన వృద్ధిని నమోదు చేసినట్టు హెచ్‌యూఎల్ చైర్మన్ హరీష్ మన్వానీ తెలిపారు. కన్జ్యూమర్ ఆధారిత ఆవిష్కరణలు, నిర్వహణ సామర్థ్యాలు, మార్కెట్ వృద్ధిపై దృష్టి సారించినట్టు చెప్పారు. చక్కని వర్షపాతంతో మార్కెట్ డిమాండ్ క్రమంగా పెరుగుతుందని, ఈ రంగంలో మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి సానుకూలంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
కాగా, గృహ వినియోగ వస్తువుల విభాగం ద్వారా ఆదాయం 3.20 శాతం వృద్ధి చెంది రూ.2,777కోట్లుగా నమోదైంది. వ్యక్తిగత ఉత్పత్తుల ద్వారా ఆదాయం 0.32 శాతం క్షీణించి రూ.4,027 కోట్లకు పరిమితం అయింది. రీఫ్రెష్‌మెంట్ విభాగంలో ఆదాయం 8 శాతం వృద్ధి చెంది రూ.1,169 కోట్లకు చేరుకుంది. ఆహార ఉత్పత్తుల విభాగంలో ఆదాయం 2.44 వృద్ధితో రూ.277 కోట్లుగా నమోదైంది. శిశు సంరక్షణ ఉత్పత్తులు, ఎగుమతుల విభాగంలో ఆదాయం 15 శాతం క్షీణించి రూ.218 కోట్లకు పరిమితం అయింది.
మొదటి ఆరు నెలల కాలానికి చూసుకుంటే హెచ్‌యూఎల్ స్టాండలోన్ లాభం 10 శాతం వృద్ధితో రూ.2,269 కోట్లకు... ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.17,283 కోట్లకు చేరుకుంది. రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.7 మధ్యంత డివిడెండ్‌గా కంపెనీ ప్రకటించింది. బుధవారం బీఎస్‌ఈలో హెచ్‌యూఎల్ షేరు 1.29 శాతం పెరిగి రూ.842.80 వద్ద క్లోజ్ అయింది.