హెచ్‌యూఎల్‌ లాభం  రూ.1,538 కోట్లు | HUL results in line with FMCG growth slowdown | Sakshi
Sakshi News home page

హెచ్‌యూఎల్‌ లాభం  రూ.1,538 కోట్లు

Published Sat, May 4 2019 12:43 AM | Last Updated on Sat, May 4 2019 12:43 AM

HUL results in line with FMCG growth slowdown - Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌)కు గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,538 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం (రూ.1,351 కోట్లు)తో పోల్చితే 14 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. మార్జిన్లు మెరుగుపడటం, అమ్మకాల్లో వృద్ధి కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ సంజీవ్‌ మెహతా చెప్పారు. అమ్మకాలు రూ.9,003 కోట్ల నుంచి 9% వృద్ధితో రూ.9,809 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.13 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. 

ఎబిటా మార్జిన్‌ 23.3 శాతం...: దేశీయ కన్సూమర్‌ వ్యాపారం 9 శాతం, అమ్మకాలు 7% చొప్పున పెరిగాయని మెహతా వివరించారు.  ఎబిటా(నిర్వహణలాభం) 13 శాతం వృద్ధితో రూ.2,321 కోట్లకు పెరిగిందని, ఎబిటా మార్జిన్‌ 23.3 శాతంగా నమోదైందని తెలిపారు. గ్రామీణ మార్కెట్లో కొంత మందగమనం ఉన్నా, ముడి చమురు, కరెన్సీ వ్యయాల్లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నా గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మంచి ఆర్థిక ఫలితాలు సాధించామని సంజీవ్‌ మెహతా సంతృప్తి వ్యక్తం చేశారు.  

ఇద్దరు ఈడీల నియామకం...: ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.5,237 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 15% వృద్ధితో రూ.6,036 కోట్లకు పెరిగిందని మెహతా పేర్కొన్నారు. అమ్మకాలు రూ.34,619 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.37,660 కోట్లకు పెరిగాయని వివరించారు. కాగా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా అనురాధ రజ్దాన్, వైభవ్‌ సంజ్‌గిరిలను నియమించామని కంపెనీ పేర్కొంది.   మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్‌ఈలో హెచ్‌యూఎల్‌ షేర్‌ 2 శాతం నష్టంతో రూ.1,693 వద్ద ముగిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement