న్యూఢిల్లీ: దిగ్గజ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో బలమైన ఫలితాలను నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 22 శాతం వృద్ధితో రూ.2,670 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 16 శాతానికి పైగా పెరిగి రూ.15,253 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికానికి లాభం రూ.2,185 కోట్లు, ఆదాయం రూ.13,099 కోట్ల చొప్పున ఉన్నాయి. విక్రయాల సంఖ్యా పరంగా 4 శాతం వృద్ధిని చూసినట్టు కంపెనీ తెలిపింది.
తమ ఉత్పత్తుల్లో 75 శాతం విలువ పరంగా, పరిమాణం పరంగా మార్కెట్ వాటాను పెంచుకున్నట్టు పేర్కొంది. కంపెనీ వ్యయాలు 18 శాతం పెరిగి రూ.11,965 కోట్లుగా ఉన్నాయి. ‘‘అన్ని రకాలుగా బలమైన ప్రదర్శన చూపించాం. 2022–23లో మొదటి ఆరు నెలల్లో రూ.4,000 కోట్ల అధిక టర్నోవర్ నమోదు చేయగలిగాం. మా ఉత్పత్తులకు ఉన్న బలం, నిర్వహణ సామర్థ్యాలు, వివేకవంతమైన ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అనుకూలించాయి’’అని హెచ్‌యూఎల్ సీఈవో, ఎండీ సంజీవ్ మెహతా పేర్కొన్నారు. ఒక్కో షేరుకు రూ.17 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ‡ బోర్డు నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment