హిందూస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద అడ్వర్‌టైజర్, ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలివర్ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్, ఫేస్‌బుక్ లాంటి ఆన్‌లైన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు తన ప్రకటన ఖర్చులు తగ్గించాలని నిర్ణయించింది. విషపూరితమైన కంటెంట్‌ను వీరు తొలగించకపోతే, తాము ప్రకటనలకు కోత పెడతామని తెలిపింది. డచ్‌కు చెందిన యునిలివర్ దీనిపై ఓ కొత్త గ్లోబల్ పాలసీని తీసుకొచ్చింది. గతేడాది యూనిలివర్ ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్‌కు కోసం 9.4 బిలియన్ డాలర్లను వెచ్చిచింది. దీనిలో మూడోవంతు డిజిటల్ అడ్వర్‌టైజింగ్‌లో పెట్టింది. మతపరమైన భావాలను దెబ్బతీసే విధంగా, పిల్లలకు హానికరంగా, లింక వివక్ష చూపించే కంటెంట్‌ను కలిగి ఉండే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు తమ బ్రాండుల ప్రకటనలను ఇక నుంచి ఇవ్వబోమని తేల్చిచెప్పింది. గ్లోబల్ కమిట్‌మెంట్‌ను హెచ్‌యూఎల్‌కు అమలు చేస్తామని తెలిపింది.
హెచ్‌యూఎల్ దేశంలో అతిపెద్ద అడ్వర్‌టైజర్లలో ఒకటని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. వార్షికంగా ప్రకటనల కోసం రూ.3వేల కోట్లకు పైగా ఖర్చుచేస్తున్నట్టు అంచనావేస్తోంది. దీనిలో డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పైనే 15 నుంచి 20 శాతం వెచ్చించింది. విభేదాలను సృష్టించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై తాము పెట్టుబడులను కోత పెడుతున్నామని కంపెనీ ప్రకటించింది. ''థర్డ్ పార్టీ వెరిఫికేషన్‌ను వినియోగదారులు పట్టించుకోరు. మోసపూరిత విధానాలను, నకిలీ వార్తలను లెక్కచేయరు. అడ్వర్‌టైజర్ల మంచి విలువలను వారు గుర్తించారు. కానీ ఉగ్రవాదానికి, పిల్లలను పాడుచేసే యాడ్స్‌కు పక్కన తమ బ్రాండ్లు కనిపిస్తే మాత్రం అసలు ఊరుకోరు'' అని యూనిలివర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కేత్ వీడ్ తెలిపారు. సమాజానికి సానుకూలమైన సహకారాన్ని అందించలేని ప్లాట్‌ఫామ్స్‌పై తాము ప్రకటన చేయలేమని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు కూడా కంపెనీ చెప్పింది. యూనిలివర్ కమిట్‌మెంట్స్‌ను తాము గౌరవిస్తున్నామని ఫేస్‌బుక్ ఇండియా తెలిపింది. ప్రతి రోజూ తమ యూజర్ల, కస్టమర్ల, పార్టనర్ల భద్రత, నమ్మకాన్ని పొందడానికి ఎల్లవేళలా కృషిచేస్తూ ఉంటామని గూగుల్ పేర్కొంది. యూనిలివర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మిగతా నిపుణులు కూడా స్వాగతిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment