Packaged FMCG sales fall as prices rise: సబ్బులు, షాంపులు మొదలు ఇంట్లో వాడే అనేక వస్తువులను అందించే ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్స్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ)లకు షాక్ తగిలింది. ద్రవ్యోల్బణం పేరుతో హిందూస్థాన్ యూనిలీవర్ వంటి బడా కంపెనీలు ధరలు పెంచుకుంటూ పోయాయి. దీంతో ప్రజలు ఆయా ప్రొడక్టుల వాడకాన్ని తగ్గిస్తూ షాక్ ఇచ్చారు. నీల్సన్ తాజా సర్వేలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి.
గత కొంత కాలంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి పోతోంది అంటూ ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ముఖ్యమైన వస్తువుల ధరల పెంచుకుంటూ పోయాయి. దీని ఎఫెక్ట్ మూడు నెలల వ్యవధిలోనే ఎఫ్‌ఎంసీజీలపై పడింది. ఒక్కసారిగా ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఆయా వస్తువులను పొదుపుగా ఉపయోగిస్తున్నారు. నీల్సన్ సర్వే తాజా ఇదే విషయాన్ని పట్టి చూపుతోంది. 2021 అక్టోబరు నుంచి డిసెంబరు వరకు వెల్లడించిన వివరాల్లో ఎఫ్‌ఎంసీజీల అమ్మకాల వాల్యూమ్స్‌లో 1.8 శాతం క్షీణత నమోదు అయినట్టు వెల్లడించింది.
ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు రూరల్ ఇండియాపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతాయి. ఎఫ్‌ఎంసీజీలో దేశంలోనే పెద్దదైన హిందూస్థాన్ యూనిలీవర్ కంపెనీకి రూరల్ ఇండియాలో మంచి పట్టుంది. రూరల్ ఇండియాను టార్గెట్ చేసి రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10 ప్రైస్‌లలో అనేక వస్తువులను అందుబాటులోకి తెచ్చాయి. ఈ కంపెనీ మార్కెట్ వాటాలో 30 శాతం రూరల్ ఇండియాలో ఉంది. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌తో వస్తువుల ధరలు పెంచకుండానే వస్తువు క్వాంటిటీ తగ్గించాయి. ఉదాహారణకి రూ.10 ధరకి 30 గ్రాముల టూత్ పేస్ట్ లభిస్తే..ధరలు పెంచకుండా రూ. 10 ధరకి 26 గ్రాముల పేస్టుని అందించాయి. పేస్టు పరిమాణం తగ్గడం వల్ల స్థూలంగా అమ్మకాల్లో మార్పు రాదని కంపెనీల అంచనా.
కానీ రూరల్ ఇండియా ప్రజలు ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ఆశలకు గండి కొట్టారు. తాము కొనే పరిమణాం తక్కువైనా సరే అందులోనే సర్థుకుపోతున్నారు తప్పితే అధికంగా కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో కంపెనీల స్థూల అమ్మకాల్లో స్పష్టమైన క్షీణత నమోదు అయ్యింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది అనడానికి ఈ పరిణామం ఉదాహారణ అని.. ప్రజల చేతుల్లో మరింత సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకోని పక్షంలో .. ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారుతుందని ఎఫ్‌ఎంసీజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అమ్మకాల్లో క్షీణత కనిపించినప్పటికీ స్థూలంగా ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు 2021 క్వార్టర్ 4లో లాభాలు నమోదు చేశాయి. సర్ఫ్, సబ్బుల ధరలు పెరగడం వల్ల క్వార్టర్ 3తో పోల్చితే క్వార్టర్ 4లో హెచ్‌యూఎల్ 10.30 శాతం లాభాలను నమోదు చేసింది. అయితే వినిమయం తగ్గిపోతే ఈ లాభాలు ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టదనేది ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ఆందోళన. మొత్తంగా ధరల పెంపు విషయంలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీల అంచనాలు అసలుకే ఎసరు తెచ్చేలా మారాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment