హెచ్‌యూఎల్‌ను నిరాశపర్చిన వాల్యుమ్ గ్రోత్
ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ అయిన హిందూస్తాన్ యూనిలివర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) తొలి త్రైమాసిక ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను తాకలేకపోయింది. బలహీనమైన వాల్యుమ్ వృద్ధిని నమోదుచేసి మార్కెట్లను నిరాశపరిచింది. సోమవారం విడుదల చేసిన ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలను 9.8 శాతం ఎక్కువగా నమోదుచేసినప్పటికీ, బలహీనమైన వాల్యుమ్ వృద్ధితో కంపెనీ షేర్లు పతనమయ్యాయి. అయితే కంపెనీ సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో యేటికేటికీ కంపెనీ నికరలాభాలు రూ.1,174కోట్లగా నమోదయ్యాయి.
ఆదాయం 3శాతం వృద్ధితో రూ.8,235.70 కోట్లగా రికార్డుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర ఆదాయం రూ.7,967.43 కోట్లగా ఉన్నాయి. యేటికేటికి వాల్యుమ్ గ్రోత్ 4శాతంగా నమోదుచేసి, విశ్లేషకుల అంచనాలు తారుమారు చేసింది. వాల్యుమ్ గ్రోత్ తక్కువగా ఉండటంతో, కంపెనీ షేర్లు 2.04శాతం పతనమై, రూ.920.45గా నమోదైంది. నికర అమ్మకాలు 3.56శాతం పెరిగి, రూ.7,987.74 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ అమ్మకాలు కేవలం రూ.7,712.71 కోట్లు మాత్రమే.