ఎగుమతులు పైకి - లోటు కిందికి
ఎగుమతులు పైకి - లోటు కిందికి
Published Wed, Sep 11 2013 2:32 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు ఎగుమతుల రంగం నుంచి తీపికబురు అందింది. ఆగస్టులో వరుసగా రెండవ నెలలో ఎగుమతులు పెరిగాయి. 2012 ఆగస్టుతో పోల్చితే ఈ ఏడాది ఆగస్టులో ఈ పరిమాణం 13 శాతం ఎగసింది. రెండేళ్ల గరిష్ట స్థాయిలో 26.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతుల విషయానికి వస్తే- ఇవి ఆగస్టులో స్వల్పంగా 0.68 శాతం తగ్గాయి. 37 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రభుత్వం మంగళవారం ఈ గణాంకాలను విడుదల చేసింది.
వాణిజ్యలోటు ఆశాజనకం
ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య ఉన్న వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్య లోటు ఆగస్టులో నాలుగు నెలల కనిష్ట స్థాయిలో 11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. రూపాయి బలహీనతకు ప్రధాన కారణంగా నిలుస్తున్న కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్- క్యాపిటల్ ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య ఉన్న వ్యత్యాసం) తగ్గడానికి ఇది దోహదపడే అంశం. మార్చిలో వాణిజ్య లోటు 10.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
ఎగుమతులు పెరగడానికి కారణాలు
ఎగుమతులు పెరగడానికి మెరుగుపడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక కారణమని ప్రభుత్వం భావిస్తోంది. యూరప్, అమెరికాల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, బ్రిటన్ సహా కొన్ని దిగ్గజ ఆర్థిక వ్యవస్థల్లో స్థిరత్వం నెలకొంటోందనడానికి ఎగుమతుల పెరుగుదల సంకేతంగా నిలుస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆసియా-పసిఫిక్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి కొత్త మార్కెట్లలో అవకాశాల మెరుగుదల కూడా భారత్ ఎగుమతుల వృద్ధికి కారణమైనట్లు ఆయన వెల్లడించారు. భారత్ నుంచి నాన్-బాస్మతి బియ్యం దిగుమతులపై రష్యా నిషేధాన్ని ఎత్తివేసినట్లు కూడా మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.
ఎగుమతిదారులకు వడ్డీ సబ్సిడీ రేటు పెంపు వంటి చర్యలు సైతం ఎగుమతులకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు తెలిపారు. రూపాయి బలహీనత ఎగుమతుల పెరుగుదలకు కారణం కాదని వివరణ ఇచ్చారు. మనం ఎగుమతులు చేసే ఉత్పత్తుల తయారీలో 45 శాతం దిగుమతి చేసుకుంటున్న వాటినే ఉపయోగిస్తున్నామని ఆయన చెప్పారు. కరెన్సీ క్షీణత వల్ల దిగుమతుల భారం పెరిగిపోయిందని.. ఫలితంగా ఎగుమతుల ద్వారా పొందే ప్రయోజనం పెద్దగా లేకుండా పోతోందని వివరించారు.
రంగాల వారీగా...
ఒక్క ఆభరణాల విభాగాన్ని మినహాయిస్తే, అన్ని ఎగుమతుల రంగాలూ ఆగస్టులో మంచి పనితీరును ప్రదర్శించాయి. ఎగుమతుల్లో వెనుకబడిఉన్న రంగాలన్నింటికీ ప్రభుత్వం తగిన సహాయసహకారాలను అందిస్తుందని ఆనంద్‌శర్మ తెలిపారు. అక్టోబర్‌లో ఈవిషయంపై సమీక్ష ఉంటుందని వెల్లడించారు. కాగా ఆగస్టులో చమురు దిగుమతులు 17.88 శాతం ఎగసి, 15.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురుయేతర దిగుమతులు 10.4 శాతం తగ్గి 21.9 బిలియన్ డాలర్లుకు చేరాయి. జూలై వరకూ ప్రతికూలతలో ఉన్న ఇంజనీరింగ్ ఎగుమతులు సైతం (మొత్తం ఎగుమతుల్లో 20 శాతం) ఆగస్టులో వృద్ధి బాట పట్టాయి.
ఐదు నెలల్లో...
ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఐదు నెలల్లో ఎగుమతులు 3.89 శాతం వృద్ధితో 124.42 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 1.72 శాతం పెరుగుదలతో 197.79 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 73.36 బిలియన్ డాలర్లు. ఈ కాలంలో చమురు దిగుమతుల విలువ 5.60 శాతం పెరిగి 69.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక చమురు యేతర దిగుమతులు 0.3 శాతం పడిపోయి 128.11 బిలియన్ డాలర్లకు పడ్డాయి.
దిగుమతులపై ‘పసిడి’ నీడ
దిగుమతులు తగ్గడానికి పసిడి ఒక కారణమని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ విలేకరులకు తెలిపారు. దిగుమతులు పెరిగి, కరెంట్ అకౌంట్ లోటు తీవ్రం కావడానికి, తద్వారా రూపాయి క్షీణతకు దారితీస్తున్న బంగారం దిగుమతుల విలువ ఆగస్టులో 0.65 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2013 జూలైలో ఈ పరిమాణం విలువ 2.2 బిలియన్ డాలర్లు. రానున్న నెలల్లో సైతం ఇదే ధోరణి కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గడచిన ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (191 బిలియన్ డాలర్లు) వాణిజ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తగ్గుతుందన్న విశ్వాసాన్ని శర్మ వ్యక్తం చేశారు.
బంగారం దిగుమతులు తగ్గడానికి, అలాగే ఎలక్ట్రానిక్స్ తయారీ ఉత్పత్తుల ఎగుమతుల పెంపునకు ప్రభుత్వ చర్యలు ఈ విషయంలో దోహదపడే అంశాలుగావిశ్లేషించారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ పార్క్‌ల ఏర్పాటుకు జపాన్ ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. బొగ్గు దిగుమతులు క్యాడ్ పెరగడానికి ఒక కారణంగా ఉన్నట్లు ఆ సందర్భంగా మంత్రి తెలిపారు. మనకు తగిన బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ రంగంలో సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ సమస్యలను అధిగమించడానికి, విద్యుత్ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెడతామని మంత్రి తెలిపారు.
Advertisement