సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడాన్ని అడ్డుకుంటున్న చైనాకు అత్యంత ప్రాధాన్య దేశం (ఎంఎఫ్‌ఎన్) హోదాను ఉపసంహరించాలని ఆరెస్సెస్ ఆర్థిక విభాగం స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్‌జేఎం) ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. చైనాకు ఎంఎఫ్‌ఎన్ హోదాను ఉపసంహరించడంతో పాటు చైనా ఉత్పత్తులపై నియంత్రణలు విధించాలని, చైనా దిగుమతులపై సుంకాలను పెంచుతూ తక్షణం చర్యలు చేపట్టాలని ప్రధానికి రాసిన లేఖలో ఎస్‌జేఎం డిమాండ్ చేసింది.
పాకిస్తాన్‌పై భారత్ ఇప్పటికే విధించిన నియంత్రణలను చైనాపైనా అమలు చేయాలని కోరింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న చైనాను కట్టడి చేసేందుకు ఇలాంటి చర్యలు అవసరమని పట్టుబట్టింది. చైనా ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు తక్కువగా ఉన్నాయని, చైనా దిగుమతులను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఎస్‌జేఎం కో కన్వీనర్ అశ్వని మహజన్ పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరాటానికి భారత్ చైనాపై తీసుకునే చర్యలు ఉపకరిస్తాయని అన్నారు. మరోవైపు చైనా వస్తువులను బహిష్కరించాలని ఆరెస్సెస్ సైతం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. చైనా దిగుమతులపై సుంకాలను పెంచాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment