బంగారం దిగుమతి టారిఫ్ విలువ తగ్గింపు
న్యూఢిల్లీ: కేంద్రం సోమవారం బంగారం, వెండి దిగుమతి టారిఫ్ విలువను తగ్గించింది. అంతర్జాతీయంగా ఈ మెటల్స్ ధరల తగ్గుదల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. దీని ప్రకారం 10 గ్రాముల బంగారం టారిఫ్ విలువ 401 డాలర్ల నుంచి 388 డాలర్లకు తగ్గింది. వెండి విషయంలో ఈ విలువ కేజీకి 575 డాలర్ల నుంచి 540 డాలర్లకు తగ్గింది. ఈ మేరకు కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు (సీబీఈసీ) ఒక ప్రకటన చేసింది.
ఈ మెటల్స్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. విలువను తక్కువచేసి చూపేందుకు(అండర్ ఇన్వాయిసింగ్) ఆస్కారం లేకుండా చేయడమే దీని ప్రధానోద్దేశం. సాధారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరల ధోరణికి అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ టారిఫ్ విలువలో మార్పులను ప్రభుత్వం చేపడుతుంది.
మరింత పసిడి కొనుగోలుకి స్విస్ ఓటర్లు నో
జ్యూరిక్: స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంకు కనీసం 20% ఆస్తులను పసిడి రూపంలో నిల్వచేయాలన్న ప్రతిపాదనను వోటర్లు తిరస్కరించారు. ఇదే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పసిడిని విక్రయించరాదన్న అభిప్రాయాన్ని సైతం ప్రజాభిప్రాయ సేకరణ(రిఫరెండం)లో వ్యతిరేకించారు. దీంతో బులియన్ ధరలు మూడు వారాల కనిష్టానికి చేరాయి. స్విస్ బంగారాన్ని పరిరక్షించే పేరుతో స్విస్ జాతీయ బ్యాంకు(ఎస్‌ఎన్‌బీ)కి చెందిన 520 బిలియన్ ఫ్రాంక్‌ల బ్యాలన్స్‌షీట్‌లో కనీసం 20%ను పసిడికింద మార్పుచేసేందుకు ప్రతిపాదించారు.
అయితే ఈ ప్రతిపాదనను 77% మంది వ్యతిరేకించారు. ప్రస్తుతం ఎస్‌ఎన్‌బీ ఆస్తులలో పసిడికి 8% వాటాను(1,040 టన్నులు) మాత్రమే కేటాయించింది. రెఫరెండం వార్త ఫలితంగా ప్రపంచ మార్కెట్లో సోమవారం ఉదయం పుత్తడి ధర 2% క్షీణించి ఔన్స్‌కు 1143 డాలర్లకు తగ్గింది. అయితే ఇదేరోజు రాత్రి న్యూయార్క్ ట్రేడింగ్‌లో బాగా పెరిగి 1195 డాలర్లకు చేరింది.