న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఈ ఖరీఫ్ సీజన్‌కు పలు ప్రధాన పంటల కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)లను పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. వరికి ఈ ఎమ్మెస్పీకి రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ. 200 పెంచింది. సాధారణ రకం వరి ఎమ్మెస్పీని క్వింటాల్‌కు రూ. 1550 నుంచి రూ. 1750కి, గ్రేడ్–ఏ రకం వరికి క్వింటాల్‌కు రూ. 1590 నుంచి రూ. 1770కి పెంచారు. పత్తి ఎమ్మెస్పీని రూ. 4020 నుంచి రూ. 1130 పెంచి, 5,150 రూపాయలకు చేర్చారు.
ఇటీవలి కాలంలో పలు పంటలకు ఇంత మొత్తంలో మద్దతు ధర పెరగడం ఇదే ప్రథమం. యూపీఏ–2 హయాంలో 2012–13 సాగు సంవత్సరంలో వరి మద్దతు ధరను 170 రూపాయలు పెంచారు. పంటల పెట్టుబడి వ్యయానికన్నా 50 శాతం అధికంగా కనీస మద్దతు ధర ప్రకటిస్తామంటూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తాజా పెంపు నిర్ణయంతో బీజేపీ నిలబెట్టుకుంది. ఈ నిర్ణయంతో ఖజానాపై రూ. 15వేల కోట్ల భారం పడనుంది.
అలాగే ఈ పెంపు వల్ల ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణం పెరిగిపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక క్వింటాల్ వరి పండించడానికి రైతులకు రూ. 1,166 వ్యయం అవుతున్నట్లు వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) లెక్కించిందనీ, మద్దతు ధర రూ. 1,750గా ఉండటంతో పెట్టుబడి కన్నా మద్దతు ధర 50 శాతం ఎక్కువగా ఉన్నట్లైందని కేంద్రం వివరించింది. గత నాలుగేళ్లలో వరి మద్దతు ధరను క్వింటాల్‌కు కేవలం 50 నుంచి 80 రూపాయల మధ్యనే పెంచిన బీజేపీ ప్రభుత్వం, ఈసారి మాత్రం ఏకంగా రూ. 200 పెంచింది.
అన్ని పంటలకూ 50 శాతం ఎక్కువే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. వివిధ పంటలకు మద్దతు ధరను పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 15 వేల కోట్ల అదనపు భారం పడుతుందనీ, అందులో కేవలం వరి కోసమే రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. 2018–19 సీజన్‌కు మరో 14 ఖరీఫ్ పంటలకు కూడా ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించిందన్నారు. తాజా పెంపుతో వరికే కాకుండా దాదాపు అన్ని పంటలకూ మద్దతు ధరను పెట్టుబడి కన్నా 50 శాతం ఎక్కువగా ఉండేలా చేశామని చెప్పారు. ఈ పెంపుతో రైతుల కొనుగోలు శక్తి పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి పరోక్షంగా సాయపడతారన్నారు.
ద్రవ్యోల్బణంపై ఆందోళన వద్దు
ఆహార రాయితీ కోసం ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 1.7 లక్షల కోట్లు కేటాయించగా, తాజా మద్దతు ధరల పెంపుతో ఆ రాయితీ కోసం రూ. 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని వ్యవసాయ రంగ నిపుణుడు అశోక్ గులాటీ అన్నారు. దీంతో ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణం పెరిగిపోతాయని ఆయన పేర్కొన్నారు. ధరలు పెరుగుతాయనే అంశాన్ని రాజ్‌నాథ్ వద్ద విలేకరులు ప్రస్తావించగా, ద్రవ్యోల్బణం పెరుగుతుందనడం సరికాదన్నారు.
తృణ ధాన్యాలకే ఎక్కువ
తృణ ధాన్యాలైన రాగి, జొన్న, సజ్జ తదితరాలకు మద్దతు ధరను కేంద్రం బాగానే పెంచింది. అలాగే పెసర పంట మద్దతు ధరను రూ. 1,400 పెంచగా, ప్రస్తుతం క్వింటాల్ పెసర ధర రూ. 6,975కు పెరిగింది. అయితే పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటల విషయానికి వస్తే మాత్రం గతేడాది వీటికి పెంచిన మద్దతు ధర కన్నా, ప్రస్తుతం పెంచిన ధర తక్కువగానే ఉంది. ఈ పంటలకు పెట్టుబడికి అయ్యే ఖర్చు (ఏ2+ఎఫ్‌ఎల్)తో పోలిస్తే మద్దతు ధర ఇప్పటికే 50 శాతం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
క్వింటాల్ సజ్జలకు రూ. 525 (ప్రస్తుత ధర రూ. 1,950), జొన్నలకు రూ. 730 (రూ. 2,340), రాగులకు రూ. 997 (రూ. 2,897) పెంచిన కేంద్రం.. వేరు శనగకు రూ. 440, సోయాబీన్‌కు రూ. 349, కందులకు రూ. 225 పెంపుతోనే సరిపెట్టింది. సాధారణంగా విత్తన సమయానికి ముందే వివిధ పంటల మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆ ధరల ఆధారంగా రైతులు తాము ఏ పంట వేయాలో నిర్ణయించుకుంటారు. అయితే ఈసారి మాత్రం కాస్త ఆలస్యంగా ప్రభుత్వం మద్దతు ధరలను సవరించింది.
హామీని నెరవేర్చాం: ప్రధాని మోదీ
పెట్టుబడితో పోలిస్తే మద్దతు ధర ఒకటిన్నర రెట్లు ఉండేలా చేస్తామని తాము ఇచ్చిన హామీని నెరవేర్చామని మోదీ తెలిపారు.
పెట్టుబడి వ్యయాన్ని ఇలా లెక్కిస్తారు..
కనీస మద్దతు ధరను ప్రతిపాదించే ముందు, పెట్టుబడి వ్యయాన్ని గణించేందుకు వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్(కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్– సీఏసీపీ) కొన్ని పద్ధతులను పాటిస్తుంది. ఇవి
ఏ2(యాక్చువల్ కాస్ట్): రైతు స్వయంగా భరించే విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు ఖర్చు, అలాగే కూలీల ఖర్చు, యంత్రాల అద్దె.. తదితరాల మొత్తం.
ఏ2+ ఎఫ్‌ఎల్(ఫ్యామిలీ లేబర్): పైన పేర్కొన్న ఏ2 వ్యయానికి సాగు సమయంలో రైతు, ఆయన కుటుంబం చేసే శ్రమ విలువను జోడిస్తే ఈ మొత్తం వ్యయం వస్తుంది.
సీ2 (సమగ్ర వ్యయం): ఇది సమగ్ర(కాంప్రహెన్సివ్) వ్యయం. పైన పేర్కొన్న ఏ2+ఎఫ్‌ఎల్ ఖర్చుకు సాగు భూమిపై గణించిన అద్దెను, పెట్టుబడిపై వడ్డీని కలిపితే ఈ సమగ్ర వ్యయం వస్తుంది. ఈ ‘సీ2’ వ్యయంపై 50 శాతం పెంపును కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసింది. రైతు సంఘాలు కూడా ఈ డిమాండే చేస్తున్నాయి. అయితే, ప్రస్తుతం సీఏసీపీ ‘ఏ2+ఎఫ్‌ఎల్’ విధానం ఆధారంగా ఎమ్మెస్పీని సిఫారసు చేసింది.
మంచిదే.. కానీ!
మద్దతు ధరల పెంపుపై వివిధ వర్గాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ధరలు పెంచడం మంచిదే అయినప్పటికీ, ప్రభుత్వ తాజా చర్య వల్ల ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణం పెరిగిపోతాయని కొందరు అందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో ఈ పెంపు ఏ మాత్రం సరిపోదనీ, పెట్టుబడి అంటే ప్రభుత్వం సమగ్ర వ్యయాన్ని కాకుండా, ఏ2+ఎఫ్‌ఎల్‌నే పరిగణలోకి తీసుకోవడంతో పెద్ద ప్రయోజనం ఉండదంటున్నారు. అంతర్జాతీయ స్థాయి కన్నా మనదగ్గర ధరలు పెరిగిపోతే ఎగుమతుల్లేక ధాన్యమంతా ఇక్కడే పోగుపడుతుందనీ, రైతులకు ఇది మరింత ప్రమాదకరమని వ్యవసాయ రంగ నిపుణుడు అశోక్ గులాటీ వివరించారు.
ఎన్నికల తాయిలం: కాంగ్రెస్
2019లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం ఒక గిమ్మిక్కు, ఓటర్లకు తాయిలంగా కాంగ్రెస్ పేర్కొంది. రైతులను ప్రలోభ పెట్టేందుకు తీసుకున్న చర్యగా కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. ఈ ఎంఎస్‌పీ వచ్చే ఏడాది అమలవుతుండగా అప్పటికి ఈ ప్రభుత్వం అధికారం కోల్పోతుందన్నారు.
ఈ పెంపు సరిపోదు: బీజేడీ
వరి మద్దతు ధర క్వింటాలుకు రూ.200 వరకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఒడిశాలోని బీజేడీ ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. ఈ పెంపు రైతులకు ఏమాత్రం ఊరటనివ్వదంది. వరి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.200 పెంచాలన్న నిర్ణయం రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వ చారిత్రక నమ్మక ద్రోహమని ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) మండిపడింది.
Comments
Please login to add a commentAdd a comment