
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై కమిటీని ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. కమిటీ విషయంలో అనుమతి కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశామని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే ఈ కమిటీని తీసుకురావాలని ఎన్నికల సంఘం సూచించిందని అన్నారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన అనుబంధ ప్రశ్నకు తోమర్ సమాధానమిచ్చారు.
ఎంఎస్పీకి రూ.2.37 లక్షల కోట్లు
గత ఏడేళ్లలో మద్దతు ధరతో పంటల కొనుగోలు రెండింతలు పెరిగిందన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఇందుకోసం రూ.2.37 లక్షల కోట్లు కేటాయించామన్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తోందని, పీఎం–కిసాన్ పథకంతోపాటు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేస్తోందని వివరించారు. రైతుల నుంచి వరి, గోధుమలను కనీస మద్దతు ధరతో మరింత అధికంగా కొనుగోలు చేస్తామని అన్నారు. తృణధాన్యాలు, నూనె గింజలు సైతం కనీస మద్దతు ధరతో సేకరిస్తామని పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పప్పుగింజలను ప్రజలకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే అందుకు అనుమతి మంజూరు చేస్తామని నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. కనీస మద్దతు ధర విషయంలో ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవడం లేదని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. యూపీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని రైతులకు పిలుపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment