ఖర్చు బారెడు... ఆదాయం మూరెడు | MSP Of Paddy Is Not Satisfying Farmers | Sakshi
Sakshi News home page

ఖర్చు బారెడు... ఆదాయం మూరెడు

Published Fri, Jul 5 2019 7:50 AM | Last Updated on Fri, Jul 5 2019 7:53 AM

MSP Of Paddy Is Not Satisfying Farmers - Sakshi

సాక్షి, సోంపేట (శ్రీకాకుళం): దేశానికి వెన్నెముక రైతని, రైతులకు న్యాయం చేస్తామని కేంద్ర పాలకులు హామీలు గుప్పించడం తప్ప ఆచరణ కనిపించడం లేదని ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్‌లో పండించిన వరికి మద్దతు ధర కంటితుడుపుగా పెంచుతున్నాయని రైతులు వాపోతున్నారు. వరికి మద్దతు ధర పెంచాలని రైతు సంఘాలు, రైతులు ప్రభుత్వాలను కోరుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. మద్దతు ధర పెరుగుతుందని ప్రతీ సంవత్సరం ఎదురు చూస్తున్న రైతుకు ప్రతీ సంవత్సరం నిరాశ తప్పడం లేదు. ఈ ఏడాది కూడా మద్దతు ధర క్వింటాకు 65 రూపాయలు పెంచి రైతులకు నిరాశ శమిగిల్చిందని రైతులు తెలియజేస్తున్నారు. ఆశించినస్థాయిలో మద్దతు ధర పెరగకపోవడంతో నిరాశతోనే రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు.

ఆదాయానికి మించి ఖర్చు
వరి క్వింటాకు సాగు వ్యయం రైతు లెక్క ప్రకారం గ్రేడ్‌–1 రకానికి రూ.2,500లు, సాధారణ రకానికి రూ.2,200 అవుతుంది. ప్రభుత్వం మాత్రం క్వింటాకు ఖర్చు రూ.1,208 అని లెక్కలు చెబుతుంది. ప్రభుత్వం పెంచిన అత్యధిక మద్దతు ధర రూ.1,835గా ఉంది. గతేడాది వరి సాధారణ రకం క్వింటాకు రూ.1,750 ఉండగా ఈ ఏడాది రూ.1,815కు పెరిగింది. మేలు రకం రూ.1,770 ఉండగా రూ.1,835కు చేరింది. దీంతో రైతు సాగు వ్యయం ప్రకారం చూసినా వరి పండించే రైతు సుమారు రూ.600 నష్టపోవాల్సి వస్తుంది.

వరికి కనీస మద్దుతు ధర క్వింటాకు రూ.3000 ఉండాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కేంద్ర  ప్రభుత్వం వద్ద మొర పెట్టుకుంటున్నారు. అవి ఏమీ పట్టనట్టు కేంద్ర ప్రభుత్వం ప్రతీసారి కంటితుడుపుగా మద్దతు ధర పెంచుతుందని రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2019–20వ సంవత్సరాకి వరి పంటకు క్వింటాకు రూ.65 పెంచింది. వరి పంట పండించే రైతులు కష్టాలు కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదని నియోజకవర్గంలోని పలువురు రైతులు వాపోతున్నారు.

సోంపేట, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లోని రైతులకు వరి పంటే ప్రధాన పంట. ప్రతీ సంవత్సరం వరి పండించడం వల్ల నష్టాలు చవిచూడడం జరుగుతోంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 45 వేల ఎకరాల్లో సుమారు 50 వేల మంది రైతులు వరి పంటను పండిస్తుంటారు. ప్రభుత్వాలు వ్యయం ప్రకారమైనా మద్దతు ధర పెంచాలని, దీనిపై కేంద్ర పునరాలోచించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం వరి పంట సాగు చేయాలంటే  రైతులు భయ పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

కౌలుకు సాగు చేయడానికి కూడా కౌలు రైతులు ముందుకు రావడం లేదు. ఎకరా వరి సాగు చేయడానికి, నారు మడి తయారి, పొలం తయారి, నాట్లు వేయడం, ఎరువులు, కోతలు, నూర్పు చేయడం, కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం చేర్చే వరకు ఎకరానికి సుమారు రూ.25 వేలకు పైగా ఖర్చు అవుతుందని రైతులు తెలుపుతున్నారు. సక్రమంగా దిగుబడి వస్తే రూ. 30 వేలకు పైగా ఆదాయం వస్తుందని రైతులు తెలుపుతున్నారు.  ప్రకృతి విపత్తుల వల్ల పంటనాశనం  అయితే రైతులు కోలుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు.

కంటి తుడుపు చర్యే
ప్రభుత్వం పెంచిన మద్దతు ధర కంటి తుడుపు చర్యగా ఉంది. వరి పంట సాగు చేయడానికి శ్రమతో పాటు కూలీల ఖర్చు, పెట్టుబడి కూడా ఎక్కువుగా అవసరం. ప్రభుత్వాలు రైతులకు లాభాలు వచ్చే స్థాయిలో మద్దతు ధర పెంచకపోవడం దారుణం. వరి పంట మద్దతు ధర పెంపుపై పునరాలోచించాలి.
– యు.తిరుపతిరావు, రైతు, తాళభద్ర

పున:సమీక్షించాలి
వరి మద్దతు ధర విషయంలో ప్రభుత్వాలు పునఃసమీక్ష చేసుకోవాలి. మిగతా పంటల కంటే వరి పంట చేతికందే వరకు రైతు కష్టనష్టాలు ఎదుర్కోవడంతో పాటు, పెట్టుబడులు కూడా ఎక్కువుగా ఉంటాయి. వరి పంటకు  మద్దతు ధర పెంచడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
– పల్లి సదానందం, రైతు, బుసాభద్ర

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement