ఓటరు దరఖాస్తులకు 10లోగా పరిష్కారం | 10 within a for submission of applications solution to the voter | Sakshi
Sakshi News home page

ఓటరు దరఖాస్తులకు 10లోగా పరిష్కారం

Published Sat, Jan 4 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM

10 within a for submission of applications solution to the voter

 గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: జిల్లాలోని ఓటరు నమోదు, మార్పులకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను ఈనెల 10వ తేదీలోగా పరిష్కరించాలని ఎన్నికల సంఘం నియమించిన ఓటరు నమోదు పరిశీలకురాలు అనితా రాజేంద్ర అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలతో ఆమె మాట్లాడారు. దరఖాస్తులను కూలంకషంగా పరిశీలించాలని, బీఎల్‌వోలను, వీఆర్వోలను, పంచాయతీ కార్యదర్శులను ఇంటింటికి ఓటరు తనిఖీకి పంపాలన్నారు. ఏవిధమైన పొరపాట్లు జరిగినా అందుకు ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు అందరూ బాధ్యులు కావలసి ఉంటుందన్నారు.

పదేళ్ల కిందట ఓటరు నమోదు ప్రక్రియలో జరిగిన పొరపాటుకు ఒక జిల్లా కలెక్టరుపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలను ఆమె అధికారులకు గుర్తు చేశారు. ఓటరు నమోదు ప్రక్రియలో నియమించిన ప్రతీ అధికారి ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇదేనెల 16వ తేదీన ఓటర్లు తుది జాబితాను ప్రకటించాలని,  కొత్తగా నమోదు చేసుకున్న వారికి ఈనెల 25న జరిగే ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ రోజున ఫొటో గుర్తింపు కార్డులను పంపిణీ చేయవలసి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల సంఘం వివిధ కారణాల వల్ల రెండు సార్లు పరిశీలించి పరిష్కరించేగడువును పొడిగించిందని, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు. అభ్యంతరాల పరిశీలన పూర్తికాగానే డేటా అప్‌డేషన్ జరగాలన్నారు. ఓటరు నివాసం ఉన్నచోటే ఓటుహక్కు కల్పించాలని సూచించారు.

 జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ మాట్లాడుతూ స్వీకరించిన క్లెయింలను, అభ్యంతరాలను ఈనెల 10వ తేదీన పరిశీలన, పరిష్కారం పూర్తిచేసి డేటా అప్‌డేట్ చేయిస్తామని చెప్పారు. 16వ తేదీన ఓటర్ల తుదిజాబితా విడుదలకు సిద్ధం చేస్తామన్నారు. కళాశాల లేదా ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల విషయంలో వారు కోరుకున్న చోట అంటే వారి తల్లిదండ్రులు ఉన్నచోటగాని,చదువుకుంటున్న ప్రాంతాల్లోగానీ ఓటుహక్కు కల్పించాలన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో కొత్త కాలనీలకు తమ కుటుంబంతో సహా పూర్తిగా తరలిన వారికే ఆ కాలనీలో ఓటు హక్కు కల్పించాలని చెప్పారు. సమావేశంలో జేసీ వివేక్‌యాదవ్, అదనపు జేసీ కె.నాగేశ్వరరావు, డీఆర్వో కె.నాగబాబు, 17 నియోజకవర్గాల ఈఆర్వోవోలు, సహాయ ఈఆర్వోవోలు తదితరులు పాల్గొన్నారు.

 అవకతవకలపై విచారణ జరిపించండి..
 కొరిటెపాడు: ఓటర్ల నమోదు, తొలగింపుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని టీడీపీ నాయకులు శుక్రవారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా ఎన్నికల పరిశీలకురాలు అనితా రాజేందర్, కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్‌లను కలసి వినతి పత్రం సమర్పించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ కింది స్థాయి రెవెన్యూ అధికారుల అవినీతి, పక్షపాత వైఖరి కారణంగా ఓటర్ల నమోదు కార్యక్రమం పక్కదారి పడుతోందని,   అధికార పార్టీ నాయకుల ఒత్తిడిలకు లొంగి టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. వేమూరు, వట్టిచెరుకూరు, నాదెండ్ల, సత్తెనపల్లి, పొన్నూరు, దుగ్గిరాల తదితర మండలాల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయని, తగు విచారణ జరిపించాలని కోరారు. అనిత రాజేందర్ స్పందిస్తూ విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మన్నవ వెంట ఆ పార్టీ నాయకులు కనగాల చిట్టిబాబు, సగ్గెల రూబెన్, జి.దయారత్నం తదితరులు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement