సాక్షి, ఏలూరు : ఓటు దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా నాలుగురోజులు మాత్రమే గడువు ఉంది. పరిశీలనకు పది రోజుల వరకూ సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ నెల 15 వరకూ మాత్రమే ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇప్పుడు ఓటర్ కార్డు ఉంటే సరిపోదు. ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఏర్పడిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ సర్వేలు చేసి తమకు అనుకూలంగా లేనివారి ఓట్లు తొలగించేందుకు ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో అందరూ తమ ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఒకవేళ ఓటు లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.
ఓటు ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు
ఓటర్ ఐడీ కార్డు మీద ఎపిక్ నంబర్‌ను 1950కు ఎస్‌ఎంఎస్ చేస్తే ఓటు ఉందో లేదో తెలుస్తుంది. ఓటు లేని వాళ్లు ఆన్‌లైన్‌లో ఫామ్–6 నింపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం తహసీల్దార్ ఆఫీసులో గానీ, బూత్‌లెవల్ అధికారిని గానీ సంప్రదించాలి. అధికార పార్టీ దురాగతాలను ఎదుర్కొవాలంటే ప్రతి ఓటు కీలకమైన నేపథ్యంలో ఓటును అందరూ ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫారం–7 ద్వారా జిల్లాలో 38,145 బోగస్ దరఖాస్తులు దాఖలు కాగా, వాటిని పరిశీలించి ఇప్పటికే 32 కేసులు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన కారణంగా ఇకపై ఓటరు జాబితా నుంచి ఒక్క ఓటును కూడా తొలగించే అవకాశం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో 9 వేల ఓట్లు రెండు ప్రాంతాల్లో నమోదైనట్టు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిలో 1,700 ఓట్లను తొలగించామని తెలిపారు.
మండల కేంద్రాల్లో ఆన్‌లైన్ ప్రక్రియ
ఎన్నికల సమయానికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లు ఓటు దరఖాస్తు కోసం ఆన్‌లైన్ ప్రక్రియను ప్రారంభించారు. దరఖాస్తులు స్వీకరించి ఆన్‌లైన్‌లో వాటిని నమోదు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ఓటు హక్కు నమోదు చేసుకునేలా ఓటర్ హెల్ప్‌లైన్ పోర్టల్ యాప్‌ను ఎన్నికల సంఘం రూపొందించింది. ఈ పోర్టల్‌లో మన దరఖాస్తు ఏ స్టేజీలో ఉందో కూడా తెలుసుకోవచ్చు.
అధికారులు దరఖాస్తులు పరిశీలించి ఆమోదిస్తే ఓటరు గుర్తింపు కార్డును సర్వీస్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విధానంతో కార్యాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తు ఇచ్చే అవసరం పూర్తిగా తీరనుంది. ఓటు నమోదుకు ప్రత్యేకంగా ఫారమ్–6ను నింపి ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. ఫారమ్–6 ప్రతి ఈ సేవా కేంద్రాల్లో, తహసీల్దార్ కేంద్రాల్లో, జిల్లా కేంద్రమైన ఏలూరులోని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల విభాగంలోనూ లభిస్తుంది. ఆన్‌లైన్‌లో www.coeandhra.nic.in, www.nvsp.in అనే వెబ్‌సైట్ ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment