సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్.. అభ్యంతరాల స్వీకరణకు డిసెంబర్ 9 వరకు గడువు విధించింది. ఈనెల 23న విడుదల చేసిన ముసాయిదా ప్రకారం.. ఈ ఏడాది మొత్తం 2,43,903 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. గతంలో ఎన్నికలు జరిగిన 2017తో పోలిస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అదనంగా 87,946 మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదయ్యారు. అభ్యంతరాల స్వీకరణ సమయంలోనూ ఓటర్ల నమోదు కార్యక్రమానికి అనుమతులివ్వడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మరో 50 వేల ఓటర్లు నమోదయ్యే అవకాశం
2017 సమయంలోనూ ఓటర్ల ముసాయిదాను 2016 నవంబర్ 1న ప్రకటించారు. ఆ సమయంలో మూడు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో మొత్తం 1,26,452 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అనంతరం అభ్యంతరాలు స్వీకరించే సమయంలో దరఖాస్తులు తీసుకోవడంతో అదనంగా 29,505 మంది కొత్త ఓటర్లు చేరారు. తుది జాబితా విడుదల చేసే సమయానికి ఈ ఓటర్లు సంఖ్య 1,55,957కి చేరుకుంది. ఈసారి కూడా అభ్యంతరాల స్వీకరణ సమయంలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ముసాయిదాలో 2,43, 903 మంది ఓటర్లుండగా.. తుది జాబితా సమయానికి 2.90 లక్షలకు చేరుకుంటుందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నమోదైన ఓటర్ల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో మొత్తం 297 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
జిల్లా (ఉమ్మడి) |
2017 తుది జాబితా ఓటర్లు |
2022 ముసాయిదా ఓటర్లు |
శ్రీకాకుళం | 31,313 | 46,119 |
విజయనగరం | 34,570 | 71,518 |
విశాఖపట్నం | 90,074 | 1,26,266 |
మొత్తం | 1,55,957 | 2,43,903 |
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ల నమోదుకు సంబంధించిన ముసాయిదాపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ 9లోగా ఫారం–18 ద్వారా తెలపాలి. సంబంధిత ఈఆర్‌వోలు, ఏఈఆర్వోలు, డిసిగ్నేటెడ్ అధికారుల ద్వారా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అందించవచ్చు. కేవలం అభ్యంతరాలు మాత్రమే కాకుండా.. ఇంకా ఎవరైనా పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోలేకపోతే వారికి మరో అవకాశం కలి్పస్తున్నాం. 2017లో నమోదైన అన్ని ఓట్లు రద్దు చేశాం. ఇంకా దీనిపై కొందరికి అవగాహన కలగలేదన్నది మా దృష్టికి వచ్చింది. అందుకే దీనిపై మరింత అవగాహన కలి్పంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– డా.మల్లికార్జున, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment