Graduate voters list
-
ఉత్తరాంధ్రలో ‘పట్టభద్రులు’ పెరిగారు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్.. అభ్యంతరాల స్వీకరణకు డిసెంబర్ 9 వరకు గడువు విధించింది. ఈనెల 23న విడుదల చేసిన ముసాయిదా ప్రకారం.. ఈ ఏడాది మొత్తం 2,43,903 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. గతంలో ఎన్నికలు జరిగిన 2017తో పోలిస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అదనంగా 87,946 మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదయ్యారు. అభ్యంతరాల స్వీకరణ సమయంలోనూ ఓటర్ల నమోదు కార్యక్రమానికి అనుమతులివ్వడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో 50 వేల ఓటర్లు నమోదయ్యే అవకాశం 2017 సమయంలోనూ ఓటర్ల ముసాయిదాను 2016 నవంబర్ 1న ప్రకటించారు. ఆ సమయంలో మూడు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో మొత్తం 1,26,452 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అనంతరం అభ్యంతరాలు స్వీకరించే సమయంలో దరఖాస్తులు తీసుకోవడంతో అదనంగా 29,505 మంది కొత్త ఓటర్లు చేరారు. తుది జాబితా విడుదల చేసే సమయానికి ఈ ఓటర్లు సంఖ్య 1,55,957కి చేరుకుంది. ఈసారి కూడా అభ్యంతరాల స్వీకరణ సమయంలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ముసాయిదాలో 2,43, 903 మంది ఓటర్లుండగా.. తుది జాబితా సమయానికి 2.90 లక్షలకు చేరుకుంటుందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నమోదైన ఓటర్ల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో మొత్తం 297 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా (ఉమ్మడి) 2017 తుది జాబితా ఓటర్లు 2022 ముసాయిదా ఓటర్లు శ్రీకాకుళం 31,313 46,119 విజయనగరం 34,570 71,518 విశాఖపట్నం 90,074 1,26,266 మొత్తం 1,55,957 2,43,903 అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ల నమోదుకు సంబంధించిన ముసాయిదాపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ 9లోగా ఫారం–18 ద్వారా తెలపాలి. సంబంధిత ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, డిసిగ్నేటెడ్ అధికారుల ద్వారా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అందించవచ్చు. కేవలం అభ్యంతరాలు మాత్రమే కాకుండా.. ఇంకా ఎవరైనా పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోలేకపోతే వారికి మరో అవకాశం కలి్పస్తున్నాం. 2017లో నమోదైన అన్ని ఓట్లు రద్దు చేశాం. ఇంకా దీనిపై కొందరికి అవగాహన కలగలేదన్నది మా దృష్టికి వచ్చింది. అందుకే దీనిపై మరింత అవగాహన కలి్పంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – డా.మల్లికార్జున, కలెక్టర్ -
తప్పుల తడక
ఓటర్ ఐడీ ఒకే నెంబర్‌తో, ఒకే అడ్రస్‌తో ఒక వ్యక్తి ఓటు డబుల్ ఎంట్రీ పడిన ఓటరు జాబితా ఇది. ఈ వ్యక్తికి సంబంధించిన పేరులో కుమార్ అనే అక్షరాలు రెండుసార్లు నమోదు కావడంతో డబుల్ ఎంట్రీ చూపిస్తోంది. ఇక చిరునామా, విద్యార్హతలు, వృత్తి, వయసు అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. డబ్ల్యూఎక్స్‌డబ్ల్యూ 0096297 ఓటరు ఐడీ నెంబర్‌తో ఈ డబుల్ ఎంట్రీ జరిగింది. పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలోని పట్టభద్రుల ఓటర్ల జాబితా తప్పుల తడకగా తయా రైంది. ఒక్కో వ్యక్తికి రెండేసి ఓట్లు నమోదయ్యాయి. ఒకే వ్యక్తికి రెండు ఓట్లు నమోదు కాగా, రెండు వేర్వేరు ఓటర్ గుర్తింపు నెంబర్లు నమోదయ్యాయి. దీంతో ఆ వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నట్లు ముద్రిం చారు. మరికొందరికి రెండు ఓట్లు నమోదు చేసినా ఒక ఓటుకు గుర్తింపు నెంబరు లేకుండా ఉంది. అలాగే తండ్రి/భర్త కాలమ్ పేర్లు మార్పుతో రెండు ఓట్లు, వృత్తి కాలమ్‌లో వేర్వేరు వృత్తులుగా నమోదు చేసి ఒకే వ్యక్తికి రెండు ఓట్లు నమోదు చేశారు. మరో ఓటరుకు అయితే అసలు ఓటరు ఐడీ నెంబరే ఇవ్వలేదు. దీంతో పట్టభద్రుల ఓటర్లు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ♦ జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన దివ్యజ్యోతి కురుకూరి పేరుతో రెండు ఓట్లు నమోదయ్యాయి. ఎంవైఎక్స్30023356 నెంబరుతో ఒకటి, డబ్ల్యూఎక్స్‌డబ్ల్యూ 0590067 నెంబరుతో మరో ఓటు నమోదైంది. కాకపోతే తండ్రి/భర్త కాలమ్‌లో రెండు వేర్వేరు పేర్లు నమోదయ్యాయి. ♦ మండలంలోని వేగవరంలో ఇందిరా కాలనీకి చెందిన పద్మ జువ్వాల అనే మహిళకు సంబంధించి రెండు ఓట్లు నమోదయ్యాయి. ఒక ఓటుకు ఓటర్ ఐడీ నెంబరు ఉండగా, మరో ఓటుకు ఓటరు ఐడీ లేదు. తండ్రి/భర్త కాలమ్‌లో రెండు వేర్వేరు పేర్లు నమోదయ్యాయి. ♦ జంగారెడ్డిగూడెం మండలంలోని తాడువాయిలో పద్మావతి పాలూరికి సంబంధించి రెండు ఓట్లు నమోదు కాగా, రెండు ఓట్లకు ఓటర్ ఐడీలు నమోదు కాలేదు. వృత్తి కాలమ్‌లో ఒకటి పోస్ట్‌మన్ అని, ఒకటి హౌస్‌వైఫ్ అని నమోదైంది. ♦ జంగారెడ్డిగూడెం పట్టణంలో నాగదుర్గ వెంకట ధనలక్ష్మి గుళ్లపూడి అనే యువతికి రెండు ఓట్లు నమోదయ్యాయి. ఒక ఓటుకు ఓటరు ఐడీ నెంబర్ ఉండగా, మరో ఓటుకు ఓటరు ఐడీ లేదు. 402, 403 సీరియల్‌తో ఈ ఓట్లు నమోదయ్యాయి. ఇక ఓటరు పేరుకు వచ్చేసరికి ఒకచోట పూర్తి పేరుతో, మరోచోట పొట్టి ఫార్మాట్లో నమోదైంది. అలాగే తండ్రి పేరు వద్ద ఇటువంటి మార్పే ఉంది. ఇక వృత్తి వివరాల్లో ఒక చోట స్టూడెంట్ అని, మరో చోట సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఉంది. ♦ ఇలా పట్టభద్రుల ఓటర్ల జాబితాలో తప్పులు చోటు చేసుకున్నాయి. దీంతో పట్టభద్రుల ఓటర్లు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో ప్రతి మండలంలోనూ ఇలాగే ఓట్ల జాబితాలో తప్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు నమోదయ్యాయి. ఒకవేళ తాము అభ్యంతరాలు వ్యక్తం చేస్తే పూర్తిగా ఓటే తొలగిస్తారేమో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఓటర్ల జాబితా సరి చేసి స్పష్టమైన జాబితాను ప్రచురించాలని కోరుతున్నారు. -
ఆ రెండు రోజులూ ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహించండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శాసన మండలి సభ్యుల ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదుగాను ఈ నెల 7, 14 తేదీల ఆదివారాల ను ప్రత్యేక క్యాంపెయిన్ డేలుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణ, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు, ఈవీఎం గోదాముల నిర్మాణం, పెయిడ్ న్యూస్ తదితర అంశాలపై చర్చించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణపై రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు. గత ఆదివారం నిర్వహించిన క్యాంపెయిన్‌లో చాలా కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో లేరని ఈ సమావేశంలో పలు రాజకీయ పార్టీల నుండి ఫిర్యాదులు అందాయన్నారు. వచ్చే 2 ఆదివారాల్లో నిర్వహించే క్యాంపెయిన్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్ఓలు తప్పనిసరిగా కేంద్రాల్లో ఉండి ఓటర్ల నమోదు, సవరణలపై దరఖాస్తులు తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక క్యాంపెయిన్ల నిర్వహణపై కేబుల్ టీవీలు, పత్రికలు, పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. జనవరి 1, 2015 నాటికి 18 సంవత్సరాలు నిండే వారంతా సాధారణ ఓటరుగా, నవంబరు 1, 2011 నాటికి డిగ్రీ పూర్తయిన వారంతా గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల్లో ఆధార్ సీడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ.. సాధారణ ఓటరు జాబితా సవరణకు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 33,083 దరఖాస్తులు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటరు నమోదుకు గాను 6,400 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. మొత్తం అందిన దరఖాస్తుల్లో మూడో వంతు గత ఆదివారం నిర్వహించిన ప్రత్యేక క్యాంపెయిన్‌లోనే అందాయని వివరించారు. జిల్లాలో ఈవీఎం గోదాము నిర్మాణం దాదాపుగా పూర్తయిందని, ప్రహరీగోడ, అంతర్గత రోడ్ల నిర్మాణానికి మరో రూ.20లక్షలు అవసరమవుతాయని తెలిపారు. పెయిడ్ న్యూస్‌కు సంబంధించి పూర్తి నివేదిక ను త్వరలో సమర్పిస్తామన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో డీఆర్ఓ సూర్యారావు, ఎన్నికల విభాగం తహసీల్దార్ జ్ఞానప్రసూనాంబ పాల్గొన్నారు.