ఓటర్ ఐడీ ఒకే నెంబర్‌తో, ఒకే అడ్రస్‌తో ఒక వ్యక్తి ఓటు డబుల్ ఎంట్రీ పడిన ఓటరు జాబితా ఇది. ఈ వ్యక్తికి సంబంధించిన పేరులో కుమార్ అనే అక్షరాలు రెండుసార్లు నమోదు కావడంతో డబుల్ ఎంట్రీ చూపిస్తోంది. ఇక చిరునామా, విద్యార్హతలు, వృత్తి, వయసు అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. డబ్ల్యూఎక్స్‌డబ్ల్యూ 0096297 ఓటరు ఐడీ నెంబర్‌తో ఈ డబుల్ ఎంట్రీ జరిగింది.
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలోని పట్టభద్రుల ఓటర్ల జాబితా తప్పుల తడకగా తయా రైంది. ఒక్కో వ్యక్తికి రెండేసి ఓట్లు నమోదయ్యాయి. ఒకే వ్యక్తికి రెండు ఓట్లు నమోదు కాగా, రెండు వేర్వేరు ఓటర్ గుర్తింపు నెంబర్లు నమోదయ్యాయి. దీంతో ఆ వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నట్లు ముద్రిం చారు. మరికొందరికి రెండు ఓట్లు నమోదు చేసినా ఒక ఓటుకు గుర్తింపు నెంబరు లేకుండా ఉంది. అలాగే తండ్రి/భర్త కాలమ్ పేర్లు మార్పుతో రెండు ఓట్లు, వృత్తి కాలమ్‌లో వేర్వేరు వృత్తులుగా నమోదు చేసి ఒకే వ్యక్తికి రెండు ఓట్లు నమోదు చేశారు. మరో ఓటరుకు అయితే అసలు ఓటరు ఐడీ నెంబరే ఇవ్వలేదు. దీంతో పట్టభద్రుల ఓటర్లు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.
♦ జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన దివ్యజ్యోతి కురుకూరి పేరుతో రెండు ఓట్లు నమోదయ్యాయి. ఎంవైఎక్స్30023356 నెంబరుతో ఒకటి, డబ్ల్యూఎక్స్‌డబ్ల్యూ 0590067 నెంబరుతో మరో ఓటు నమోదైంది. కాకపోతే తండ్రి/భర్త కాలమ్‌లో రెండు వేర్వేరు పేర్లు నమోదయ్యాయి.
♦ మండలంలోని వేగవరంలో ఇందిరా కాలనీకి చెందిన పద్మ జువ్వాల అనే మహిళకు సంబంధించి రెండు ఓట్లు నమోదయ్యాయి. ఒక ఓటుకు ఓటర్ ఐడీ నెంబరు ఉండగా, మరో ఓటుకు ఓటరు ఐడీ లేదు. తండ్రి/భర్త కాలమ్‌లో రెండు వేర్వేరు పేర్లు నమోదయ్యాయి.
♦ జంగారెడ్డిగూడెం మండలంలోని తాడువాయిలో పద్మావతి పాలూరికి సంబంధించి రెండు ఓట్లు నమోదు కాగా, రెండు ఓట్లకు ఓటర్ ఐడీలు నమోదు కాలేదు. వృత్తి కాలమ్‌లో ఒకటి పోస్ట్‌మన్ అని, ఒకటి హౌస్‌వైఫ్ అని నమోదైంది.
♦ జంగారెడ్డిగూడెం పట్టణంలో నాగదుర్గ వెంకట ధనలక్ష్మి గుళ్లపూడి అనే యువతికి రెండు ఓట్లు నమోదయ్యాయి. ఒక ఓటుకు ఓటరు ఐడీ నెంబర్ ఉండగా, మరో ఓటుకు ఓటరు ఐడీ లేదు. 402, 403 సీరియల్‌తో ఈ ఓట్లు నమోదయ్యాయి. ఇక ఓటరు పేరుకు వచ్చేసరికి ఒకచోట పూర్తి పేరుతో, మరోచోట పొట్టి ఫార్మాట్లో నమోదైంది. అలాగే తండ్రి పేరు వద్ద ఇటువంటి మార్పే ఉంది. ఇక వృత్తి వివరాల్లో ఒక చోట స్టూడెంట్ అని, మరో చోట సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఉంది.
♦ ఇలా పట్టభద్రుల ఓటర్ల జాబితాలో తప్పులు చోటు చేసుకున్నాయి. దీంతో పట్టభద్రుల ఓటర్లు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో ప్రతి మండలంలోనూ ఇలాగే ఓట్ల జాబితాలో తప్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు నమోదయ్యాయి. ఒకవేళ తాము అభ్యంతరాలు వ్యక్తం చేస్తే పూర్తిగా ఓటే తొలగిస్తారేమో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఓటర్ల జాబితా సరి చేసి స్పష్టమైన జాబితాను ప్రచురించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment