ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జాతీయ ఓటర్ల దినోత్సవానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. శనివారం అన్ని పోలింగ్ కేంద్రాల్లో నాలుగో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాల పరిధిలోని సీనియర్ ఓటర్లను గుర్తించి వారిని సన్మానించనుంది. 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కు పొందాలన్న ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం మూడేళ్ల నుంచి ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఓటరుగా నమోదు కావలన్న బాధ్యతను గుర్తుచేస్తూ వివిధ రకాల కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంటోంది. జిల్లాలోని 2751 పోలింగ్ కేంద్రాల వద్ద రంగోలి వంటి కార్యక్రమాలను నిర్వహించి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గతేడాది నిర్వహించిన మూడో విడత జాతీయ ఓటర్ల దినోత్సవం రోజు కొత్తగా ఓటు హక్కు పొందిన 74 వేల మందికి సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చి కార్యక్రమానికి అధికారులు మరింత వన్నె తెచ్చారు. తాజాగా ఓటరు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఓటర్ల నమోదు దరఖాస్తులు విచారణలో ఉండటంతో ఓటర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చే విధానానికి ఈ ఏడాది స్వస్తి పలికారు.
ఆఖరి అవకాశం
ఓటరుగా నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆఖరి అవకాశాన్ని కల్పించింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటరుగా చేరేందుకు మరో అవకాశం వచ్చింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఓటు హక్కు కోసం ఫారం-6, పేర్ల తొలగింపునకు ఫారం-7, తప్పుల సవరణకు ఫారం-8, బదిలీకి ఫారం-8ఏ లను అన్ని పోలింగ్ కేంద్రాల్లోని బూత్ లెవల్ ఆఫీసర్ల వద్ద సిద్ధంగా ఉంచింది. ఆ రోజు వచ్చే దరఖాస్తులను కూడా త్వరితగతిన విచారించి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేలా కృషి చేస్తోంది. గతేడాది నవంబర్ 19వ తేదీ జిల్లా యంత్రాంగం విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాలో 23 లక్షల 15 వేల 407 మంది ఓటర్లుగా తేలారు. అదే ఏడాది జనవరిలో ప్రకటించిన ముసాయిదా జాబితాతో పోల్చుకుంటే అదనంగా లక్షా 9వేల 715 మంది కొత్త ఓటర్లు చేరారు. ఈ ఏడాది జనవరి 16వ తేదీ తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు కోసం దరఖాస్తులు రావడంతో తుది జాబితా ప్రకటనను నెలాఖరుకు వాయిదా వేసింది.
ర్యాలీలు.. సందేశాలు
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద శనివారం ర్యాలీలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నుంచి ఆదేశాలు వెళ్లాయి. పరిస్థితులను బట్టి మానవహారాలు కూడా నిర్వహించాలని సూచించింది. ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు వివరించేందుకు వీలుగా సందేశాలను కూడా సిద్ధం చేసింది. వీటికి సంబంధించిన ప్రచార సామగ్రిని జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలింగ్ కేంద్రాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వాల్‌పోస్టర్లు, బ్యాడ్జీలు, ఓటర్ల ప్రతిజ్ఞకు సంబంధించిన కరపత్రాలు రెడీగా ఉన్నాయి. ఒంగోలులోని ప్రకాశం భవనం వద్ద కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ ర్యాలీని ప్రారంభించి జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రాధాన్యతను వివరించనున్నారు.
ఇదీ..ఓటర్ల ప్రతిజ్ఞ
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఓటరు చేత ప్రతిజ్ఞ చేయించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉండే ఓటర్లతో పాటు కొత్తగా ఓటు హక్కు పొందిన వారితో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించింది. ‘భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం’ అని ఓటరు చేత ప్రతిజ్ఞ చేయించనున్నారు.
ఓటరు పండుగ
Published Fri, Jan 24 2014 6:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement