Voters Identity Card
-
పోల్ చిట్టీయే.. ఓ గూగుల్ మ్యాప్
నల్లగొండ : పోల్ చిట్టీ.. ఓ గూగుల్ మ్యాప్‌లా ఉపయోగపడనుంది. ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల సంఘం ఈసారి వీటి విషయంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో అభ్యర్థులే తమ ఏజెంట్ల ద్వారా పోలింగ్ బూత్‌కు వచ్చే ఓటర్లకు జాబితాలో వారి సంఖ్య చూసి పోల్‌చిట్టీ రాసి ఇచ్చేవారు. దాన్ని తీసుకొని పోలింగ్‌కేంద్రంలోకి వెళ్లి ఓటు వేసేవారు. కానీ ఈసారి ఎన్నికల సం ఘం పోల్ చిట్టీలను ముద్రించి నేరుగా ఓటర్ ఇంటికి వెళ్లి అందజేసే కార్యక్రమాన్ని చేపట్టింది. శుక్రవారం జిల్లావ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం మొదలైంది. చిట్టీమీద ఫొటోతోపాటు ఓటరు జాబితాలో ఉన్న ఐడీ నంబర్, వెనకాల తన ఓటు ఏ పోలింగ్ కేం ద్రంలో ఉంది.. ఆ కేంద్రం ఎక్కడ ఉంది.. ఏ దారిగుండా, ఏ దిక్కు కు వెళ్లాలి అనేది సవివరంగా ముద్రించింది. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంతో ఓటర్లకు ఓటు వేయడం సులభమవుతుంది. చిట్టీల పంపిణీ ప్రారంభం.. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో 12,87,370 మంది ఓటర్లు ఉండగా, 1,629 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రతి ఓటరుకు పోల్ చిట్టీలను పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బీఎల్ఓలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరు నియోజకవర్గాల పరిధిలో గురువారం పోల్ చిట్టీల పంపిణీని ప్రారంభించారు. గుర్తింపు కార్డులా పోల్ చిట్టీ. గతంలో పోల్ చిట్టీ తెల్లకాగితంమీద రాసిచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. ఓటరు ఫొటోతో పాటుపేరు, ఎపిక్ నంబర్, పోలింగ్ కేంద్రం నంబర్ కూడా ఉంటుండడంతో ఇదో గుర్తింపు కార్డు మాదిరిగా అయ్యింది. గతంలో ఓటు వేసేందుకు ఓటర్ ఐడీకార్డు లేనివారు రేషన్ కార్డో.. డ్రైవింగ్ లైసెన్సో, బ్యాంక్ పాస్‌బుక్కో తీసుకొనివెళ్లి చూపించాల్సి ఉండేది. ప్రస్తుతం అవేవీ అవసరం లేదు. ఒక్క పోటీ చిట్టీ ఉంటే సరిపోతుంది. సమయం ఆదా.... అన్ని గుర్తింపులు ఉన్న పోల్ చిట్టీ ముద్రించడం వల్ల పోలింగ్ త్వరితగతిన పూర్తి కావడంతోపాటు ఓటరు ఓటు వేసే సమయం ఆదా అవుతుంది. చిట్టీ పట్టుకుని నేరుగా వెళ్లి పోలింగ్ అధికారికి చూపిస్తే దానిపై ఉన్న నంబర్ ఆధారంగా ఓటర్ల జాబితాలోని నంబర్‌తో సరిచూస్తారు. ఫొటో కూడా చెక్చేస్తారు. ఆ ఓటరు నిజమైన ఓటరా... కాదా అనేది తేలిపోతుంది. ఓటరును గుర్తించడం అక్కడున్న పార్టీ ఏజెంట్లకు కూడా సులభతరం అవుతుంది. బోగస్ ఓట్లకు తావుండదు .. పోల్ చిట్టీపై అన్ని వివరాలు ఉంటుండడంతో బోగస్ ఓట్లు వేసేందుకు తావుండదు. గతంలో ఇలాంటి పోల్‌చిట్టీలు లేకపోవడం వల్ల ఎవరైనా ఓటు వేయకపోతే ఇతనే ఆ ఓటరు అంటూ వేరేవారితో ఓటు వేయించిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఏజెంట్లు గుర్తుపట్టిన సందర్భాల్లో గొడవలు జరిగేవి. ఇలాంటి సంఘటనలకు చెక్‌పెట్టేందుకే ఎన్నికల కమిషన్ ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. పార్టీ ఏజెంట్లకు తప్పినతిప్పలు.. ఓటర్లను గుర్తు పట్టేందుకు ఆయా పార్టీల ఏజెంట్లు ఎన్నో తిప్పలు పడేవారు. ఏజెంట్లు ఆయా పోలింగ్ బూత్‌ల పరిధిలో ఉండే అందరి ఓటర్లను గుర్తు పట్టాలని ఏమీ ఉండదు. ఇప్పుడు పోల్‌చిట్టీమీద ఓటరు ఫొటోతోపాటు అతని పేరు, తండ్రిపేరు ఉండడం వల్ల పార్టీనేతలు కూడా ఫలానా ప్రాంతానికి చెందిన వ్యక్తి అని గుర్తించడం ఈజీగా మారింది. దీంతో ఏజెంట్లకు కూడా తిప్పలు తప్పాయి. -
ఓటరు పండుగ
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జాతీయ ఓటర్ల దినోత్సవానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. శనివారం అన్ని పోలింగ్ కేంద్రాల్లో నాలుగో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాల పరిధిలోని సీనియర్ ఓటర్లను గుర్తించి వారిని సన్మానించనుంది. 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కు పొందాలన్న ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం మూడేళ్ల నుంచి ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఓటరుగా నమోదు కావలన్న బాధ్యతను గుర్తుచేస్తూ వివిధ రకాల కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంటోంది. జిల్లాలోని 2751 పోలింగ్ కేంద్రాల వద్ద రంగోలి వంటి కార్యక్రమాలను నిర్వహించి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గతేడాది నిర్వహించిన మూడో విడత జాతీయ ఓటర్ల దినోత్సవం రోజు కొత్తగా ఓటు హక్కు పొందిన 74 వేల మందికి సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చి కార్యక్రమానికి అధికారులు మరింత వన్నె తెచ్చారు. తాజాగా ఓటరు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఓటర్ల నమోదు దరఖాస్తులు విచారణలో ఉండటంతో ఓటర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చే విధానానికి ఈ ఏడాది స్వస్తి పలికారు. ఆఖరి అవకాశం ఓటరుగా నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆఖరి అవకాశాన్ని కల్పించింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటరుగా చేరేందుకు మరో అవకాశం వచ్చింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఓటు హక్కు కోసం ఫారం-6, పేర్ల తొలగింపునకు ఫారం-7, తప్పుల సవరణకు ఫారం-8, బదిలీకి ఫారం-8ఏ లను అన్ని పోలింగ్ కేంద్రాల్లోని బూత్ లెవల్ ఆఫీసర్ల వద్ద సిద్ధంగా ఉంచింది. ఆ రోజు వచ్చే దరఖాస్తులను కూడా త్వరితగతిన విచారించి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేలా కృషి చేస్తోంది. గతేడాది నవంబర్ 19వ తేదీ జిల్లా యంత్రాంగం విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాలో 23 లక్షల 15 వేల 407 మంది ఓటర్లుగా తేలారు. అదే ఏడాది జనవరిలో ప్రకటించిన ముసాయిదా జాబితాతో పోల్చుకుంటే అదనంగా లక్షా 9వేల 715 మంది కొత్త ఓటర్లు చేరారు. ఈ ఏడాది జనవరి 16వ తేదీ తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు కోసం దరఖాస్తులు రావడంతో తుది జాబితా ప్రకటనను నెలాఖరుకు వాయిదా వేసింది. ర్యాలీలు.. సందేశాలు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద శనివారం ర్యాలీలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నుంచి ఆదేశాలు వెళ్లాయి. పరిస్థితులను బట్టి మానవహారాలు కూడా నిర్వహించాలని సూచించింది. ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు వివరించేందుకు వీలుగా సందేశాలను కూడా సిద్ధం చేసింది. వీటికి సంబంధించిన ప్రచార సామగ్రిని జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలింగ్ కేంద్రాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వాల్‌పోస్టర్లు, బ్యాడ్జీలు, ఓటర్ల ప్రతిజ్ఞకు సంబంధించిన కరపత్రాలు రెడీగా ఉన్నాయి. ఒంగోలులోని ప్రకాశం భవనం వద్ద కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ర్యాలీని ప్రారంభించి జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రాధాన్యతను వివరించనున్నారు. ఇదీ..ఓటర్ల ప్రతిజ్ఞ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఓటరు చేత ప్రతిజ్ఞ చేయించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉండే ఓటర్లతో పాటు కొత్తగా ఓటు హక్కు పొందిన వారితో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించింది. ‘భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం’ అని ఓటరు చేత ప్రతిజ్ఞ చేయించనున్నారు. -
అర్హులందరికీ ఓటు హక్కు కల్పించండి
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : అర్హులైన వారందర్నీ ఓటర్లుగా చేర్చేం దుకు కలెక్టర్లు కృషి చేయాలని భారత ఎన్నికల కమిషనర్ వినోద్‌జుట్‌షి చెప్పారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్‌తో కలిసి ఆయన గురువారం జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్ల జాబితా తయారీ, ఓటర్ల చేర్పులు తదితర అంశాలను సమీక్షించారు. 18 సంవత్సరాలు నిండిన వారందర్నీ ఓటర్లుగా నమోదు చేయటం, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ఓటర్లకు గుర్తింపు కార్డుల జారీ.. తదితర అంశాలపై పలు సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్‌పై అవగాహన కలిగించి, ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు వివరించారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పూర్తయ్యిందని 48 కొత్త పోలింగ్ కేంద్రాలు, 70 పోలింగ్ కేంద్రాల స్థానం మార్చామని తెలియజేశారు. ఈవీఎంలను భద్రపరిచేందుకు గిడ్డంగి నిర్మాణం పురోగతిలో ఉందని వివరించారు. జిల్లాలో ఇంటింటి సర్వే నిర్వహించి 93,990 మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నాలుగువేల మంది మైక్రో అబ్జర్వర్లు, 350 మంది సెక్టోరియల్ అధికారులను గుర్తించినట్లు చెప్పారు. సమావేశంలో జేసీ పి. ఉషా కుమారి, డీఐవో శర్మ పాల్గొన్నారు.