సంకుచితాలకు అతీతంగా ఓటేయండి: ప్రణబ్ ముఖర్జీ
బాధ్యతాయుతంగా ఈ హక్కును వినియోగించుకోండి
కొత్త ఓటర్లకు రాష్ట్రపతి ప్రణబ్ ఉద్బోధ
న్యూఢిల్లీ: తగిన సమాచారాన్ని తెలుసుకుని, సంకుచిత ప్రతిఫలాలకు అతీతంగా ఓటు వేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశంలో కొత్తగా నమోదైన 1.27 కోట్ల యువ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని ఆయన వారికి ఉద్బోధించారు. అన్నీ తెలుసుకుని, సంకుచిత ప్రతిఫలాలకు అతీతంగా నైతిక విలువలతో ఓటు హక్కును వినియోగించుకోగలరని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో శనివారం ఏర్పాటైన 4వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ మాట్లాడారు. ప్రతి ఎన్నికల్లోనూ సగర్వంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని దేశంలోని దాదాపు 81 కోట్ల మంది ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
- మిలిటెంట్లు, నక్సల్స్ గ్రూపుల బెదిరింపులకు, ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినప్పుడల్లా దేశప్రజలు వెరవలేదని, పోలింగ్‌లో పెద్దసంఖ్యలో పాల్గొన్న ఓటర్లు తమ ధైర్య సాహసాలను చాటుకున్నారు.
- రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారత్‌తో పాటు పలు దేశాలు స్వాతంత్య్రం పొంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను స్వీకరించినా, కొద్ది దేశాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాయి.
- చాలా దేశాలు నియంతలు లేదా మిలటరీ జుంటాల పాలనలోకి వెళ్లాయి.
- పేదరికం సహా పలు సమస్యలను ఎదుర్కొంటున్నా, భారత్ తన ప్రజాస్వామ్యాన్ని మాత్రం బలోపేతం చేసుకోగలిగింది.
- ప్రరజాస్వామిక ప్రక్రియలో ఓటరే కీలక పాత్రధారి. ప్రజా ప్రాతినిధ్య సంస్థలన్నీ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టాలి.
కార్పొరేట్ రంగం కీలక పాత్ర పోషించాలి: సీఈసీ సంపత్
ఓటర్లకు అవగాహన కల్పించడంలో కార్పొరేట్ రంగం కీలక పాత్ర పోషించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఓటర్లకు అవగాహన కల్పించడాన్ని కార్పొరేట్ రంగం తన సామాజిక బాధ్యతలో భాగంగా చేసుకోవాలన్నారు. ఈ ఏడాది జరగనున్న 16వ లోక్‌సభ ఎన్నికల నిర్వహణను సవాలుగా తీసుకోవాలని ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా దాదాపు 81 కోట్ల మంది ఓటర్లు 9 లక్షల పోలింగ్ కేంద్రాల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. లక్షలాది మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాలుపంచుకోనున్నట్లు తెలిపారు. గడచిన కొద్ది నెలల్లో 3.90 కోట్ల మంది కొత్తగా ఓటర్ల జాబితాల్లో చేరారని, వారిలో 1.27 కోట్ల మంది కొత్తగా ఓటు హక్కు పొందిన వారని చెప్పారు. సకాలంలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఎన్నికల్లో విశిష్టమైన సేవలందించిన ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్‌కు ఎన్నికల కమిషన్ జాతీయ అవార్డును అందజేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా విజయ్ దేవ్ ఈ అవార్డును అందుకున్నారు.