2024 ఎన్నికల వివరాల పుస్తకాన్ని విడుదల చేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తదితరులు
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
భవిష్యత్తులోనూ ఈ పద్ధతిని కొనసాగించాలి
ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో శాంతియుతంగా ఎన్నిక లు జరిగే సుదీర్ఘ సంప్రదాయం ఉందని, భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఈ అద్భుతమైన పద్ధతిని కొనసాగించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. శనివారం రవీంద్ర భారతిలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2024 ఎన్నికల వివరాలకు సంబంధించిన పుస్తకాన్ని గవర్నర్ విడుదల చేశారు. అలాగే ఆ ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన అధికారులకు అవార్డులు ప్రదానం చేశారు. 18 ఏళ్లు పూర్తి చేసుకున్న పలువురికి గవర్నర్ నూతన ఓటర్ ఐడీ కార్డులను అందజేశారు.
ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా, స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వేస్తామని వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను బలోపేతం చేసేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కృషి చేస్తోందన్నారు. ఆన్‌లైన్‌లో ఓటరు నమోదు, దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్ల వద్ద ర్యాంప్‌లు, ఈవీఎంలపై బ్రెయిలీ ఫాంట్‌లు, బ్రెయిలీ బ్యాలెట్ పేపర్లు వంటి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఎన్నికల యంత్రాంగం విజయవంతంగా నిర్వహించిందని కొనియాడారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అభినందనలు
రాష్ట్రంలో కొత్తగా 5.45 లక్షల మందికి ఈపీఐసీ కార్డులు జారీ చేసిందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)కి గవర్నర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనడం ద్వారా మన ప్రజాస్వామ్య సంప్రదాయాలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఈవో సుదర్శన్‌రెడ్డి, రిటైర్డ్ సీఈవో రాణీ కుముదిని, అడిషనల్ సీఈవో లోకేశ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, పలు జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ఎన్‌సీసీ కేడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment