ఓటు వేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా.. తమిళిసై సీరియస్‌ | Governor Tamilisai Soundararajan Comments On Padi Kaushik Reddy | Sakshi
Sakshi News home page

ఓటు వేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా.. తమిళిసై సీరియస్‌

Published Thu, Jan 25 2024 10:53 AM | Last Updated on Thu, Jan 25 2024 4:41 PM

Governor Tamilisai Soundararajan Comments On Padi Kaushik Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్‌ రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై తాజాగా తమిళిసై స్పందించారు. ఈ క్రమంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. 

అయితే, ఈరోజు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో నేషనల్‌ ఓటర్స్‌ డే సందర్భంగా సెలబ్రేషన్స్‌ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఈవో వికాస్‌రాజ్‌, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌రాస్‌ విచ్చేశారు. 

ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ..‘ఓటు వేయడం మన హక్కు. స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు మధ్య వారధిగా ఉండటం నా బాధ్యత. జనరల్‌ ఎన్నికలను విజయవంతంగా జరిపినందుకు శుభాకాంక్షలు. మొదటిసారి ఇంటి నుంచే ఓటు వేయడం అనేది మంచి పరిణామం. ఓటింగ్‌ రోజు సెలవు అనేది సరదా కోసం కాదని యువత గుర్తుంచుకోవాలి. ఓటు హక్కు వినియోగం అనేది యుద్ధంలో పాల్గొన్నట్టు అనుకోవాలి. ఓటు వేసిన మార్క్‌ చూసి గర్వంగా ఫీలవ్వాలి. నేను నోటాకు వ్యతిరేకం. ఎన్నికల బరిలో ఉన్న ఎవరో ఒకరిని యువత ఎన్నుకోవాలన్నారు. 

పాడి కౌశిక్‌ రెడ్డిపై ఫైర్‌..
ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ఓ అభ్యర్థి ఓట్లు అడిగిన అంశాన్ని తమిళిసై ప్రస్తావించారు. ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ఓ అభ్యర్థి అన్నారు. ఎన్నికల కమిషన్‌ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. కాగా, సదరు అభ్యర్థి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిగా తెలుస్తోంది. ఓటర్లను ఎవరూ బెదిరించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఓటు శాతం పెరగడానికి ప్రకటనలు ఒక్కటే ఉపయోగపడవు అనేది ఈసీ ఆలోచన. ఓటు అనేది మోస్ట్‌ పవర్‌ ఫుల్‌ ఆయుధం. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ఓటు వేయాలి. మంచి అభ్యర్థిని ఓటర్‌ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుంది. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలి’ అని కామెంట్స్‌ చేశారు.

అనంతరం, 18 ఏళ్లు పూర్తి చేసుకొని కొత్తగా ఓటును పొందిన మనీషా అనే యువతికి గవర్నర్ తమిళిసై ఓటర్ ఐడీని అందించారు. అలాగే, జనరల్ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచిన పలువురు ఐఏఎస్ , ఐపీఎస్, వలంటీర్లకు గవర్నర్‌ సర్టిఫికేట్ అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement