
25న ఓటర్ల జాబితా ప్రదర్శన : భన్వర్‌లాల్
‘సాక్షి’తో సీఈఓ భన్వర్‌లాల్
పేరు లేకపోతే అక్కడికక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు
షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పోలింగ్ కేంద్రాలు, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లోనూ, రాష్ట్ర స్థాయిలోనూ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) భన్వర్‌లాల్ శనివారం సాక్షికి తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తామన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్లు.. జాబితాలో తమ పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని, ఒక వేళ పేరు లేకపోతే అక్కడికక్కడే బూత్ స్థాయి ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సందర్భంగా కొత్తగా ఓటు కోసం, అభ్యంతరాలు, సవరణలు, బదిలీల కోసం మొత్తం 65.02 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. అన్ని దరఖాస్తులను 23 కల్లా పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా పోలింగ్ కేంద్రాలు, నియోజకవర్గ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిల్లో విద్యార్థులకు పెయింటింగ్, రంగోళీ, క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు.
ఈ నెల 31న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని, రాజకీయ పార్టీలకూ ప్రతులను అందజేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని, ఆ మేరకు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణకోసం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో సంఘటనల ఆధారంగా ఏ ఊరిలో ఏ వర్గం ఓటర్లపై ఎవరు, ఎలాంటి ఒత్తిడి, దౌర్జన్యాలు చేయవచ్చనే సమాచారాన్ని ఆ నెలాఖరులోగా తెలియజేయాల్సిందిగా ఎస్పీలను ఆదేశించినట్లు చెప్పారు. అలాంటి ఘటనలు చోటు చేసుకునే ఊర్లలో ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లను చేయనున్నట్లు తెలిపారు.