జాతీయ ఓటర్ల దినోత్సవంలో గవర్నర్ నజీర్, సీఎస్ జవహర్‌రెడ్డి, ముఖేష్ కుమార్ మీనా తదితరులు
సాక్షి, అమరావతి: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన ఓటర్ల అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా బలమైన ఆయుధమన్నారు. సమావేశానికి హాజరైన వారితో ఓటు హక్కును తెలియజేసే విధంగా గవర్నర్ ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ..రాష్ట్రంలో పురుష ఓటర్లు కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పారు.
గతేడాదిగా ఓటు నమోదు, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు చేసిన విశేష కృషి ఫలితంగా ఇటీవల ప్రకటించిన తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 4.08 కోట్లుగా ఉందని చెప్పారు. తుది జాబితా ప్రచురణకు ముందు 2 నెలల పాటు ప్రధానంగా 18–19 ఏళ్ల వయసున్న వారు ఓటరుగా నమోదు చేయించుకునేందుకు ప్రత్యేకంగా కృషి చేయడంతో 5.3 లక్షల ఓటర్లు అదనంగా నమోదయ్యారని చెప్పారు. యువ ఓటర్ల నమోదు కార్యక్రమం ఎన్నికల ముందు వరకు నిరంతరం కొనసాగుతుందని, యువ ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఓటర్లుగా నమోదైన యువతకు ఎపిక్ కార్డులను గవర్నర్ అందజేశారు. ఎన్నికల జాబితా నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలలక్ష్మి, ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావులకు పురస్కారాలను అందజేశారు.
ఈఆర్వోలైన నెల్లూరు మునిసిపల్ కమిషనర్ వికాస్ మర్మత్, సింహాచలం దేవస్థానం ఎస్డీసీ రామలలక్ష్మి, భీమునిపట్నం ఆర్డీవో భాస్కర్ రెడ్డి, ఏఈఆర్వోలైన కోడుమూరు మండలం తహశీల్దార్ జయన్న, మైదుకూరు తహశీల్దార్ అనురాధ, గిద్దలూరు తహశీల్దార్ సీతారామయ్య, మరో 23 మంది బీఎల్‌వోలను, సీఈవో కార్యాలయానికి చెందిన ఎస్‌వో శ్రీనివాసరావు, ఏఎస్‌వో సుధాకర్ తో పాటు మరో ఐదుగురు సిబ్బందిని గవర్నర్ సత్కరించారు.
దేశ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం కావాలి
గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో అందరం దేశ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం కావాలని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, అహింస, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు పాటుపడాలని గవర్నర్ ఆకాంక్షించినట్లు రాజ్‌భవన్‌వర్గాలు గురువారం తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment