సాక్షి, విజయవాడ: సమాజంలో ఓటు హక్కు ఒక బలమైన ఆయుధమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అర్హత ఉన్నవారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. 10వ జాతీయ ఓటర్ల దినోత్సం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యాక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. నూతనంగా ఓటు హక్కు పొందినవారికి ఆయన ఓటరు కార్డులు అందచేశారు. అలాగే 2019 సార్వత్నిక ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన 13 జిల్లాలకు చెందిన అధికారులకు అవార్డులు అందచేశారు. ‘రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అందరికీ సమాన హక్కుల గురించి తెలుపుతుంది. ఓటు హక్కు ఉన్నా వినియోగించుకోకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోల్పోతారు. మీరు ఓటు వేసి మీ స్నేహితులకు కూడా అవగాహన కల్పించి ఓటు వేయించండి’ అని గవర్నర్ పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ... ‘కొన్ని సంవత్సరాల క్రితం సామాన్య మనిషికి తన హక్కులు పొందే వ్యవస్థ లేదు. ప్రజా పోరాటాల ఫలితంగా హక్కులు వచ్చాయి. వందేళ్ల పెనుమార్పుల ఫలితంగా ఈ వ్యవస్థ ఏర్పడింది. 28 దేశాలలో ఓటు వేయడం హక్కుగానే కాక ఓటు వేయకుంటే పెనాల్టీ వేసే విధానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. మన ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో అన్ని దేశాల కంటే మెరుగైనది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే నిబద్ధతతో ఉండాలి. పట్టణాలలో గ్రామీణ ప్రాంతాల కన్నా ఓటు హక్కును తక్కువ శాతం వినియోగించుకుంటున్నారు. ముందు తరాలకు మనం ఇచ్చే వారసత్వపు హక్కు ఓటు హక్కు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ డాక‍్టర్ రవిశంకర్, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment