మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో ఓటర్లను చైతన్యపరిచేందుకు 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం వజ్రోత్సవాలను పురస్కరించుకుని 2011 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ స్థాయిలో ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. 18 ఏళ్ల వయస్సు దాటిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడం, ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవడం తదితర అంశాలపై ఓటర్లను చైతన్యవంతం చేయడం ద్వారా భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టవంతం గావించడం ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 25న అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్‌స్థాయి అధికారులు ఓటర్ల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని సూచిం చారు. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారాలు, మార్పులు, చేర్పులు, నమోదు ఫారాలు, బిఎల్‌వోలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
ఓటరుగా గర్విస్తున్నాను - ఓటు వేయడానికి సిద్ధం అనే స్లోగన్స్‌తో బ్యాడ్జీలు తయారుచేసి ఈ కార్యక్రమంలో ఓటర్లకు పంపిణీ చేయాలని, కొత్త ఓటర్లకు ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. హైస్కూల్, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో యంగ్ ఓటర్స్ ఫెస్టివల్ నిర్వహిస్తారని, 18 వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నియోజకవర్గాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు జరుగుతాయని, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వారికి 21న జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తారని, జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం పొందిన వారికి 24న రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు పంపిస్తారని వివరించారు.
వక్తృత్వ పోటీలకు సంబంధించి సీనియర్లు, జూనియర్లకు నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబోయే నాయకునికి ఉండవలసిన లక్షణాలు అనే అంశంపై, జిల్లాస్థాయిలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు ఎలా నిర్వహించాలి, రాజకీయ పార్టీలు / నాయకులు/ ఎన్నికల యంత్రాంగం తీసుకోవలసిన చర్యలు అనే అంశంపై, రాష్ట్రస్థాయిలో న్యాయబద్ధమైన ఓటింగ్ - అసలైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడంలో ఓటరు బాధ్యత అనే అంశంపై పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. పోలింగ్ బూత్‌ల వారీ మొట్టమొదటిసారిగా ఓటరుగా నమోదైన వారిలో కనీసం 20 మందిని ఓటర్ల దినోత్సవం సందర్భంగా సత్కరిస్తారని తెలిపారు.
మానవహారాలు, ర్యాలీలు, 2కె, 3కె రన్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. నూరు శాతం ఓటర్లనమోదు సాధించిన గ్రామ సమాఖ్యలకు రోలింగ్ షీల్టులు ప్రదానం చేస్తారని తెలిపారు. 26వ తేదీ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో 2014 సాధారణ ఎన్నికలు అనే ప్రధాన అంశం గురించి ప్రగతి శకటాన్ని ప్రదర్శిస్తారని...
ఈ శకటం ముందుగా ఆయా నియోజకవర్గాలలో పర్యటించి ఓటర్లను చైతన్యపరుస్తుందని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను ఈ కార్యక్రమాలకు ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఓటర్లు, కళాశాల విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.
కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు
Published Sun, Jan 19 2014 5:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement