m.raghunandan rao
-
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు, జరిమానా
- ధిక్కార కేసులో హైకోర్టు సంచలన తీర్పు - ఏజీ అభ్యర్థన తో తీర్పు అమలు వాయిదా - సూరారం కాలనీలో అక్రమ నివాసితులను ఖాళీ చేయించనందుకు కోర్టు ఆగ్రహం - న్యాయస్థానం తీర్పుపై ప్రభుత్వం విస్మయం - ఏజీతో చర్చలు.. అప్పీలుకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కార కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావుకు హైకోర్టు నాలుగు వారాల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. దీనిపై అప్పీల్‌కు వీలుగా తీర్పు అమలును నిలుపుదల చేయాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) అభ్యర్థించారు. దీంతో తీర్పు అమలును న్యాయస్థానం నాలుగు వారాల పాటు నిలుపుదల చేసింది. న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి, చల్లా కోదండరాంతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 107లో బలహీన వర్గాల కోసం నిర్మించిన గృహ సముదాయాల్లో అనధికారికంగా నివసిస్తున్న 2,300 మందిని ఖాళీ చేయించాలంటూ 2007, జూలైలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే అధికారులకు తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించలేకపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తూ ఇళ్ల ఖాళీకి జారీ చేసిన తీర్పును పునఃసమీక్షించాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. అక్రమంగా నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. తర్వాత కోర్టు తీర్పు అమలు చేయడం లేదంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన కలెక్టర్ కోర్టు ఉత్తర్వుల అమలుకు గడువు కావాలని పలుమార్లు అభ్యర్థించారు. గడువు ఇచ్చినప్పటికీ నిర్ణీత సమయం లోపు అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించలేకపోయారు. ఇది కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమేనని భావించిన ధర్మాసనం తాజాగా కలెక్టర్‌కు నాలుగు వారాల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అప్పీలుకు నిర్ణయం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు శిక్ష విధిస్తూ హైకోర్డు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేసింది. డివిజన్ బెంచ్ తీర్పుపై స్పెషల్ బెంచ్‌లో అప్పీలు చేయాలని నిర్ణయించింది. తీర్పుపై తమకున్న అభ్యంతరాలతో ఈ అప్పీలు దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఏజీతోనూ చర్చలు జరిపింది. సూరారంలో ఇళ్ల కేటాయింపుల్లో అనర్హులున్నారని, వారిని తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లపై వచ్చేవారం హైకోర్టు స్పెషల్ బెంచ్‌లో విచారణ జరగనుంది. ఈ సమయంలో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురి చేసింది. ఇదీ వివాదం.. కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం కాలనీ డివిజన్లో దాదాపు 30 సంవత్సరాల క్రితం 235 ఎకరాల స్థలంలో 175 ఎకరాల 10 గుంటల స్థలాన్ని హౌజింగ్ బోర్డు అధికారులు బలహీన వర్గాలకు కేటాయించారు. 45 ఎకరాల్లో 60 గజాల చొప్పున 3,307 పట్టాలను పంపిణీ చేశారు. 1990-91లో 2,355 మందికి ఇళ్లను నిర్మించి ఇచ్చారు. కాగా, లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారంటూ 1995లో అప్పటి ఆర్డీవోకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై విచారణ చేపట్టిన ఆర్డీవో 1,613 అర్హులు కాగా.. 1,694 అనర్హులు ఉన్నారని తేల్చి ఆ పట్టాలను రద్దు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఫిర్యాదులు రాగా అధికారులు 1,613లో 587 మందే అర్హులని మిగిలిన 1026 అనర్హులని తేల్చారు. దీంతో వారంతా పలు దఫాలుగా కోర్టును ఆశ్రయించారు. దీనిపై 2002లో కోర్టు ఓ విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ కేవలం 132 మంది మాత్రమే అర్హులంటూ విచారణ బృందం కోర్టుకు నివేదిక సమర్పించింది. ఇదిలా ఉండగానే కొందరు లబ్ధిదారులు తమ ఇళ్లను ఇతరులు ఆక్రమించుకున్నారని 2006లో కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు 2,320 మందికి నోటీసులు జారీ చేసింది. అప్పట్నుంచి హైకోర్టులో కేసు నడుస్తుంది. మొత్తం 2,055 మంది అనర్హులేననిని, వారిని 2015 ఆగస్టు 21 లోపు ఇళ్ల నుంచి ఖాళీ చేయించాలని ఇటీవల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అధికారులు 190 ఇళ్లను మాత్రమే ఖాళీ చేయించారు. -
ప్రజలకు న్యాయం చేయండి
కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు చిలకలపూడి (మచిలీపట్నం) :ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారానికి అధికారులు చొరవ చూపి ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ మురళీ, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ప్రభావతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ సీహెచ్.ప్రతాపరావు, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం, డీఎంఅండ్ హెచ్‌వో జె.సరసజాక్షి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్వీవీ .సత్యనారాయణ, డీఈవో దేవానందరెడ్డి, డీఆర్డీఏ ఏపీడీ జ్యోతి పాల్గొన్నారు. అర్జీలు ఇవే : కంకిపాడు గ్రామంలోని దొడ్డివారి వీధిలో వాహనాలను రోడ్డుపై నిలపకుండా చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతానికి చెందిన ఎం. రామచంద్రరావు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. చల్లపల్లి పంచాయతీ పరిధిలోని పార్వతమ్మతోట, నిమ్మలతోట ప్రాంతాలకు మంచినీరు సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కోడూరు మండలం నరసింహపురం గ్రామంలోని సర్వే నెంబరు 131/1, 2, 137/1, 6, 7లో ఉన్న 7.40 ఎకరాల భూమిలో చేపల చెరువులు అనుమతులు లేకుండా విచ్చలవిడిగా తవ్వుతున్నారని, తవ్వకాలను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని అర్జా సాంబశివరావు అర్జీ ఇచ్చారు. రెవెన్యూ విభాగం ద్వారా గత ఎన్నికల్లో ఫ్లయింగ్ స్క్వాడ్, చెక్‌పోస్టుల్లో 65 రోజుల పాటు వీడియో చిత్రీకరణ కోసం వీడియోగ్రాఫర్లకు రోజుకు రూ. 1800 చొప్పున చెల్లిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు రూ. 1100 మాత్రమే చెల్లిస్తున్నారని మచిలీపట్నం వీడియోగ్రాఫర్లు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. అయితే తమ రికార్డుల్లో మాత్రం రూ. 1800 చొప్పున ఇస్తున్నట్లు నమోదు చేసుకుంటున్నారని వీడియోగ్రాఫర్లకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో కోరారు. విజయవాడ రూరల్, పెనమలూరు మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు నిబంధనలకు విరుద్ధంగా భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని, వాటిని నియత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి పంచాయతీ శివారు అయోధ్య గ్రామంలో పీడబ్ల్యూడీ కరకట్టకు చెందిన 1.50 ఎకరాల శ్మశానభూమిని ఆక్రమించుకున్న వారి నుంచి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని జి.మల్లిఖార్జునరావు, డి.వెంకటేశ్వరరావు తదితరులు వినతిపత్రమిచ్చారు. బంటుమిల్లి మండలం అర్తమూరు గ్రామశివారు సాయినగర్‌లో ఎంతోకాలంగా 60 మంది ఎస్టీ కులాలకు చెందిన వారు నివాసం ఉంటున్న రహదారి ఆక్రమణకు గురైందని, రహదారిని స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు అర్జీ ఇచ్చారు. -
కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో ఓటర్లను చైతన్యపరిచేందుకు 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం వజ్రోత్సవాలను పురస్కరించుకుని 2011 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ స్థాయిలో ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. 18 ఏళ్ల వయస్సు దాటిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడం, ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవడం తదితర అంశాలపై ఓటర్లను చైతన్యవంతం చేయడం ద్వారా భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టవంతం గావించడం ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 25న అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్‌స్థాయి అధికారులు ఓటర్ల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని సూచిం చారు. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారాలు, మార్పులు, చేర్పులు, నమోదు ఫారాలు, బిఎల్వోలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ఓటరుగా గర్విస్తున్నాను - ఓటు వేయడానికి సిద్ధం అనే స్లోగన్స్‌తో బ్యాడ్జీలు తయారుచేసి ఈ కార్యక్రమంలో ఓటర్లకు పంపిణీ చేయాలని, కొత్త ఓటర్లకు ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. హైస్కూల్, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో యంగ్ ఓటర్స్ ఫెస్టివల్ నిర్వహిస్తారని, 18 వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నియోజకవర్గాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు జరుగుతాయని, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వారికి 21న జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తారని, జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం పొందిన వారికి 24న రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు పంపిస్తారని వివరించారు. వక్తృత్వ పోటీలకు సంబంధించి సీనియర్లు, జూనియర్లకు నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబోయే నాయకునికి ఉండవలసిన లక్షణాలు అనే అంశంపై, జిల్లాస్థాయిలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు ఎలా నిర్వహించాలి, రాజకీయ పార్టీలు / నాయకులు/ ఎన్నికల యంత్రాంగం తీసుకోవలసిన చర్యలు అనే అంశంపై, రాష్ట్రస్థాయిలో న్యాయబద్ధమైన ఓటింగ్ - అసలైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడంలో ఓటరు బాధ్యత అనే అంశంపై పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. పోలింగ్ బూత్‌ల వారీ మొట్టమొదటిసారిగా ఓటరుగా నమోదైన వారిలో కనీసం 20 మందిని ఓటర్ల దినోత్సవం సందర్భంగా సత్కరిస్తారని తెలిపారు. మానవహారాలు, ర్యాలీలు, 2కె, 3కె రన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. నూరు శాతం ఓటర్లనమోదు సాధించిన గ్రామ సమాఖ్యలకు రోలింగ్ షీల్టులు ప్రదానం చేస్తారని తెలిపారు. 26వ తేదీ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో 2014 సాధారణ ఎన్నికలు అనే ప్రధాన అంశం గురించి ప్రగతి శకటాన్ని ప్రదర్శిస్తారని... ఈ శకటం ముందుగా ఆయా నియోజకవర్గాలలో పర్యటించి ఓటర్లను చైతన్యపరుస్తుందని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను ఈ కార్యక్రమాలకు ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఓటర్లు, కళాశాల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.