రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు, జరిమానా | high court imposes imprisonment and fine to ranga reddy district collector raghunandan rao | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు, జరిమానా

Published Thu, Dec 3 2015 4:02 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు, జరిమానా - Sakshi

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు, జరిమానా

- ధిక్కార కేసులో హైకోర్టు సంచలన తీర్పు

- ఏజీ అభ్యర్థన తో తీర్పు అమలు వాయిదా

- సూరారం కాలనీలో అక్రమ నివాసితులను ఖాళీ చేయించనందుకు కోర్టు ఆగ్రహం

- న్యాయస్థానం తీర్పుపై ప్రభుత్వం విస్మయం

- ఏజీతో చర్చలు.. అప్పీలుకు నిర్ణయం

 

సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కార కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావుకు హైకోర్టు నాలుగు వారాల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. దీనిపై అప్పీల్‌కు వీలుగా తీర్పు అమలును నిలుపుదల చేయాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) అభ్యర్థించారు. దీంతో తీర్పు అమలును న్యాయస్థానం నాలుగు వారాల పాటు నిలుపుదల చేసింది. న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి, చల్లా కోదండరాంతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది.

 

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 107లో బలహీన వర్గాల కోసం నిర్మించిన గృహ సముదాయాల్లో అనధికారికంగా నివసిస్తున్న 2,300 మందిని ఖాళీ చేయించాలంటూ 2007, జూలైలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే అధికారులకు తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించలేకపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తూ ఇళ్ల ఖాళీకి జారీ చేసిన తీర్పును పునఃసమీక్షించాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.

 

అయితే కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. అక్రమంగా నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. తర్వాత కోర్టు తీర్పు అమలు చేయడం లేదంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన కలెక్టర్ కోర్టు ఉత్తర్వుల అమలుకు గడువు కావాలని పలుమార్లు అభ్యర్థించారు. గడువు ఇచ్చినప్పటికీ నిర్ణీత సమయం లోపు అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించలేకపోయారు. ఇది కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమేనని భావించిన ధర్మాసనం తాజాగా కలెక్టర్‌కు నాలుగు వారాల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

 

అప్పీలుకు నిర్ణయం

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు శిక్ష విధిస్తూ హైకోర్డు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేసింది. డివిజన్ బెంచ్ తీర్పుపై స్పెషల్ బెంచ్‌లో అప్పీలు చేయాలని నిర్ణయించింది. తీర్పుపై తమకున్న అభ్యంతరాలతో ఈ అప్పీలు దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఏజీతోనూ చర్చలు జరిపింది. సూరారంలో ఇళ్ల కేటాయింపుల్లో అనర్హులున్నారని, వారిని తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లపై వచ్చేవారం హైకోర్టు స్పెషల్ బెంచ్‌లో విచారణ జరగనుంది. ఈ సమయంలో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురి చేసింది.

 

ఇదీ వివాదం..

కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం కాలనీ డివిజన్‌లో దాదాపు 30 సంవత్సరాల క్రితం 235 ఎకరాల స్థలంలో 175 ఎకరాల 10 గుంటల స్థలాన్ని హౌజింగ్ బోర్డు అధికారులు బలహీన వర్గాలకు కేటాయించారు. 45 ఎకరాల్లో 60 గజాల చొప్పున 3,307 పట్టాలను పంపిణీ చేశారు. 1990-91లో 2,355 మందికి ఇళ్లను నిర్మించి ఇచ్చారు. కాగా, లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారంటూ 1995లో అప్పటి ఆర్డీవోకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై విచారణ చేపట్టిన ఆర్డీవో 1,613 అర్హులు కాగా.. 1,694 అనర్హులు ఉన్నారని తేల్చి ఆ పట్టాలను రద్దు చేశారు.

 

ఆ తర్వాత మళ్లీ ఫిర్యాదులు రాగా అధికారులు 1,613లో 587 మందే అర్హులని మిగిలిన 1026 అనర్హులని తేల్చారు. దీంతో వారంతా పలు దఫాలుగా కోర్టును ఆశ్రయించారు. దీనిపై 2002లో కోర్టు ఓ విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ కేవలం 132 మంది మాత్రమే అర్హులంటూ విచారణ బృందం కోర్టుకు నివేదిక సమర్పించింది. ఇదిలా ఉండగానే కొందరు లబ్ధిదారులు తమ ఇళ్లను ఇతరులు ఆక్రమించుకున్నారని 2006లో కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు 2,320 మందికి నోటీసులు జారీ చేసింది. అప్పట్నుంచి హైకోర్టులో కేసు నడుస్తుంది. మొత్తం 2,055 మంది అనర్హులేననిని, వారిని 2015 ఆగస్టు 21 లోపు ఇళ్ల నుంచి ఖాళీ చేయించాలని ఇటీవల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అధికారులు 190 ఇళ్లను మాత్రమే ఖాళీ చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement