ప్రజలకు న్యాయం చేయండి
- కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు
చిలకలపూడి (మచిలీపట్నం) :ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారానికి అధికారులు చొరవ చూపి ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ మురళీ, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ప్రభావతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ సీహెచ్.ప్రతాపరావు, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం, డీఎంఅండ్ హెచ్‌వో జె.సరసజాక్షి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్‌వీవీ .సత్యనారాయణ, డీఈవో దేవానందరెడ్డి, డీఆర్డీఏ ఏపీడీ జ్యోతి పాల్గొన్నారు.
అర్జీలు ఇవే :
కంకిపాడు గ్రామంలోని దొడ్డివారి వీధిలో వాహనాలను రోడ్డుపై నిలపకుండా చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతానికి చెందిన ఎం. రామచంద్రరావు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు.
చల్లపల్లి పంచాయతీ పరిధిలోని పార్వతమ్మతోట, నిమ్మలతోట ప్రాంతాలకు మంచినీరు సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
కోడూరు మండలం నరసింహపురం గ్రామంలోని సర్వే నెంబరు 131/1, 2, 137/1, 6, 7లో ఉన్న 7.40 ఎకరాల భూమిలో చేపల చెరువులు అనుమతులు లేకుండా విచ్చలవిడిగా తవ్వుతున్నారని, తవ్వకాలను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని అర్జా సాంబశివరావు అర్జీ ఇచ్చారు.
రెవెన్యూ విభాగం ద్వారా గత ఎన్నికల్లో ఫ్లయింగ్ స్క్వాడ్, చెక్‌పోస్టుల్లో 65 రోజుల పాటు వీడియో చిత్రీకరణ కోసం వీడియోగ్రాఫర్లకు రోజుకు రూ. 1800 చొప్పున చెల్లిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు రూ. 1100 మాత్రమే చెల్లిస్తున్నారని మచిలీపట్నం వీడియోగ్రాఫర్లు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. అయితే తమ రికార్డుల్లో మాత్రం రూ. 1800 చొప్పున ఇస్తున్నట్లు నమోదు చేసుకుంటున్నారని వీడియోగ్రాఫర్లకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో కోరారు.
విజయవాడ రూరల్, పెనమలూరు మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు నిబంధనలకు విరుద్ధంగా భవనాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని, వాటిని నియత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు.
మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి పంచాయతీ శివారు అయోధ్య గ్రామంలో పీడబ్ల్యూడీ కరకట్టకు చెందిన 1.50 ఎకరాల శ్మశానభూమిని ఆక్రమించుకున్న వారి నుంచి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని జి.మల్లిఖార్జునరావు, డి.వెంకటేశ్వరరావు తదితరులు వినతిపత్రమిచ్చారు.
బంటుమిల్లి మండలం అర్తమూరు గ్రామశివారు సాయినగర్‌లో ఎంతోకాలంగా 60 మంది ఎస్టీ కులాలకు చెందిన వారు నివాసం ఉంటున్న రహదారి ఆక్రమణకు గురైందని, రహదారిని స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు అర్జీ ఇచ్చారు.