- కలెక్టరేట్ ముట్టడికి యత్నం
- అడ్డుకున్న పోలీసులు
- తోపులాటలో గాయపడిన ఆశావర్కర్
చిలకలపూడి (మచిలీపట్నం) : సమస్యల పరిష్కారం కోసం ఆశావర్కర్లు తమ గళాన్ని వినిపించారు. జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో తమ నిరసన తెలిపేందుకు ఆశావర్కర్లు సోమవారం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ధర్నాకు ఆశావర్కర్లు భారీగా తరలి రావడంతో పోలీసులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద భారీ బందోబస్తు, రోప్ పార్టీని ఏర్పాటు చేశారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ ముట్టడికి ఆశావర్కర్లు యత్నించారు.
కలెక్టరేట్ గేటు ఎక్కి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. తోపులాట జరిగింది. అరగంట పాటు పోలీసులకు, ఆశావర్కర్లకు మధ్య తోపులాట జరగటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోనికి ఆశావర్కర్లు అందర్నీ అనుమతించాలని పోలీసు అధికారులను కోరగా కేవలం పది మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. దీంతో ఆశావర్కర్లను, ముఖ్యమైన నాయకులను మాత్రమే ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించేందుకు అనుమతించారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీవీ కృష్ణ, ఏపీ వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. కమల మాట్లాడుతూ ఆశావర్కర్లకు కేంద్రం చెల్లిస్తున్న పారితోషికాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వేతనం నిర్ణయించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అమలయ్యే పారితోషికాలను పట్టణాలకూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఆశావర్లకు ఏఎన్‌ఎం శిక్షణ ఇచ్చి రెండో ఏఎన్‌ఎంలుగా తీసుకోవాలని వారు కోరారు.
తోపులాటలో ఆశావర్కర్‌కు గాయం ...
ఆశావర్కర్ల ధర్నా అనంతరం పోలీసులకు, ఆశావర్కర్లకు మధ్య జరిగిన తోపులాటలో బందరు సర్కారుతోటకు చెందిన పరసా రాణి కిందపడిపోయారు. ఈ సమయంలో ఆమె చేతిని పలువురు తొక్కటంతో కుడిచేతికి తీవ్రగాయమైంది. ఆశావర్కర్ల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం వల్లే ఆమె కిందపడిపోయిందని, దీంతో తోపులాటలో ఆమె చేతిని తొక్కారని ప్రజావాణి కార్యక్రమంలో ఏజేసీ చెన్నకేశవరావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం పరసా రాణిని వైద్యచికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీఐటీయు నాయకులు వీవీ రమణ, బూర సుబ్రమణ్యం, ఆశావర్కర్ల సంఘం నాయకులు వై.నాగలక్ష్మి, పి.ధనశ్రీ, జి.వెంకటలక్ష్మి, జి.చిట్టికుమారి, టి.నాంచారమ్మ, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆశావర్కర్లు పాల్గొన్నారు.