ఓటుతో దేశ స్థితిగతుల్లో మార్పు: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: ఓటు వేయడం ద్వారా దేశ స్థితిగతుల్లో మార్పుతేవచ్చని గవర్నర్ నరసింహన్ అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఆదివారం జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుల ప్రాథమిక హక్కుగా పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదన్నారు. ఇంట్లో కూర్చొని విమర్శలు చేయడం కంటే ఓటు హక్కు వినియోగించుకొని సమర్థులను పాలకులుగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. కులం, మతం, జాతి, వర్గం, భాష తేడాలు లేకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీ జీపీ అనురాగ్‌శర్మ, అదనపు ముఖ్య ఎన్నికల అధికారి అనూప్‌సింగ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, అదనపు కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 2014 సాధారణ ఎన్నికల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు గవర్నర్ అవార్డులు అందజేశారు. అవార్డులు అందుకున్నవారిలో డీజీపీ అనురాగ్‌శర్మ, ఎ.బాబు (ఆదిలాబాద్), డీఎస్ లోకేశ్‌కుమార్ (అనంతపురం), జి.కిషన్ (వరంగల్), కాంతిలాల్ దండే (విజయనగరం), జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ (ప్రకాశం), బి.శ్రీనివాస్ (పోలీసు కమిషనర్-విజయవాడ), డి.నాగేంద్రకుమార్ (మహబూబ్‌నగర్), నవదీప్‌సింగ్(నెల్లూరు), వీఎస్‌కే కౌముది (అదనపు డీఐజీ-ఎల్‌ఆర్), హరీశ్‌గుప్తా (ఐజీ), ఎం.రమేశ్ (ఏఐజీ) తదితరులున్నారు.