ఈ చిత్రంలో కనిపిస్తున్న లేఅవుట్ గ్రేటర్ వరంగల్ పెంబర్తి శివారులో దత్తాత్రేయ డెవలపర్స్ సంస్థ వేసింది. 406, 407, 408, 408/బి, 409లతో పాటు సుమారు 26 సర్వేనంబర్లలో 51 ఎకరాల్లో 363 ప్లాట్లు ‘కుడా’అనుమతితో లే అవుట్ చేసి విక్రయించారు. గుడి, బడి, పార్కులు, కమ్యూనిటీ హాల్ తదితర సామాజిక అవసరాల కోసం ఐదెకరాలు (10 శాతం) మార్టిగేజ్ చేశారు. ఎక్కడికక్కడ ప్లాట్లు అమ్ముడు పోయాక.. ఆ ఐదెకరాలను సైతం ప్లాట్లు చేసి అధికారుల సహకారంతో కొనుగోలు చేసిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడిక్కడ ఎకరానికి మూడు నుంచి నాలుగున్నర కోట్లపైనే ఉంది.
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో పార్కులు, ఇతర సామాజిక అవసరాలకు ఉపయోగపడాల్సిన స్థలాలు అక్రమార్కుల పరమవుతున్నాయి. కార్పొరేషన్లు, మున్సి పాలిటీల పరిధిలో ఆయా సంస్థల తనఖాలో ఉండాల్సిన ఖాళీ స్థలాలు కన్పించకుండా పోతున్నాయి. నిబంధనల ప్రకా రం.. లేఅవుట్ ప్లాట్ల విక్రయాల సమయం లో సామాజిక అవసరాలకు కేటాయిస్తున్న 10 శాతం భూములను.. ఆ తర్వాత కొన్నాళ్లకు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్మేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ భూములు కబ్జాకు గురవుతున్నాయి. వాస్తవంగా ఈ స్థలాలను కొనడానికి గానీ, అమ్మడానికి గానీ వీల్లేదు. రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా నిబంధనలు ఒప్పుకోవు. కానీ మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు మార్టిగేజ్ (తనఖా పెట్టిన) చేసిన ఈ స్థలాలను అధికారులతో కుమ్మక్కైన అక్రమార్కులు అమ్మేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. మరోవైపు మంచి లేఅవుట్ వెంచర్‌లో ప్లాటు కొనుక్కున్నామన్న సంబరం తీరకముందే పార్కు, బడి, గుడి, కమ్యూనిటీ హాలు వంటి సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు కనుమరుగవుతుండటంతో కొనుగోలుదా రులు లబోదిబో మంటున్నారు. ఈ అక్రమ దందా వెనుక కొందరు కీలక అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల పాత్రపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనఖా స్థలాలను పరిరక్షించాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా ఇదే వరుస
రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో ఈ అక్రమ దందా కొనసాగుతోంది. ప్రస్తుత వనపర్తి జిల్లాలోని పాత లేఅవుట్‌లలో పది శాతం చొప్పున ఉండాల్సిన స్థలాలు.. కమీషన్లకు కక్కుర్తిపడి అధికారులు పట్టించుకోకపోవడంతో కబ్జాదారుల పరమయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో వెంచర్‌లో పది శాతం భూమిని లేఅవుట్‌గా చేసి మున్సిపాలిటీకి ఇవ్వాల్సి ఉండగా.. అది మొక్కుబడిగా సాగుతోంది. నల్లగొండలోని ప్రియదర్శిని కాలనీలో 25 ఏళ్ల క్రితమే మునిసిపాలిటీ అనుమతి తీసుకుని లేఅవుట్ చేశారు. ఇందులో పార్కు కోసం ఉద్దేవించిన స్థలాన్ని 17 సంవత్సరాల క్రితమే కొందరు స్థానికులు ఆక్రమించి ఇళ్లు కట్టేసుకున్నారు. దాదాపు 30 గుంటల స్థలం ఆక్రమణకు గురైనా అప్పటి మునిసిపాలిటీ అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థలం విలువ రూ.3 కోట్ల వరకు ఉంటుంది. సూర్యాపేట మున్సిపాలిటీలో 2000 సంవత్సరంలో నర్సింహారెడ్డి అనే వ్యక్తి ఆంజనపురి కాలనీ, హనుమానగర్‌లో రెండు వెంచర్లు చేశారు. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీకి స్థలం కేటాయించగా హనుమానగర్ స్థలంలో అమృత్ పార్క్, టీ పార్క్ ఏర్పాటు చేశారు. కానీ ఆంజనపురి కాలనీలోని స్థలం మొత్తం అన్యాక్రాంతం అయ్యింది. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఖమ్మం తదితర జిల్లాల్లో కూడా ఈ విధంగా కోట్లాది రూపాయల విలువైన ‘10 శాతం’స్థలాలు అన్యాక్రాంతమైనా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
‘కుడా’లో 249 అక్రమ వెంచర్లు
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) పరిధిలో 449 వెంచర్లకు అనుమతులు ఇచ్చిన అధికారులు, 249 అక్రమ వెంచర్లను గుర్తించారు. కాగితాలపైన గీతలు గీసి (అక్రమ లే అవుట్), ప్లాట్లు చేసి విక్రయించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రూ.కోట్లు దండుకున్నారు. రెండు ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు సుమారు 1,780 ఎకరాల్లో ఈ 249 వెంచర్లు ఉన్నాయి. అక్రమ వెంచర్లు కావడంతో వ్యాపారులు సెంటు భూమిని కూడా తనఖా పెట్టలేదు. ఫలితంగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) ద్వారా రెగ్యులరైజ్ చేసుకునేందుకు రూ.లక్షలు అదనంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
అక్రమ లేఅవుట్‌లు అదనం
రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా చేసిన లేఅవుట్లు వీటికి అదనం. తెలంగాణ రాష్ట్రంలో 2019 నవంబర్ నాటికి పట్టణ స్థానిక సంస్థలు మొత్తం 142 ఉన్నాయి. అందులో 13 నగరపాలక సంస్థలు, 128 పురపాలక సంఘాలు కాగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మరొకటి. వీటి పరిధిలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2020 అక్టోబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ ప్రభుత్వం గతంలో ఎల్‌ఆర్‌ఎస్ ప్రకటించింది. 2020 ఆగస్టు 26 లోపు చేసిన లేఅవుట్ ఓనర్లకు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ ఓనర్‌కు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌కు దాదాపు 25.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.13 కార్పొరేషన్ల పరిధిలో 4,16,155, మున్సిపాలిటీల్లో 10,60,013, గ్రామ పంచాయతీల్లో మరో 10,83,394 దరఖాస్తులందడం లేఅవుట్ల తీరును స్పష్టం చేస్తోంది.
స్థలాల పరిరక్షణకు ప్రహరీలు
వరంగల్ మహానగరంలో దాదాపు అన్ని లే అవుట్, పార్కు స్థలాల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. లేఅవుట్‌ల ద్వారా సంక్రమించిన స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా ›ప్రహరీలు నిర్మించడం వంటి చర్యలు తీసుకుంటున్నాం. ‘కుడా’అప్పగించిన మేరకు బల్దియా స్వాధీనంలో ఉన్నాయి. ఏమైనా కబ్జాలు ఉంటే ల్యాండ్ సర్వే ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటాం.
– వెంకన్న, సిటీ ప్లానర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్
ఆక్రమణ యత్నాలు అడ్డుకున్న అధికారులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలో సర్వే నంబర్లు 300 నుంచి 303, 306, 311, 313 నుంచి 315 వరకు ఉన్న దాదాపు 14 ఎకరాల్లో 1990లో అరుణోదయ హౌసింగ్ సొసైటీ పేరుతో హెచ్‌ఎండీఏ అనుమతితో (ఫైల్ నంబర్ 3030/ఎంపీ2/హెచ్‌ఎండీఏ/91) లే అవుట్ చేశారు. ఏజీ ఆఫీసు ఉద్యోగులు అప్పట్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. దీనికి అనుబంధంగా మరిన్ని లే అవుట్లు వచ్చి సమతానగర్, సాయిరాంనగర్ కాలనీలుగా (నార్సింగి హైట్స్) కొనసాగుతున్నాయి. హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం అప్పట్లో నాలుగు చోట్ల పార్కుల కోసం, మరోచోట సెప్టిక్ ట్యాంక్ కోసం 6,070 గజాల స్థలాన్ని వదిలి నార్సింగి గ్రామ పంచాయితీకి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇటీవల ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించగా అధికారులు అడ్డుకుని ఆక్రమణలను తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment