పెద్దల గుప్పెట్లో సొసైటీ స్థలాలు
ఆక్రమార్కునికి అండ
{పతిగా రూ.2 కోట్ల స్థలాల ఫలహారం
అధికార పార్టీ కీలక నేత బంధువు యవ్వారం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సొసైటీ అక్రమాల బాగోతం
విశాఖపట్నం: కేంద్ర ప్రభు త్వ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ భూము ల్లో అధికార పార్టీ పెద్దలు పాగా వేస్తున్నారు. సొసైటీలో బయటపడిన అక్రమాలను అవకాశంగా తీసుకుని విలువైన స్థలాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే కార్యదర్శి డబ్బీరు గౌరీ శంకర్‌రావు భూ ఆక్రమణల కేసులో అరెస్టయినా ఆక్రమణలకు అడ్డుకట్ట పడలేదు. జీవీ ఎంసీ పరిధిలోని ఓ కీలక నేత సమీప బంధువు ఈవ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని మధురవాడలోని సొసైటీ స్థలాలను కబ్జా చేసేస్తున్నారు. దాదాపు రూ.5 కోట్ల విలువైన దాదాపు ఎకరా విస్తీర్ణంలోని సొసైటీకి చెందిన పలు స్థలాలను వ్యూ హాత్మకంగా ఆక్రమించుకుంటున్నారు.
నాడు... కుటుంబ సభ్యులపేరిట కబ్జా
సెంట్రల్ ఎక్సైజ్, సెంట్రల్ ఎంప్లాయీస్ హౌసింగ్ ఓనర్స్ వేల్ఫేర్ అసోషియేషన్‌కు మధురవాడలో ఉన్న స్థలాల్లో ఆక్రమణలకు అంతూపొంతూ లేకుండాపోతోంది. ఆ స్థలాలను కబ్జా చేసిన కేసులో కార్యదర్శి డబ్బీరు గౌరీ శంకర్‌రావును కొన్నిరోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. కానీ అతను కబ్జా చేసిన సొసైటీ స్థలాల గుట్టును పూర్తిగా ఛేదించకపోవడం గమనార్హం. అతని ఆక్రమణలో ఉన్నప్పటికీ విచారణ పరిధిలోకి రాని స్థలాలు ఎన్నో ఉన్నాయి. సొసైటీ స్థలాలను డబ్బీరు గౌరీశంకర్‌రావు తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది. సర్వే నంబర్లు 359లో నాలుగు ప్లాట్లు, 360లో రెండు ప్లాట్లను తన కుటుంబ సభ్యుల పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ సమీపంలోనే గెడ్డ పోరంబోకు స్థలాన్ని కూడా ఆక్రమించేసి కలిపేసుకున్నారు. అందులో నిర్మాణాలు కూడా ప్రారంభించారు. అదే విధంగా ఇదే సొసైటీకి చెందిన సర్వే నెంబరు. 2, 2పి లలో ఉన్న అన్నంరాజు లే అవుట్, అయోధ్యనగర్, నగరంపాలెంలలో దాదాపు 6 స్థలాలను కొంతకాలం క్రితమే తమవారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఇలా ఆక్రమించి ఇంకా విచారణ పరిధిలోకి రాని స్థలాల మార్కెట్ విలువ దాదాపు రూ.2 కోట్లు వరకు ఉంటుంది.
నేడు కీలక నేత బంధువు గుప్పెట్లో..?
డబ్బీరు గౌరీ శంకర్‌రావు అక్రమాలను అధికార పార్టీ నేత తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. జీవీఎంసీ పరిధిలోని కీలక అధికార పార్టీ నేతకు ఆయన సమీప బంధువు కూడా కావడం గమనార్హం. విచారణ పరిధిలోకి రాని ఆక్రమాలను కప్పిపుచ్చుతామని చెబుతూ ఆ స్థలాలను ఆక్రమించేందుకు వ్యూహం పన్నారు. అందుకు ఓ ఉన్నతాధికారి కూడా సహకరిస్తున్నారు. తద్వారా డబ్బీరు గౌరీ శంకర్‌రావుకు కేసు విచారణ విషయంలో సహకరించేందుకు... ప్రతిగా దాదాపు రూ.2 కోట్ల విలువైన స్థలాలను తనపరం చేసుకోవాలన్నది ఆ కీలక నేత పన్నాగం. దాంతో ఈ కేసులో లోతుగా విచారించకుండా తూతూమంత్రంగా ముగించే దిశగా పావుల కదుపుతున్నారు. అధికార పార్టీ నేతలు తలచుకుంటే కానిదేముంటుంది.