నిధులున్నా మెట్టవేదాంతమే!
- ఆర్‌ఏడీపీ పథకానికి గ్రహణం
- వర్షాధార ప్రాంత అభివృద్ధి మిధ్యే
- గ్రామాల ఎంపికే అవరోధం
మెట్టభూముల్ని సాగు భూములుగా మార్చడం, ఆ ప్రాంతంలోని రైతులకు వ్యవసాయ సాగుకు అవసరమైన వనరుల్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకు క్షేత్రస్థాయిలో కష్టాలు తప్పడం లేదు. నిధులు చాలక వ్యవసాయ అనుబంధ పథకాలు విలవిల్లాడుతుంటే ఇక్కడ పరిస్థితి మాత్రం భిన్నం. నిధులు మూలుగుతున్నా...వెచ్చించడానికి అర్హత ఉన్న గ్రామాల అన్వేషణే సంబంధిత అధికారులకు భారంగా మారింది. వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం(ఆర్‌ఏడీపీ) దుస్థితి ఇది.
అనకాపల్లి: ప్రతి ఏటా మెట్ట భూముల్ని దశల వారీగా సాగులోకి తీసుకొచ్చేందుకు వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకాన్ని రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో 2011-12లో పైలట్ ప్రాజెక్టు క్రింద అమలు చేశారు. ఆ జిల్లాల్లో విశాఖ జిల్లా కూడా ఉంది. తదనంతరం 2013-14 ఆర్థిక సంవత్సరంలో విశాఖ జిల్లాలో ఈ పథక అమలుకు సుమా రు 60 లక్షల రూపాయల వరకూ నిధులు మంజూరయ్యాయి. గ్రామీణ జిల్లాలోని ఏజెన్సీయేతర ప్రాంతంలోని 23 మండలాల్లో ఈ పథకం అమలుకు అవకాశం ఉం ది.
ప్రతి యేటా ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారులకు నీటి బోర్లు, ఆయిల్ ఇంజిన్లు, సాగు నీటి సరఫరా పైపులు, పనిముట్లు, ఎరువులు, కాయగూరల విత్తనాలు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ సాగు ప్రోత్సాహకంగా అందజేస్తారు. ఆయా గ్రామాలను ఏడీఏ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ఎంపిక చేస్తుంది. లబ్దిదారులను భూసంరక్షణ పథకం ఏడీఏ, మండల పరిషత్ అధికారి అధ్యక్షతన జరిగే గ్రామసభలో ఎంపిక చేస్తారు.
600ఎకరాలు అదనంగా సాగులోకి...
ప్రతి యేటా సాగులోని మెట్టభూముల్ని సారవంతమైన సాగు భూములుగా మార్చేందుకు రైతులకు ప్రోత్సాహకాలు అందించడ మే ఈ పథకం అసలు ఉద్దేశ్యం. దీనిలో భాగంగా జిల్లాలోని 10 గ్రామాల్లో ఏడాదికి 600 ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకొచ్చేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. సుమారు 1200 మంది లబ్దిదారులకు ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ అనుబంధ వనరుల్ని సమకూరుస్తారు.
2013-14 ఆర్థిక సంవత్సరలో బుచ్చియ్యపేట మండలం నుంచి లోపూడి, ఎల్‌బి అగ్రహారం, కొండపాలెం, పెందుర్తి మండలం నుంచి సరిపల్లి, ముదపాక, గురన్నపాలెం, కశింకోట మండలం నుంచి తీగ, విసన్నపేట, నాతవరం మండలం నుంచి శృంగవరం, ఎంబీ పట్నం గ్రామాల్లో ఈ పథకం అమలయినప్పటికీ నిధులు పూర్తిగా వినియోగం కాలేదు. దీనికి ప్రధాన కారణం లబ్దిదారులు చెల్లించాల్సిన 50 శాతం నిధులను చెల్లించేందుకు ముందుకు రాకపోవడమే. ఈ కారణంగా లక్షలాది రూపాయల నిధులు వినియోగంలోకి రాక మూలన పడిఉన్నాయి.
ప్రహసనంగా మారిన గ్రామాల ఎంపిక...
2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం అమలు అర్హత ఉన్న గ్రామాల ఎంపిక ప్రహసనంగా మారింది. ముఖ్యంగా మెట్టభూములై, సంబంధిత వనరుల కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ చెల్లించేందుకు రైతులు ముందుకు రాకపోవడం, ఇక్కడ సమకూర్చే వనరులు మిగిలిన పథకాల్లో రైతులకు అందడం వంటి కారణాల వల్ల పథక అమలుకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో పశువుల కొనుగోలుకు రైతులకు సబ్సిడీ ఇచ్చినందున పలువురు రైతులు ముందుకు వచ్చేవారు. ఏదేమైనా మంచి లక్ష్యంతో అమలు చేస్తున్న వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం అర్హత ఉన్న గ్రామాల ఎంపిక సజావుగా జరగాలంటే దీనిపై మరింత విస్తృత ప్రచారం జరగాల్సి ఉందని పలువురు సూచిస్తున్నారు.