
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటుచేసేందుకు మొదట్లో ఉత్సాహం చూపిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు ఇప్పుడు అనాసక్తి ప్రదర్శిస్తున్నాయి. అమరావతి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన హడావుడి చూసి రాజధాని నిర్మాణం శరవేగంగా జరిగిపోతుందని భావించిన పలు కేంద్ర సంస్థలు అక్కడ తమకు భూములు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని సంస్థలకు లేఖలు రాసి అమరావతిలో కార్యాలయాలకు ఎంత స్థలం అవసరమో చెప్పాలని కోరింది. ఈ నేపథ్యంలో చాలా సంస్థలు ప్రతిపాదనలు పంపాయి. అయితే ప్రభుత్వం ఈ సంస్థల కంటే కార్పొరేట్, ప్రైవేటు సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అవసరం లేకపోయినా వారికి ఎక్కువ భూమిని తక్కువ ధరకు కేటాయించడంతో పాటు వాటికి అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించింది.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలకు భూముల కేటాయింపులో వివక్ష చూపుతూ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన దానికి రెట్టింపు ధర విధించింది. ఏప్రిల్ నెలాఖరు వరకూ 15 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులకు భూములు కేటాయించింది. ఎకరం రూ. కోటి నుంచి నాలుగు కోట్ల చొప్పున వాటికి ధర నిర్ణయించింది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ (సీపీడబ్లు్యడీ), ఆర్‌బీఐ, ఇండియన్ నేవీ, బీఐఎస్, పోస్టల్, కాగ్, ఐగ్నోలకు ఎకరం కోటి రూపాయల చొప్పున భూమి కేటాయించింది. ఎఫ్‌సీఐ, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డు, న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ, హెచ్‌పీసీఎల్, సిండికేట్ బ్యాంక్, ఐఓసీఎల్, రైట్స్ సంస్థలకు ఎకరం నాలుగు కోట్లకు కేటాయించింది. అదే సమయంలో విద్యా సంస్థల పేరుతో విట్, ఎస్‌ఆర్‌ఎం, బీఆర్ శెట్టి, అమృతా యూనివర్సిటీలకు వందల ఎకరాలను ఎకరం రూ.50 లక్షలకు కట్టబెట్టింది.
కేంద్ర సంస్థలకు కేటాయించిన సమయంలోనే వాటికి భూమి కేటాయించినా వెంటనే భూములు అప్పగించేసింది. కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భూమి చూపించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీనికితోడు ధర కూడా ఊహించని విధంగా నిర్ణయించడంతో కేంద్ర ప్రభుత్వం వాటిని ఇక్కడ ఏర్పాటు చేసే విషయంపై పునరాలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే భూమి కేటాయించినా ఇప్పటివరకూ ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా సీఆర్‌డీఏకు డబ్బు కట్టలేదు. కార్పొరేట్ సంస్థలకు నామమాత్రపు రేటుకు భూములు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వంలో భాగమైన తమకు అంతకు రెట్టింపు రేటు నిర్ణయించడంపై పలు సంస్థలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు కేటాయించిన భూమిని అప్పగించే విషయంలో నాన్చుడు ధోరణి అవలంబించడం, మొదట చెప్పిన ప్రాంతంలో కాకుండా వేరే చోట భూమిని ఇస్తామని చెబుతుండడంతో ఆ సంస్థలు అసలు ఇప్పుడు అమరావతికి రావడం అంత అవసరమా? అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment