గుంటూరు: ‘నన్ను చూసి రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చేశారు. నేనే బ్రాండ్, నాదే ఇమేజ్. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణం నా కల. ఆ కలలు పటాపంచలవుతున్నాయ’ని నిత్యం వాపోయే చంద్రబాబు, ఆయన ప్రభుత్వం గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో ఎన్నెన్ని అరాచకాలు చేసిందో, గ్రామీణుల మధ్య ఎంతెంత అగాధాలను సృష్టించిందో కళ్లారా చూసినా, చెవులారా విన్నా ‘రియల్’ వ్యవహారాలు బట్టబయలవుతాయి. ఒక్కో ఊరిది ఒక్కో కథ. ఒక్కో కుటుంబానిది ఒక్కో వ్యథ. బాబుకు ఆయన ‘రియల్’ బృందానికి కులం లేదు, మతం లేదు, గ్రామం లేదు. అప్పట్లో భూమి ఇచ్చారా? లేదా? అన్నదే ముఖ్యం. ఇచ్చేస్తే సరి. లేదంటే అంతే మరి.. అన్నట్లుగానే చర్యలు కొనసాగాయి.
ఇదిగో ఈ ఫోటోలోని వ్యక్తిని చూశారుగా. బండ్ల బసవయ్య. ఈయనది తుళ్లూరు మండలం అనంతవరం. భూగాధను, శారీరక వ్యథను ఆయన మాటల్లోనే విందాం. మా నాన్న బండ్ల ప్రకాశరావు. శివరామ కృష్ణయ్య నా సోదరుడు. వారసత్వంగా మా ఇద్దరికీ రెండు చోట్ల ఎకరం 20 సెంట్లు సంక్రమించింది. ఎత్తిపోతల పథకం కింద మెట్ట. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వాలంటూ భూసేకరణకు టీడీపీ సర్కారు ప్రకటన జారీ చేసింది. నాతో సహా మా గ్రామానికి చెందిన 46 మంది సుమారు 500 ఎకరాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. అప్పటి మంత్రులు పి.నారాయణ, పి.పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, టీడీపీకి చెందిన మండల, గ్రామ స్థాయి నాయకులు అధికారులు, పోలీసులను వెంటపెట్టుకుని నిత్యం రాజధాని గ్రామాల్లో తిరుగుతూ భూసమీకరణకు సామ, దాన, భేద దండోపాయాలన్నీ ప్రయోగించేవారు. చివరకు నా మిత్రులు నయాన, భయాన చెప్పడంతో మా భూమిని ఇవ్వడానికి అంగీకరించక తప్పలేదు.
కొలతల పేరిట అంతా మాయే...
అనంతవరంలోని సర్వే నంబరు 217లో బండ్ల, ఎడ్లూరి కుటుంబీకులకు 12.68 ఎకరాలు ఉంది. డాక్యుమెంట్ల ప్రకారం ఓ తండ్రి, కొడుకుకు కలిపి 2.03 ఎకరాలు ఉండగా సర్వేలో మతలబులు చేసి 2.20 ఎకరాలు ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. వారివురికి 17 సెంట్లు అదనంగా చేరింది. ఇదేవిధంగా మరొకరికి 17 సెంట్లు కలిపేశారు. మొత్తం మీద మా అన్నదమ్ములకు ఉన్న 1.20 ఎకరాలలో.. ప్రభుత్వం ఇచ్చిన అవార్డు నోటిఫికేషన్ ప్రకారం 25 సెంట్లు, కొలతల్లో 30 సెంట్లు, తుదిగా 34 సెంట్లు తగ్గిపోయినట్లు రికార్డుల పరంగా చూపారు.
రూ.కోటి 30 లక్షలు పోయినట్లే..
ఎత్తిపోతల పథకం కింద సాగుభూమి ఎకరం ధర రూ.15 లక్షలు. రాజధాని పేరిట చంద్రబాబు చెప్పిన ప్రకారం రూ.4 కోట్లు పలికింది. ఆ చొప్పున 34 సెంట్లు తగ్గినందుకుగాను రమారమి రూ.1.30 కోట్లను మేం కోల్పోయాం.
న్యాయస్థానాల్లో పోరాటం..
భూసమీకరణ ప్రకటనను నిలిపేయాలని 2016లో హైకోర్టుకు వెళ్లా. తప్పుడు కొలతలతో భూమిని తగ్గించేశారని, న్యాయం కోరుతూ 2018లో
మంగళగిరి కోర్టును ఆశ్రయించా. ఈ వ్యాజ్యం నడుస్తోంది.
కౌలూ ఇవ్వలేదు..
మా భూమిని తీసేసుకున్నారు. సరిహద్దులన్నీ చెరిపేశారు. కనీసం కౌలు కూడా ఇవ్వలేదు. గత ఎనిమిదేళ్లుగా లెక్కగడితే మా అన్నదమ్ములకు రూ.పది లక్షలకు పైగా కౌలు రావాల్సి ఉంది. మా భూమిని పొందిన వారు కొంత అమ్ముకున్నారు. కౌలూ పొందుతున్నారు. మేం మాత్రం
అన్యాయమైపోయాం.
61 సార్లు స్టేషన్‌కు తీసుకెళ్లి.. నరకం చూపి.. పళ్లు రాలగొట్టి..
పశ్చిమబెంగాల్‌తో సహా దేశంలో భూ వ్యవహారాలు ఏం జరిగాయో అవగాహన ఉన్నందున భూసమీకరణకు అంగీకరించలేదు. టీడీపీ నాయకులు, అధికారులు, మీడియా వద్ద మాట్లాడిన ప్రతిసారీ నన్ను పోలీసులు అదుపులోకి తీసుకునేవారు. అరెస్టు చేశామంటూ తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు 61 పర్యాయాలు తీసుకెళ్లారు. వ్యూహాత్మకంగా రికార్డులకు ఎక్కకూడదనే ఉద్దేశంతో కేసు నమోదుచేసేవారు కాదు. రేయింబవళ్లు స్టేషన్‌లో ఉంచేవారు. అన్నం, నీళ్లు కూడా ఉండేవి కావు. అప్పటి ఎస్‌ఐ (ఇప్పుడు సీఐ) కొట్టడంతో దవడ పళ్లు రాలిపోయాయి. స్టేషన్‌కు తీసుకెళ్లిన ప్రతిసారి భూసమీకరణను వ్యతిరేకించే వారు, గ్రామస్తులు, రైతు నాయకులు యాభై అరవై మందికిపైగా పోగై స్టేషన్ వద్దకు వచ్చేవారు. చివరకు పోలీసులకు నన్ను వదిలిపెట్టక తప్పేది కాదు అని బండ్ల బసవయ్య ‘సాక్షి’కి వివరించారు.
అమరావతిలో 5 సెంట్లు అమ్ముకుని...
అప్పటి ప్రభుత్వ దమనకాండను అడ్డుకోవడానికి అమరావతిలో విలువైన ఐదు సెంట్ల భూమిని అమ్ముకుని ఖర్చు పెట్టుకున్నా. న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నా. ఇప్పటి ప్రభుత్వానికీ చెప్పుకుంటున్నా. న్యాయం జరగకపోతుందా అని ఎదురుచూస్తున్నా. ఆనాటి ప్రభుత్వ అరాచకాలకు బలైన నాలాంటి వారెందరో రాజధాని గ్రామాల్లో లేకపోలేదు. ఆనాడు భూమి ఇచ్చినందున ఇల్లు ఇస్తామనడంతో ఉన్న దాన్ని పడగొట్టేశా. ఇవ్వలేదు. ఆ ప్రభుత్వ హయాంలో మూడేళ్లు అద్దె ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పటికీ నా కుటుంబ దుస్థితి అదే. చివరగా ఒక్కమాట... మేమూ చంద్రబాబు గారి వర్గీయులమే అంటూ బండ్ల బసవయ్య ముక్తాయింపు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment