![High Court fires on Housing Society Irregularities - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/21/HIGH-5.jpg.webp?itok=GnWe90h0)
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఉద్యోగుల కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై హైకోర్టు కన్నెర్ర చేసింది. సొసైటీని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏళ్ల తరబడి ఆర్థిక అవకతవకలు.. అవినీతి కేసులు.. వివాదాలు.. విచారణలు ఎదుర్కొంటున్న సొసైటీని తన నియంత్రణలోకి తీసుకుంది. నియంత్రణ బాధ్యతలను హైదరాబాద్ సిటీసివిల్ కోర్టు చీఫ్ జడ్జికి అప్పగించింది. సొసైటీ రోజువారీ నిర్వహణ, ఆస్తులు, ఇతర వ్యవహారాలన్నీ కూడా చీఫ్ జడ్జి ఆధ్వర్యంలోనే జరుగుతాయని తెలిపింది. సొసైటీ కార్యాలయంలోని రికార్డులను, కంప్యూటర్లను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. నిర్ణీత కాలవ్యవధి వరకు సొసైటీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. సొసైటీ ఉద్యోగుల వేతనాల చెల్లింపు నిమిత్తమే బ్యాంకు ఖాతాలను ఉపయోగించుకోవాలని పేర్కొంది.
ఈ చెల్లింపులన్నీ కూడా సివిల్‌కోర్టు అడ్మినిస్ట్రేటివ్ అధికారి చేతుల మీదుగా జరగాలని ఆదేశించింది. సొసైటీకి కేటాయించిన భూమిని సైతం స్వాధీనం చేసుకోవాలని చీఫ్ జడ్జికి సూచించింది. సొసైటీ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు దాని ఖాతాలను ఆడిట్ చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం కోఆపరేటివ్ సొసైటీస్ జాయింట్ రిజిస్ట్రార్ సి.సాయప్ప, డిప్యూటీ రిజిస్ట్రార్లు ఆర్.సంగీత, డి.విజయలక్ష్మిలతో ఓ బృందాన్ని నియమించింది. హైకోర్టు న్యాయవాదులు వేదుల శ్రీనివాస్, ఎస్.మమత ఆదేశాల మేరకు ఆడిట్ బాధ్యతలను నిర్వర్తించాలని ఆ బృందానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ బృందానికి శ్రీనివాస్‌ను చైర్‌పర్సన్‌గా నియమించింది. ఆడిట్ నిర్వహణకు అవసరమైన ఫైళ్లను, ఖాతా పుస్తకాలను ఈ బృందానికి అందుబాటులో ఉంచాలని చీఫ్ జడ్జికి సూచించింది.
ఏ రికార్డులున్నా వెంటనే చీఫ్ జడ్జికి అప్పగించండి...
సొసైటీ రికార్డులను వెంటనే చీఫ్ జడ్జికి అప్పగించాలని సహకార శాఖను, సొసైటీ ప్రస్తుత, పూర్వ కార్యవర్గ సభ్యులను హైకోర్టు ఆదేశించింది. ఆడిట్ బృందం కోరిన రికార్డులు ఇవ్వని పక్షంలో ప్రాసిక్యూషన్‌కు సైతం ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్పష్టతను తమ నుంచి చీఫ్ జడ్జి లేదా ఆడిట్ బృంద చైర్‌పర్సన్ పొందవచ్చని హైకోర్టు తెలిపింది. సొసైటీ చేసిన తీర్మానాలు, భూకేటాయింపు, లేఅవుట్ అభివృద్ధి, ఇతర కేటాయింపుల వివరాలను విచారణ నాటికి తమ ముందుంచాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
దృష్టి సారించిన ప్రధాన న్యాయమూర్తి
హౌసింగ్ సొసైటీ పాలకమండళ్ల తీరు, ప్లాట్ల కేటాయింపులు, ఓటర్ల జాబితా.. బైలాస్ సవరణ.. ఎన్నికలు, సొసైటీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు ఉద్యోగులు, సొసైటీ పాలకులు పెద్దసంఖ్యలో పిటిషన్లు దాఖ లు చేశారు. 2014 నుంచి పలు వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయి. చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ వివాదాలపై దృష్టి సారించారు. సొసైటీకి సంబంధించిన పూర్తివివరాలను పాలనాపరంగా తెప్పించుకున్నారు. అనంతరం ఈ వ్యాజ్యాలన్నింటినీ కలిపి విచారించాలని నిర్ణయించారు. అందులో భాగం గా ఇటీవల ఈ వ్యాజ్యాలను జస్టిస్ రాధాకృష్ణన్ నేతృ త్వంలోని ధర్మాసనం విచారించింది. సొసైటీ సభ్యులుగా ఉన్న హైకోర్టు ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకుని ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉత్తర్వులతో వివాదాలకు ఫుల్‌స్టాప్ పడుతుందని హైకోర్టు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment