నకిలీ పురుగు మందులను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు
ఇల్లెందు: ఇల్లెందు పట్టణంలో బుధవారం టాస్క్‌ఫోర్స్ అధికారులు నకిలీ పురుగుమందులను పట్టుకున్నారు. ఏడీఏ వాసవి రాణి కథనం ప్రకారం.. పట్టణంలోని జగదాంబసెంటర్‌లో ఉన్న సునీత ట్రేడర్స్ దుకాణం యజమాని ఆకుల నాగేశ్వరరావు కొందరు వ్యక్తులతో కొంతకాలంగా నకిలీ పురుగు మందుల తయారు చేయిస్తున్నాడు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు. స్థానికుల సమాచారంతో బుధవారం వ్యవసాయశాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నకిలీ పురుగుల మందు తయారీ చేస్తున్న వారిని పట్టుకున్నారు. ఆ ఇంటిని సీజ్ చేశారు. సుమారు రూ.8.40 లక్షల విలువైన పురుగు మందులను స్వాధీ నం చేసుకున్నారు. అనంతరం సూత్రధారి అయిన నాగేశ్వరరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ డీలర్ నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం షాపును సీజ్ చేస్తామన్నారు.
పట్టుబడింది ఆరుగురు.. ఫిర్యాదు ఒక్కరిపైనే..
అధికారులు తనిఖీలకు వచ్చినప్పడు నకిలీ పురుగుల మందు తయారీ ప్రదేశం వద్ద ఆరుగురు ఉన్నారు. నాగేశ్వరరావు, అతని కుమారుడు సాయి, గుమస్తా అల్తాఫ్‌తోపాటు మరో ముగ్గురు గుమస్తాలు ఉన్నారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా గుర్తించారు. కానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఒక్క నాగేశ్వరరావు పేరు మాత్రమే పేర్కొనడంతో వ్యవసాయాధికారులపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నాగేశ్వరరావు కొత్తగూడెంలో కూడా నకిలీ పురుగు మందులు తయారు చేయిస్తున్నాడని, అక్కడి నుంచి ఇల్లెందుకు సరుకు తెస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. నకిలీ పురుగుమందులను బయో కెమికల్స్ పేరుతో గ్రామాల్లో రైతులకు అంటగట్టి మోసం చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment