పత్తా లేని శుద్ధి | Do not cotton cleaning | Sakshi
Sakshi News home page

పత్తా లేని శుద్ధి

Published Sun, Feb 9 2014 4:28 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

పత్తా లేని శుద్ధి

పత్తా లేని శుద్ధి

  •   మున్సిపల్ కార్మికుల సమ్మెతో చెత్త కంపు
  •    పేరుకుపోతున్న చెత్త గుట్టలు
  •    ప్రత్యామ్నాయ చర్యలు అంతంతే..
  •  సాక్షి,సిటీబ్యూరో: కనీస వేతనాలు పెంచాలని, మధ్యంత భృతి, ఆరోగ్య కార్డులు ఇవ్వాలన్న తదితర డిమాండ్లతో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె నగరంలో తీవ్రరూపం దాల్చుతోంది. విధుల్లోకి రాకుండా పూర్తిగా సమ్మెబాట పట్టడంతో వీధులన్నీ కంపు కొడుతున్నాయి. నగరంలో ఎక్కడిచెత్త అక్కడే పేరుకుపోయి పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుతో సహ కార్మికుల పలు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి పారిశుధ్యం, దోమల నివారణ, వ్యర్థాల తరలింపు తదితర విభాగాల్లోని కార్మికులందరూ సమ్మెకు దిగారు. జీహెచ్‌ఎంసీలోని గుర్తింపుయూనియన్ జీహెచ్‌ఎంఈయూ, ప్రధానయూనియన్ బీఎం ఎస్ సహ పలు సంఘాలు సమ్మెకు పిలుపివ్వడంతో పనులు ఎక్కడివక్కడే స్తంభించిపోతున్నాయి.
     
    ప్రత్యామ్నాయ చర్యలు: పరిస్థితి విషమిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు ఒక్కో డివిజన్‌లో కనీసం ఒక్కో వాహనాన్నయినా వినియోగించి, వ్యర్థాల తరలింపు పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆమేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పనులు పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. చెత్త తరలింపు వాహనాలను ఎవరూ అడ్డుకోకుండా ఉండేందుకు అవసరమైనపక్షంలో పోలీసుల సహా యాన్ని తీసుకోవాలని నిర్ణయించారు.
     
    మంత్రుల ఇళ్ల వద్ద సేవలు నిలపండి: సింగిరెడ్డి  
     
    ఏడాదికాలంగా జీహెచ్‌ఎంసీ కార్మికుల న్యాయమైన డిమాం డ్లను పట్టించుకోకపోవడం దారుణమని జీహెచ్‌ఎంసీలో టీడీపీ పక్షనేత సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి   వాపోయారు. కార్మికుల సమస్యలను పట్టించుకోని మంత్రులు, ముఖ్యమంత్రి, ఇళ్లవద్ద అన్నిరకాల సేవలు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. పారిశుధ్య కార్యక్రమాలతోపాటు వారి ఇళ్లకు నీరు, కరెంట్ అన్నింటినీ బంద్‌చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడైనా వారు మేల్కొని కార్మికుల డిమాండ్లు పరిష్కరిస్తారేమోన న్నారు. పదవులు కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడంతోనే సీఎం,మంత్రులకు సరిపోతోందని..వారు కార్మికుల వేదనలేంవింటారని ప్రశ్నించారు. కార్మికుల సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉందని,అయితే ప్రజలను దృష్టిలో ఉంచుకొని విధులు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.   
     
    ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
     
    హిమాయత్‌నగర్: జీహెచ్‌ఎంసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సర్కారు ఘోర వైఫల్యం చెందిందని ఏఐటీయూసీ మండిపడింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం నారాయణగూడ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి పెద్దపెట్టున నినాదాలు చేశారు. గత నవంబర్‌లో కార్మికుల సమస్యలను  పరిష్కరిస్తామని హామీఇచ్చి విస్మరించారని, అందుకే సమ్మెకు దిగాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఏఐటీయూసీ నాయకులు ఎండీ యూసుఫ్, నరసింహ, వెంకటేశం, యాదగిరి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
     
    కార్మికుల ధర్నా, మానవహారం
     
    కవాడిగూడ: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ధర్నా అనంతరం ఇందిరాపార్కు సిగ్నల్ వద్ద మానవహారం నిర్వహించారు. బీఎంఎస్ అనుబంధ సంస్థ భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
     
    పనులు అడ్డుకుంటే కేసులు : కార్మికుల సమ్మెను ఎదుర్కొనేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించి స్పెషల్ కమిషనర్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. పారిశుధ్య పనులను ఎవరైనా అడ్డుకుంటే వారిపై కేసులు నమోదు చేయించాలని ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం పురపాలకమంత్రి మహీధర్‌రెడ్డి సమక్షంలో కార్మిక సంఘాలు, అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement