వారికి అన్ని ప్రయోజనాలూ ఇవ్వాల్సిందే | They should have all the benefits | Sakshi
Sakshi News home page

వారికి అన్ని ప్రయోజనాలూ ఇవ్వాల్సిందే

Published Thu, Aug 16 2018 4:49 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

They should have all the benefits - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ ప్రాజెక్టు వల్ల ప్రభావిత, నిర్వాసిత కుటుంబాలకు చట్ట ప్రకారం వర్తింపచేయాల్సిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్రయోజనాలను వర్తింప చేసి తీరాల్సిందేనని ఎస్‌సీసీఎల్‌ అధికారులను హైకోర్టు ఆదేశించింది. అధికారుల దయాదాక్షిణ్యాలకు వదిలేయకుండా, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఎస్‌సీసీఎల్‌పై ఉందని స్పష్టం చేసింది. వారికి చట్ట ప్రకారం అందించాల్సిన సాయాన్ని అందించి తీరాల్సిందేనంది. ఇందుకు సంబంధించి కొన్ని విధి విధానాలను నిర్దేశించింది. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ విషయంలో 2005లో జారీచేసిన జీవో 68, ప్రభావిత, నిర్వాసితుల్లో గిరిజన కుటుంబాలు ఉంటే ఆ కుటుంబంలో నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ 2010లో జారీ చేసిన జీవో 34కు అనుగుణంగా కొత్తగూడెం జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించాలని బాధిత వ్యక్తులు, కుటుంబాలను హైకోర్టు ఆదేశించింది.

రెండు వారాల్లో వినతిపత్రాలు పెట్టుకోవాలని, అలా సమర్పించిన వినతి పత్రాలపై మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌కు స్పష్టం చేసింది. ఈ విషయంలో జాయింట్‌ కలెక్టర్‌కు 2013 భూసేకరణ చట్టంకింద నియమితులైన ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ దిశా నిర్దేశం చేయాలంది. వ్యక్తిగత, గ్రూపు వినతులు, అర్హతలు, కుమార్తెల అభ్యర్థనలు తదితర వాటిన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. జీవో 68, జీవో 34 కింద ప్రభావిత, నిర్వాసిత కుటుంబాలకు దక్కాల్సిన ప్రయోజనాలన్నీ వారికి దక్కేలా చూడాలని ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌కు హైకోర్టు తేల్చి చెప్పింది. అటు జాయింట్‌ కలెక్టర్‌కు, ఇటు కమిషనర్‌కు పూర్తిస్థాయి సహకారం అందించాలని సింగరేణి కాలరీస్‌ అధికారులను ఆదేశించింది. 

డబ్బు చెల్లింపు బాధ్యత జేసీలకు.. 
కనీస వ్యవసాయ వేతనం అందని అర్హులైన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి తాజాగా సవరించిన లేబర్‌ రేట్ల ప్రకారం లేదా కనీస వేతన చట్టంకింద తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లోని రేట్లలో ఏవి ఎక్కువఉంటే వాటి ప్రకారం చెల్లింపులు జరిగేలా చూడాలని జాయింట్‌ కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియను నాలుగు నెలల్లో పూర్తి చేయాలంది. ఇందుకు సంబంధించిన డబ్బును జాయింట్‌ కలెక్టర్‌కు అందుబాటులో ఉంచాలని సింగరేణి కాలరీస్‌ అధికారులను ఆదేశించింది. ఎంక్యూ, టీక్యూ క్వార్టర్లలో నివాసం ఉంటూ ఎవరైతే విద్యుత్, నీటి కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారో వారికి ఆ సౌకర్యాన్ని రెండు వారాల్లో కల్పించాలంది. ఖాళీ చేసేందుకు ఎవరైతే హామీ ఇచ్చారో వారు ఆర్‌అండ్‌ఆర్‌ ప్రయోజనాల ఉత్తర్వులు జారీఅయిన 30 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించింది. నివాస ప్రాంతాలకు 250 మీటర్ల పరిధిలో ఎటువంటి బ్లాస్టింగ్‌ కార్యకలాపాలు చేపట్టరాదని అధికారులకు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. 

భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా, యల్లందు మునిసిపాలిటీ పరిధిలో 450.57 హెక్టార్లలో సింగరేణి అధికారులు ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ ప్రాజెక్టు చేపట్టారు. దీని వల్ల ప్రభావితమవుతున్న, నిర్వాసితులవుతున్న తమకు సింగరేణి అధికారులు చట్ట ప్రకారం ప్రయోజనాలను వర్తింప చేయడం లేదంటూ ఐ.దిలీప్‌కుమార్, మరో 60 మంది హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. ప్రభావిత, నిర్వాసిత కుటుంబాల విషయంలో సింగరేణి అధికారుల వ్యవహారశైలిని తప్పుపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement