రాజ్యాంగ విరుద్ధం | high court is strict on singareni Dependent jobs | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ విరుద్ధం

Published Fri, Mar 17 2017 2:29 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

రాజ్యాంగ విరుద్ధం - Sakshi

రాజ్యాంగ విరుద్ధం

సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు స్పష్టీకరణ
ఉద్యోగాల భర్తీ పథకం రద్దు.. సర్క్యులర్‌ కూడా..
పథకంలోని నిబంధనలు వివక్షాపూరితం
మహిళలు, దత్త పుత్రులు ఎలా అనర్హులవుతారు?..
ఉద్యోగి ‘అన్‌ఫిట్‌’ అయినా 60 ఏళ్ల దాకా ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించిన ధర్మాసనం


సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. సింగరేణిలో ఎన్నో ఏళ్లుగా అమలు చేస్తూ వస్తున్న వారసత్వ ఉద్యోగాల భర్తీ పథకాన్ని కోర్టు రద్దు చేసింది. ఈ పథకం కింద ఉద్యోగాల భర్తీ కోసం సింగరేణి కాలరీస్‌ గతేడాది డిసెంబర్‌ 20న జారీ చేసిన సర్క్యులర్‌ను కూడా రద్దు చేసింది. ఈ వారసత్వ ఉద్యోగాల భర్తీ పథకం రాజ్యాంగ విరుద్ధమని, వివక్షాపూరితమని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ‘‘కారుణ్య నియామకాలకు ఏదైనా పథకముంటే.. నిజమైన అనారోగ్య కారణాలతో పని చేయలేని ఉద్యోగుల వారసులకే వర్తింపజేయాలి. సుప్రీం కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడే ఈ నియామకాలు ఉండాలి’’అని తీర్పులో స్పష్టం చేసింది.

సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ గోదావరిఖనికి చెందిన కె.సతీశ్‌కుమార్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు గురువారం విచారించింది. వి.శివమూర్తి వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో 2008లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును కోర్టు ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకుంది. కారుణ్య నియామకాల విషయంలో... ఓ ఉద్యోగి వైద్యపరంగా ‘అన్‌ఫిట్‌’అయినంత మాత్రాన అతడిని అశక్తుడని (ఇన్వాలిడేషన్‌) చెప్పడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పిందని, సింగరేణి పథకంలో దీని ప్రస్తావనే లేదని ధర్మాసనం పేర్కొంది.

58 లేదా 60 ఏళ్ల దాకానా?
‘‘ప్రస్తుత పథకంలో వారసత్వ నియామకం కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగి.. మెడికల్‌గా  అన్‌ఫిట్‌ అయితే పదవీ విరమణకు రెండేళ్ల ముందు (58 సంవత్సరాలు) వరకు ఆయనను ఉద్యోగంలో కొనసాగించాలని ఉంది. అలాగే వారసత్వ ఉద్యోగం పొందాలని కోరుతున్న వ్యక్తి కూడా మెడికల్‌గా అన్‌ఫిట్‌ వ్యక్తయితే.. పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఉద్యోగి పదవీ విరమణ వయసు(60 ఏళ్లు) వరకు పని చేయాలని ఉంది. దీన్నిబట్టి చూస్తే.. వైద్యపరంగా ఉద్యోగంలో కొనసాగేందుకు తగని వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకే ఈ పథకం తెచ్చినట్టు స్పష్టమవుతోంది. ఈ నిబంధనల వల్ల సదరు వ్యక్తి 58 లేదా 60 ఏళ్ల వరకు ఉద్యోగంలో కొనసాగవచ్చు. కానీ వైద్యపరంగా ఉద్యోగి ఆశక్తుడయి, ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చి, కుటుంబానికి భారమైనప్పుడు మాత్రమే.. వారసత్వ ఉద్యోగం ఇవ్వాలని శివమూర్తి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. సింరేణి పథకంలో మాత్రం అలాంటివేమీ లేవు. ఉద్యోగావకాశాల్లో రాజ్యాంగ అధికరణ 16కు ఇది విరుద్ధం’’అని ధర్మాసనం స్పష్టంచేసింది.

ఇది లింగ వివక్ష కాదా?
వైద్యపరంగా అన్‌ఫిట్‌ అయిన ఉద్యోగుల కోసం ఈ పథకాన్ని తెచ్చినప్పుడు.. వారి వారసులకు ఉద్యోగం వచ్చేంతవరకు ఆ వ్యక్తులు 58 లేదా 60 ఏళ్ల వరకు కొనసాగాలని చెప్పడంలో అర్థం లేదని కోర్టు స్పష్టంచేసింది. ‘‘భార్య, భర్త ఇద్దరూ సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తుంటే వారు వారసత్వ నియామక పథకానికి అర్హులు కాదన్న నిబంధన ఉంది. అయితే ఇద్దరిలో ఒకరు అనారోగ్య కారణాలతో కాకుండా ఇతర కారణాలతో తప్పుకుంటే.. అప్పుడు వారు వారసత్వ పథకానికి అర్హులని నిబంధనల పెట్టారు. కేవలం పురుషుడు మాత్రమే వారసత్వ నియామకానికి అర్హుడంటూ నిబంధన రూపొందించారు. కుమారుడు లేదా అల్లుడు లేదా తమ్ముడు మాత్రమే అర్హులుగా నిర్ణయించారు. వారసుల్లో స్త్రీ ఉంటే ఆమె ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు అర్హురాలు కారు. ఇది లింగవివక్షను చూపుతోంది. కాబట్టి ఈ పథకం రాజ్యాంగంలోని 15, 16 అధికరణలకు విరుద్ధం. సింగరేణి కాలరీస్‌ మాత్రం ఈ వివక్షను సమర్థించుకుంది. బొగ్గు గనుల్లో 400 మీటర్ల లోతులో పని చేయాల్సి ఉంటుందని, ఆ పనిని స్త్రీలు చేయలేరని సింగరేణి కాలరీస్‌ చెబుతోంది. అలాగైతే భార్య, భర్తలిద్దరూ సింగరేణి ఉద్యోగులైతే వారసత్వ ఉద్యోగ పథకానికి అనర్హులన్న నిబంధన పెట్టాల్సింది కాదు. ఇద్దరినీ సమానంగానే చూసి ఉండాల్సింది’’అని కోర్టు పేర్కొంది.

దత్త కుమారులు ఎందుకు అనర్హులు?
దత్తత తీసుకున్న కుమారులు ఈ పథకానికి అనర్హులుగా నిర్ణయించడాన్ని కూడా కోర్టు ప్రశ్నించింది. ‘‘మతంతో సంబంధం లేకుండా దత్తత తీసుకునేందుకు చట్టాలు అనుమతినిస్తున్నాయి. అయితే దత్త పుత్రుడు సదరు ఉద్యోగిపై ఆధారపడిన వ్యక్తి కాదని చెప్పడం చట్ట విరుద్ధమే కాదు.. కామన్‌సెన్స్‌కు కూడా విరుద్ధం. మహిళలను, వికలాంగులను, మానసిక వైకల్యమున్న వారిని సదరు ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తున్న వారిగా పరిగణించబోమన్న నిబంధన ఎంత మాత్రం సరికాదు. ఈ పథకం కేవలం వైద్యపరంగా ఉద్యోగంలో కొనసాగేందుకు తగని వ్యక్తుల కోసం ఉద్దేశించినదైతే.. స్త్రీలు, పురుషులు, వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులు అంటూ తేడాలు చూపాల్సింది కాదు. స్త్రీలను, దత్త పుత్రులను, వైకల్యంతో బాధపడుతున్న వారిని ఈ పథకం పరిధి నుంచి తప్పించం కచ్చితంగా వివక్షాపూరితమే. వారసత్వం ఆధారంగా ఏ ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ ఈ వారసత్వ ఉద్యోగాల భర్తీ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తున్నాం’’అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.

సుప్రీంలో అప్పీల్‌కు సీఎం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కార్మికుల కుటుంబాలకు డిపెండెంట్‌ ఉద్యోగాలు దక్కే విషయంలో తగిన న్యాయ పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుపై వీలైనంత త్వరలో సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయ పోరాటం చేస్తామన్నారు. కార్మికుల సమస్యల పట్ల, కార్మికుల చట్టాలపై గట్టి పట్టున్న సీనియర్‌ న్యాయవాదుల బృందాన్ని నియమించి సుప్రీంలో వాదనలు వినిపిస్తామన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

కాయకష్టంతో పని చేస్తున్న కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే డిపెండెంట్‌ ఉద్యోగాలివ్వాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. కొందరు దురుద్దేశంతో దీనిపై కోర్టుకు వెళ్లారని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలపై అడ్వకేట్‌ జనరల్, సింగరేణి అధికారులు, సీనియర్‌ అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో టీజీబీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత, ఎంపీ సుమన్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్, విప్‌ నల్లాల ఓదేలు, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ ఎస్‌పీ సింగ్, ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సింగరేణి సీఎండీ శ్రీధర్, అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement